మనందరి ‘స్టార్‍’ మార్చిన మాష్టార్లకు వందనం

గణితం మాస్టారు సెలవు పెట్టారని తెలిస్తే ఎగిరి గంతేసిన రోజులు..
తెలుగు క్లాసు సాయంత్రం లాస్ట్ పీరియడ్‍ అయితే ఆ రోజు పండుగే.
సైన్స్ సారు రోజూ కానుగ బెత్తాలు తెప్పిస్తారు.. అవి ఎవరి వీపు పగలుగోడతాయోనని క్లాసయ్యే వరకు ఒకటే భయం..
గ్రామర్‍ చెప్పే ఆంగ్లం టీచర్‍ ఎప్పటికీ గ్లామర్‍గానే కనిపించే వారు..
సోషల్‍ టీచర్‍ పాఠాల కంటే జోకులే బాగా చెబుతారని టాక్‍..
ఇవన్నీ మన పసిడి బాల్యంలో కేరింతలు కొట్టించిన రోజులు..
ఏదేమైనా ఆ రోజులు వేరు.. ఆ జ్ఞాపకాలు వేరు..
ప్రతి విద్యార్థికి తన జీవితకాలంలో ఏం గుర్తున్నా లేకున్నా జీవితాంతం గుర్తుండేది మాత్రం చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులే..
ఆ అల్లరీ మరిచిపోలేం.. ఆ అల్లరిని అదుపులో పెట్టడానికి వీపుపై పడిన బెత్తం దెబ్బలనూ మరిచిపోలేం.. ఆ దెబ్బలు కొట్టిన టీచర్లనూ మరిచిపోలేం..
సెప్టెంబరు 5.. అలాంటి రోజులన్నీ గుర్తుకుతెచ్చే రోజు. అంతేకాదు.. జీవితంలో ఎక్కడున్నాం? ఏం చేస్తున్నాం? అందుకు దోహదపడిన ఉపాధ్యాయులెవరో జ్ఞప్తికి తెచ్చుకునే రోజు కూడా..
ఎంత అల్లరి చేయడానికి అనుమతించాలో.. ఎంత సరదాను తరగతి గదిలో పండించాలో ఉపాధ్యాయులకు బాగా తెలుసు.

అందరు టీచర్లు ఒకటి కాదు..
కొందరు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. ఇంకొందరు పాఠాలు తప్ప అన్నీ చెబుతారు. మరికొందరు టీచర్లు మాత్రం పాఠాలతో పాటు చాలా విషయాలు చెబుతారు. చాలామంది టీచర్లు పిల్లలతో చనువుగా ఉంటారు. ఇంకొందరు గంభీరంగా ఉంటారు. కొందరు పాఠం చెప్పే వరకు గంభీరంగా ఉండి, పాఠం చెప్పడం పూర్తయిన వెంటనే తరగతి గదిలోని పిల్లల్లా మారిపోతారు. కొందరు ఉపాధ్యాయులు పెద్ద గొంతుతో పాఠాలు చెబుతారు. ఇంకొందరు ఏదో రహస్యం చెబుతున్నట్టుగా చెప్తారు. కొందరు నోరే తెరవరు.. బోర్డు మీద రాయడం తప్ప. మరికొందరు ఉపాధ్యాయులైతే పాఠం చెబుతుంటే ప్రవాహంలా సాగిపోతుంటుంది. ఎవరు ఎలా చెప్పినా.. వారంతా పిల్లల కోసం జీవితాలను వెచ్చించిన ఉపాధ్యాయులు. టీచర్‍.. మాస్టారు.. గురువు.. సారు.. విద్యార్థులు ఏ పేరుతో గుర్తుంచుకున్నా.. జీవితాంతం చెరగని ముద్ర వారిది. టీచర్లు కూడా ఒకప్పుడు విద్యార్థులే. అందుకే అతిగా అల్లరి చేసినా.. అసలు అల్లరి చేయకున్నా..

దండం దశగుణ భవేత్‍..
ఉపాధ్యాయుడు అనగానే బెత్తం చేత్తో పుచ్చుకుని అటూఇటూ ఆడించే రూపమే కళ్లెదుట కనిపిస్తుంది. ‘దండం దశగుణ భవేత్‍’ అనేది టీచర్ల నినాదం. ఈ నినాదంపై టీచర్లకు చాలా నమ్మకం. విద్యార్థులను సరైన దారిలో పెట్టేది అదే అని వారికి బాగా తెలుసు. ఎందుకంటే ఒంటి మీద ఒక్క దెబ్బ పడితే విద్యార్థిలో ఉన్న వంద వికారాలు బయటపడి దారిలోకి వస్తారని.. కొందరు టీచర్లు దండించడాన్ని ఆచరించి చూపుతారు. అరచేతులు చాపమంటే బెత్తం దూరానికి సాగకుండా పిల్లలు మరీ చేతులు ముందుకు చాచి దెబ్బ తగలని టెక్నిక్‍ను ఉపాధ్యాయులు పాటిస్తారు. కొందరు టీచర్లు బెత్తాన్ని టేబుల్‍ మీద ఉంచుతారు కానీ, దాన్ని వాడేది తక్కువే. కొందర అసలు బెత్తం చేతిలో ఉండాలనే కోరుకోరు. కానుగ బెత్తాలు కొందరు.. వెదురు బెత్తాలు కొందరు.. ఇంకొందరు చెక్క డస్టర్‍ను దాదాపు మారణాయుధంతో సమానంగా వాడతారు. కొందరు చాక్‍పీస్‍ను ఉండేలు కన్నా షార్ప్గా విసురుతారు. కొందరు తొడపాశం బహుతీపిగా పెడతారు. జీవహింస ఇష్టపడని టీచర్లు క్లాసులో బలమైన విద్యార్థిని లేపి.. అతని ద్వారా మిగతా వారి చెంపలు పగులగొట్టిస్తారు. కాసేపు అవమానం అవుతుంది. ఆ తరువాత? ఆ.. మనకిది మామూలే అని ఇంటర్వెల్‍లో ఐస్‍ కొనుక్కోవడానికి విద్యార్థులు పరుగెడతారు.
టీచర్‍ మూడ్‍ బాగుంటే పండుగే..
కొందరు ఉపాధ్యాయులు మూడ్‍ బాగుంటే క్లాసును క్యాన్సిల్‍ చేసి ఇవాళ కథలు చెప్పుకుందామా అని అంటారు. ఇక క్లాసు యమా కులాసా. పాటలు వచ్చిన వాళ్లు పాడండ్రా అంటే ఊళ్లోని సినిమా హాళ్లన్నీ క్లాసులోకి వచ్చేస్తాయి. ఒకడు ఘంటసాల, ఒకడు బాలు, ఒకమ్మాయి ఎస్‍.జానకి.. గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయి.. ఓహ్‍.. ఒకటే పాటల ప్రవాహం.. ఒకటే అల్లరి. కొందరు టీచర్లకు మూడ్‍ పాడైతే విద్యార్థులు ఏ తప్పు చేయకున్నా చిర్రుబుర్రులాడతారు. కొందరు మాత్రం ఎవడో ఒక విద్యార్థిని లేపి బోర్డు మీద ఏదొకటి రాయమని చెప్పి హాయిగా కునుకు తీస్తారు. కొందరు ఫలానా పాఠం పేరు చెప్పి దానిని చదవాలని క్లాసు చివరలో ప్రశ్నలు అడుగుతానని చెప్పి విశ్రాంతి తీసుకుంటారు. గురువుల చిత్తం కొద్దీ విద్యార్థులకు చదువుల ప్రాప్తం.
కొందరు ఇష్టం.. ఇంకొందరు కష్టం..
విద్యార్థి ఎంత చదువురి అయినా, కాకపోయినా తను ఇష్టపడే.. ఇష్టపడని టీచర్లు ఉంటారు. తెలివైన వాళ్లకు లెక్కల మాస్టారంటే ఇష్టం. బొత్తిగా లెక్కలు రాని వాళ్లకు సోషల్‍ మాస్టారే హీరో. ఆటల్లో గెంతే వారికి పీటీ సారంటే ఇష్టం. బొమ్మలు వేయడం వచ్చిన విద్యార్థులకు డ్రాయింగ్‍ మాస్టారు ఇష్టం. ఇంటికి ఇంగ్లిష్‍ పేపరు వేయించుకునే విద్యార్థులకైతే ఇంగ్లిష్‍ టీచర్‍ దగ్గర భోగం నడుస్తుంది. వేమన పద్యాలు వచ్చిన విద్యార్థి తెలుగు టీచరమ్మకు ముద్దు పిల్లాడైపోతాడు. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే టీచర్‍.. ఆ ప్రశ్నలు అడుగుతానని చెప్పిన రోజున.. ఆయన సైకిల్‍పై నుంచి కిందపడిపోయి ఆ రోజు స్కూలుకు రాకూడదని మొక్కుకున్న విద్యార్థులు మనలో ఎంతమందో!?. అయితే అలాంటి విద్యార్థుల మొక్కులే అలాంటి ఉపాధ్యాయులకు అమోఘ సంజీవనులుగా పనిచేస్తాయి.
బాగు కోరేవాడే బడిపంతులు
తండ్రి బజారులో కనిపిస్తే అల్లరిగా తిరిగే కొడుకు ఇంటికి పరుగెత్తుతాడు. టీచర్‍ కనిపించినా అల్లరిగా తిరిగే పిల్లలు పరుగెత్తుతారు. తండ్రి తరువాత తండ్రిలాంటి వాడు టీచర్‍. తల్లి తరువాత తల్లిలాంటిది టీచరమ్మ. ఇంట్లో మంచి అలవాట్లు. బడిలో విద్యాబుద్ధులు. కన్నందుకు తల్లిదండ్రులకు తప్పదు. కానీ, కనకపోయినా పిల్లల బాగు కోరే వాడే మంచి బడిపంతులు. లోకంలో చాలా ఉపాధులు ఉంటాయి. కానీ, టీచర్లు అయిన వారిలో 90 శాతం మంది టీచరు కావాలని అయినవారే. పిల్లలకు మంచి చెప్పాలని ఆ వృత్తిలోకి వచ్చిన వారే. పిల్లలనే పూల మధ్యలో నివసించడమే వారికి ఇష్టం. కాలక్రమంలో విద్యార్థులు పెద్దవాళ్లై దేశాలు దాటుతారు. కానీ, టీచర్లు ఆ స్కూలులో, అదే తరగతి గదిలో, అదే సిలబస్‍ మళ్లీ మళ్లీ చెబుతూ అక్కడే ఆగిపోతారు. వారు విద్యార్థుల నిచ్చెనలు. ఇవాళ (సెప్టెంబరు 5) ఆ నిచ్చెన దిగి విద్యార్థులంతా తమ ఉపాధ్యాయులను తలచుకోవాలి. ఫోన్‍ నంబర్‍ ఉంటే ఫోన్‍ చేసి నమస్కారం చెప్పుకోవాలి. దగ్గరలో ఉంటే వెళ్లి ఒక పూలహారం వేసి ఆశీర్వాదం తీసుకోవాలి.
గురువంటే జ్ఞానం. ఆ మార్గదర్శికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
విద్యార్థిని చెక్కే శిల్పి..
ఉపాధ్యాయుడు
‘వ్యక్తిత్వాన్ని నిర్మించే, మనోబలాన్ని పెంచే, బుద్ధి వైశాల్యాన్ని విస్తరించే, ఒక మనిషి తన కాళ్లపై తాను నిలబడేలా చేసే విద్య మనకు కావాలి’ అంటారు స్వామీ వివేకానంద. ఒక బలమైన దేశానికి నిజమైన మూలాధారం ఉపాధ్యాయులే.
ఎందుకంటే పైన చెప్పుకున్న వంటి విద్య అటువంటి ఉపాధ్యాయులే బోధించగలరు. అందుకే అంటారు.. ‘‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ అని. డాక్టర్‍ సర్వేపల్లి రాధాకృష్ణన్‍ అటువంటి అరుదైన గురువుల్లో అరుదైన వారు. ఆయన దేశానికి తొలి రాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పనిచేసి ఆ పదవులకే వన్నె తెచ్చారు. రాజ్యాంగ పదవులు చేపట్టక ముందు ఆయన సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. దేశంలోని ప్రతిష్టాత్మక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా పాఠాలు చెప్పారు. పాఠాలు బోధించిన ప్రతి విద్యాసంస్థలోనూ ఆయన విద్యార్థులపై చెరగని ముద్ర వేశారు. మద్రాసు ప్రావిన్సులోని తిరుత్తణి సమీపంలోని ఓ కుగ్రామంలో ఆయన జన్మించారు. రాధాకృష్ణన్‍ బంధువు ఒకరు యథాలాపంగా ఓ ఫిలాసపీ పుస్తకం ఇచ్చారు. దాంతో అసంకల్పితంగానే ఆయన తత్త్వశాస్త్రాన్ని అభ్యసించారు. వేదాంత విలువలు, వాటి అధి భౌతికతపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. చదువు పూర్తయిన ఏడాదిలోగానే మద్రాస్‍ ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. అనంతరం మైసూరు మహారాజా కాలేజీలో ప్రొఫెసర్‍గా అవకాశం లభించింది. ఆనాటి కాలంలోనే ఆయన తన బోధనా పటిమతో విద్యార్థులకు చేరువయ్యారు. మైసూరులో పనిచేస్తున్న సమయంలోనే రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ సిద్ధాంతంపై తొలి పుస్తకం కాశారు. దీనికి మేధావుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. దీంతో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా చేరారు. మైసూరు వదిలి కలకత్తా వెళ్తున్నపుడు గుర్రపు బండిన పూలతో రథంలా అలంకరించి విద్యార్థులు దానిని స్వయంగా లాగుతూ ఆయనను మైసూరు రైల్వేస్టేషన్‍ వరకు లాక్కుని వెళ్లారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రోజుల్లో గురువులకు సమాజంలో ఎంత గౌరవం లభించేదో.

లోకానికి ఓ లేఖ
‘‘ఇంకో రెండు గంటల్లో మా అబ్బాయి మొట్టమొదటిసారిగా బడిలో చేరబోతున్నాడు. ఈ లోకంలో ఉన్న మీరందరూ వాడిని చేయి పట్టుకుని నడిపిస్తారని నా ఆశ.
కొంతకాలం పాటు అంతా వింతగానూ, విడ్డూరంగానూ ఉండక తప్పదు. మీరందరూ వాడిని కొంచెం సుకుమారంగా చూస్తారని కూడా నా ఆశ. ఇప్పటిదాకా ఇంట్లో పెత్తనమంతా వాడిదేనని మీకూ తెలుసు. ఇంటి వెనుక తోట అంతా వాడి పరిపాలనలోనే ఉండేది. ఎప్పుడైనా కన్నులు చెమ్మగిల్లితే పక్కనే నా కోసం చూస్తాడు.
కానీ ఇప్పుడో.. మొత్తం జీవిత రంగమే మారిపోతున్నది. కొంచెంసేపు గడిస్తే, ఇంటి ముందరి మెట్లు దిగి, వెనుకకు తిరిగి టాటా చెప్పి, గొప్ప సాహసవీరుడన్నట్టు బడి దగ్గరకు వస్తాడు. ఈ సాహసంలో విఘాతాలు, విషాదాలు, విచారాలు ఉండటం కూడా తథ్యమే.
ఈ ప్రపంచంలో జీవించడానికి శ్రద్ధా విశ్వాసాలు, ప్రేమ, ధైర్యం ఉండి తీరాలి. వాడు ఇంకా అవేవీ తెలియని చిన్నతనంలో ఉన్నాడు. కనుక వాడిని దగ్గరకు తీసుకుని, వాడు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ అర్థమయ్యేటట్టు చేస్తారని నా ఆశ. వాడికి శిక్షణ ఇవ్వండి. చేతనైతే ఆ పని సౌమ్యంగా చేయండి. వాడు జీవితం గురించి నేర్చుకోక తప్పదు. మనుషులంతా న్యాయబద్ధులుగా ఉండరనీ, అందరూ నిజమే చెప్పరనీ నాకు తెలుసు. అసుర శీలం కలవాళ్లతో పాటు అమర శీలం కలవాళ్లు కూడా ఉన్నారనీ, ప్రజలను జీవచ్ఛవాలుగా చేసే రాజకీయవాదులతో పాటు ప్రజాసేవకై ఆత్మార్పణం చేసే నాయకులు ఉన్నారనీ వాడికి తెలియాలి. ఒకడు శత్రువుగా ఉంటే ఇంకొకడు మిత్రుడిగా ఉంటాడని కూడా నేర్పండి.
పోట్ల దున్నపోతులాగా పుండరించి మీద మీదకు వచ్చే వాళ్లే మట్టికరిచి మట్టిలోనే కలిసిపోతారని కూడా వాడికి ఎంత త్వరగా తెలిస్తే అంత మంచిది. ఉద్గ్రంథాలలో ఉన్న అద్భుతాలు వాడికి తెలియాలి. వియత్పథంలో విహంగాలు, దినమణి రశ్మిలో తేనెటీగలు, హరితగిరులపై అలరించే విరులు.. ఈ అన్నిటి వెనుక ఉన్న సృష్టి రహస్యం అవగాహన చేసుకోవడానికి వాడిని కొంతసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి.
మోసగించి ఎదగడం కంటే కపటం లేని నిష్ఫలత్వంతో ఉండటమే గౌరవమని వాడికి తెలియాలి. ఇతరులెంత చెప్పినా ఒప్పుకోలేనప్పుడు వాడి ఊహలపై విశ్వాసం వాడికి ఉండనివ్వండి.
పేరు కోసమో, పెన్నిధి కోసమో పిచ్చిగా రెచ్చిపోయే మందజనుల వెంట పడనివ్వని మనోబలం వాడికి ఇవ్వగలరా? అందరూ చెప్పేది వినవచ్చు కానీ, అంతరంగంలో ఉన్న సత్యమనే తెరమీద వెలుగులో నిలబడగలిగిన వాటినే వాడు అనుసరించేలా చేసి చూపించండి. బతుకుదెరువు విషయంలో భుజ బలాన్ని, బుద్ధి బలాన్ని ఎక్కువ ఆశపెట్టిన వాడికే ముడుపు కట్టినప్పటికీ ఆ ప్రభావం వాడి హృదయం మీద కానీ, అంతరాత్మ మీద కానీ పడకూడదు. అనుచితమైన పని చేయాలని అలమటించి అరచి చచ్చేవాళ్లు ఎంతమంది ఉన్నా తనకు ఉచితమని తెలిసిన దాని కోసం నిలబడి ప్రతిఘటించే బలం వాడికి రావాలి. ఈ శిక్షణ అంతా సౌమ్యంగా ఇవ్వండి. కానీ గారాబం చేయొద్దు. నిప్పులో ఉండాల్సిన పరీక్ష నెగ్గి నిగనిగలాడుతూ వెలుపలికి వచ్చినదే నిజమైన ఉక్కు అనే సంగతి కూడా నాకు తెలుసు. నా ఆశ ఆకాశమంత అంటే, ఆ మాట నిజమే, కానీ మీరు చేయగలిగింది చేయండి. ఇంతగా అభ్యర్థించడం ఎందుకంటే, ఈ రోజు వరకు వాడు అభం, శుభం ఎరుగడు. ఇతరులను ద్వేషించడం ఎరుగడు.

ఉపాధ్యాయుల ప్రార్థన
‘భగవాన్‍! నాకు విహితమైన అధ్యాపక వృత్తి ఎంత పవిత్రమైనదో, ఎంత సమున్నతమైన కర్తవ్యమో గుర్తించి, సదా స్మరించుకొనుటకు నీ సహాయమర్థించుచున్నాను. విశ్వాంతరాళమందు అత్యంత అమూల్యమైన విద్యార్థి మనసులతో నేను వర్తించుచు వ్యవహరించుచున్నానని అనుక్షణమూ స్మరించుకొనుటకు నీ సహాయము వేడుకొనుచున్నాను. విద్యార్థుల లేత మనసులపై కాలము సైతము చెరపలేని ప్రగాఢ ముద్రులను వేయుచుంటినను స్మరణ నాకు సదా అనుగ్రహింపుము.
నెమ్మదిగా నేర్చుకొను, నేర్చుకొనుటకు ఇష్టము లేని విద్యార్థులకు సైతము నేర్చుగా నేర్పగల ఓర్పునొసంగి నా బోధనకు తగిన ప్రతిభనిచ్చి సహాయమొనర్చుము. క్రమశిక్షణ విషయంలో అవసరమగు కర్కశత్వమును పైకి బాహాటముగా ప్రదర్శించుచున్నను, అంతరంగమున మాత్రము అనురాగ పూర్వకమైన హృదయమొసంగి సహాయమందిమ్ము. వ్యంగ్య ధోరణికి, మనసునకు బాధ కలిగించు సంభాషణమునకు నన్ను దూరము చేసి కాపాడుము.
తమ శాయశక్తులా కృషి చేయు విద్యార్థులను, ఆ కృషి సర్వోత్తమమైనది కాకున్నను, వారిని నిరంతరము ప్రోత్సహించుటకు, వారిని ఎన్నడూ నిరుత్సాహపరచకుండుటకు తగిన శక్తియుక్తులను ప్రసాదింపుము. కేవలం కంఠస్థమొనర్చుటగాక, విద్యార్థులు తమంతట తాము సొంతముగా ఆలోచించగల మేథాశక్తిని అలవర్చుకోగల సదభ్యాసమును వారికి నేర్పగల బలమొసంగుము.
పరాత్పరా! నా ఉద్యోగ బాధ్యతల నిర్వహణములో నైరాశ్యము, దు:ఖమయ పరిస్థితుల మధ్య నా వ్యక్తిగత విషయముల లంపటములు నాకు మాత్రమే పరిమితము కావలెను. అట్టి విషమ దశయందు సైతం నా జాతి భవితవ్యమే కాక యావత్ప్రపంచ భవితవ్యం నా చేతులలో ఉన్నదని గుర్తించి, ఆ విషయాన్ని నేను ఎన్నడూ ఏమరపాటు పొందని శక్తిని నా స్మంతియందు నిలిపి నన్ను అనుగ్రహింపుము’’.

మీరే దైవమని..
’’గురువు కొవ్వొత్తిలాంటి వారు. తను కాలిపోతున్నా సరే.. ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఉంటారు
’’ఉపాధ్యాయుడు నాటిన జ్ఞానమనే విత్తనాలు ఎన్నేళ్లయినా ఫలాలిస్తూనే ఉంటాయి
’’విద్యార్థిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి అందమైన జీవితానికి వెలుగుబాట చూపించే వాడే ఉపాధ్యాయుడు
’’ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమమైన దారి చూపిస్తారు. ఆ దారిలో తన శిష్యులను నడిపించడం కోసం తిడతారు. మరీ మొండికేస్తే కొడతారు. అది తన దగ్గర చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కోసమే..
’’జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి ఓ పాఠం నేర్పుతారు. వారు కూడా మనకు ఉపాధ్యాయులే..
’’ఉత్తమ ఉపాధ్యాయుడు గతాన్ని మన ముందుంచుతారు. ప్రస్తుతాన్ని విడమరిచి చెబుతారు. భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలో నేర్పిస్తారు.
’’మన లక్ష్యాన్ని మనమే ఎంచుకునేలా చేయడంతో పాటు.. ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో మనల్ని నడిపించే వారే గొప్ప ఉపాధ్యాయుడు
’’ఉపాధ్యాయుడు తన విద్యార్థి విషయంలో సంతృప్తిగా ఉండేదెప్పుడంటే.. జీవితంలో ముందుకెళ్లే విషయంలో తన శిష్యుడికి ఇక తన అవసరం లేదనుకున్నప్పుడు..
’’ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే.. ఏ రంగానికి చెందిన నిపుణులైనా సరే ఉపాధ్యాయుల వద్దనే తన నైపుణ్యాలకు సాన పెట్టుకుని రావాలి
’’విద్యార్థులపై ఉపాధ్యాయుల ప్రభావం వారికి చదువు చెప్పినంత కాలం, వారిని గుర్తుంచుకున్నంత కాలం కాదు.. జీవితకాలమంతా ఉంటుంది
’’విద్యార్థులను మీ కథ మీరు రాయండని ఉపాధ్యాయులు చెబితే ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా రాస్తారు. కానీ, ఆ కథలో హీరో మాత్రం ఉపాధ్యాయుడే.

’’అతిగా మాట్లాడే వారిని చూసి మౌనంగా ఉండటం నేర్చుకున్నా. జాలిలేని వారిని చూసి దయతో ఉండటం నేర్చుకున్నా. బాధపడే వారిని చూసి బాధపడకుండా ఉండటం నేర్చుకున్నా. ధైర్యంగా, స్థిరంగా ఉండటం నేర్పిన వీరందరూ నాకు ఉపాధ్యాయులే..

రాధాకృష్ణన్‍ చెప్పిన పది పాఠాలు
భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం అంటే దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది వంటి పండుగలకు ఏమాత్రం తీసిపోని వేడుక. డాక్టర్‍ సర్వేపల్లి రాధాకృష్ణన్‍ జయంతి దినమైన సెప్టెంబరు 5ను ఏటా ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే)గా జరుపుకుంటాం. ఆయన 1888, సెప్టెంబరు 5న జన్మించారు. రాధాకృష్ణన్‍ గొప్ప భారతీయ తత్త్వవేత్త. గురువు. ఆయన విద్యార్థులకు చూపిన దారి ఎప్పటికీ భరతజాతికి మార్గనిర్దేశనం చేస్తుంది. 1962 నుంచి మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం అమల్లోకి వచ్చింది. ఒకసారి రాధాకృష్ణన్‍, ‘‘ఏటా సెప్టెంబరు 5న నా పుట్టినరోజును జరుపుకునే బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే బాగుంటుంది’’ అన్నారట. అప్పటి నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా సెప్టెంబరు 5 మారింది. డాక్టర్‍ రాధాకృష్ణన్‍ విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి పది మంచి మాటలు చెప్పారు. అవేమిటో చదవండి..
– చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి తావి అబ్బినట్టుంటుంది.
– మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించాలి.
– విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తిలోని సృజనాత్మకతను వెలికితీయడం. చదువుకున్న వ్యక్తి చారిత్రక పరిప్థితులకు, ప్రకృతి ప్రతికూలతలకు వ్యతిరేకంగా పోరాడగలడు.
– మన గురించి ఆలోచించడానికి మనకు సహాయపడే వారే నిజమైన ఉపాధ్యాయుడు.
– నిజమైన మతం ఒక విప్లవాత్మకశక్తి. ఇది అణచివేతకు, అన్యాయానికి శత్రువు.
– చరిత్రను నిర్మించడానికి శతాబ్దాలు పడుతుంది. ఒక సంప్రదాయాన్ని రూపొందించడానికి శతాబ్దాల చరిత్ర పడుతుంది.
– మతం వ్యక్తి యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. కేవలం నమ్మకం మీద కాదు.
– సంస్క•తుల మధ్య వంతెనలను నిర్మించే సాధనాలు పుస్తకాలు.
– మనిషి ఒక విరుద్ధమైన జీవి.

– గొప్ప సాధువుకు గతం ఉన్నట్టే.. పాపులకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఊహించినంతగా ఈ లోకంలో ఎవరూ మంచివారూ కాదు.. అలాగని చెడ్డవారూ కాదు.

Review మనందరి ‘స్టార్‍’ మార్చిన మాష్టార్లకు వందనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top