తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెక్కే శిల్పం- విద్యార్థి.
విద్యార్థుల భవిష్యత్తును.. తద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే.
మన భారతీయ విద్యావిధానం ప్రపంచంలోనే విశిష్టమైనది.
క్రీస్తుపూర్వమే మన దేశంలో గొప్ప గొప్ప గురుకులాలు ఉండేవి.
నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి.
శాస్త్రపారంగతలున్న గురువులు వివిధ శాస్త్రాలలో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేవారు.
కొందరు గురువులు దేశ చరిత్ర గమనాన్నే మార్చారు.
శాస్త్రాల పురోగతిలో మైలురాళ్లుగా నిలిచారు.
మన పురాణాల్లో గురుశిష్యుల సంబంధాలపై బోలెడన్ని కథలు ఉన్నాయి.
గొప్ప గొప్ప గురువుల గురించి, వారి విద్వత్తును గురించి, వారు పొందిన గౌరవాల గురించి పురాణాల్లో చాలా ప్రస్తావనలు ఉన్నాయి.
మన మత, ధార్మిక గ్రంథాలలో గురువుల ప్రస్తావన విశేషంగా కనిపిస్తుంది.
ఆధ్యాత్మిక రంగంలో మనకు చాలామంది గురువులు ఉన్నాయి.
వారిలో కొందరు జాతికి దిశానిర్దేశం చేసిన అరుదైన గురువులు.
ధార్మిక జీవన పునరుద్ధరణ కోసం వారు నిరుపమానమైన కృషి సాగించారు.
సమాజంలోని వివక్షలను తొలగించేందుకు, శాంతి, సామరస్యాల వైపు ప్రజలను మళ్లించేందుకు వారి బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయి.
నృత్య, సంగీత సాహిత్యాది కళల్లోనూ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ చాలామంది గొప్పగొప్ప గురువులు మనకు దర్శనమిస్తారు.
వారినందరినీ స్మరిస్తూ, వారి మార్గంలో నడవడమే మనం వారికి సమర్పించే గురుదక్షిణ.
ఈ ప్రపంచంలో గురుశిష్య పరంపరకు ఆద్యమైనది మన భారతదేశమే.
గురువంటే శిష్యులకు గురి.
శిష్యులపై గురువులది అవ్యాజమైన వాత్సల్యం.
చదువు మాత్రమే కాదు, విద్యార్థులకు వినయ, విధేయతలను నేర్పేవారే గురువులు. ఎలాంటి స్వార్థం లేకుండా గురువులు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. అలాంటి గొప్ప గురువులను స్మరించుకోవడానికి ఏటా సెప్టెంబరు 5న మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
మనిషి అభివృద్ధిపథంలో నడుస్తున్న ప్రతిచోటా ఒక మంచి ఉపాధ్యాయుడు ఉంటాడు. వాళ్లు కేవలం సిలబస్‍లోని పాఠాలను చెప్పడంతోనే సరిపెట్టుకోరు. విద్యార్థులకు లోకరీతిని అవగతం చేస్తారు. నడవడికను తీర్చిదిద్దుతారు. ఉన్నతమైన ఆశయాలను ఉద్బోధిస్తారు. ఆశయసాధన దిశగా దిశానిర్దేశం చేస్తారు. స్థూలంగా విద్యార్థుల జీవితాలనే ప్రభావితం చేస్తారు.
అటువంటి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review నమస్తే టీచర్!.