అందరికీ అన్ని రోజులున్నట్టే చిన్నారులకూ ఒక రోజు ఉంది. అది నవంబరు 14 బాలల దినోత్సవం.
చాచా నెహ్రూ పుట్టిన రోజున బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. తల్లిదండ్రులు కూడా ఈ ఒక్క రోజే పిల్లలది.. మిగతా అన్ని రోజులూ తమ చేతిలోనే ఉండాలనే ధోరణి, దృక్పథంతో ఉన్న రోజులివి.
ఇంతకీ పిల్లలెలా పెరగాలి? పిల్లల్ని ఎలా పెంచాలి?
ఇవెప్పటికీ చిక్కు ప్రశ్నలే.
ఇరవై నాలుగు గంటలూ చదువొక్కటే పరమావధిగా ప్రస్తుతం బాలల బాల్యం ఉంది.
అయితే, చదువొక్కటే వారికి బతకడం నేర్పదనే విషయం ఇక్కడ తల్లిదండ్రులంతా గమనించాలి. విజయవంతమైన జీవితం గడిపేలా పిల్లలకు అవసరమైన వనరులను, శక్తియుక్తుల్ని, లోకజ్ఞానాన్ని వారికి వారు సముపార్జించుకునేలా తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలి తప్ప.. బలవంతానికి గురిచేయకూడదు.
పిల్లలు పువ్వుల్లాంటి వారు. సహజంగా పెరగాలి. సహజంగా వికసించాలి. సహజంగా పరిమళించాలి. పిల్లల్లో మనో వికాసం పుష్పం మాదిరిగానే నెమ్మదిగా, అందంగా జరగాలి. అటువంటి పరిస్థితిని పెద్దలు కల్పించాలి. వారితో సున్నితంగా వ్యవహరించాలి. పెత్తనం చెలాయిస్తున్నట్టు ఉండకూడదు. వారిని చక్కగా పెంచడంలో, సామాజిక, ఉద్విగ్నతా సామర్థ్యాలను, లోకజ్ఞానాన్ని పెంపొందించే విషయంలో ఎంతో జాగరూకతతో, సమన్వయంతో వ్యవహరించాలి. అలాకాక పిల్లల్ని నిర్బంధ వాతావరణంలో పెంచితే.. నిట్టూర్పులే మిగులుతాయి సుమా!
ఏ పనికైనా విషయ పరిజ్ఞానం కలిగించేది విద్య. అది దృష్టి వంటిది. ఆచరణ పరిజ్ఞానం కలిగించేది శిక్షణ. అది నడకలాంటిది. దృష్టి, నడక బాగుంటేనే మన పయనం సవ్యంగా సాగుతుంది. శిక్షణలో శ్రద్ధతోటే ఆచరణలో నైపుణ్యం కలుగుతుంది. ఆసక్తి లేనపుడు ఏ శిక్షణ అయినా శిక్షలాగే ఉంటుంది.
జీవితం చదువుతోనే ముడిపడి ఉందనే అభిప్రాయం నేడు అందరిలో బాగా నాటుకుపోయింది. అసలైన విద్య లక్ష్యం.. విజ్ఞానం. కానీ, పుస్తకాల్లో ఉన్నది బట్టీపట్టి, మంచి మార్కులు సంపాదించి, ఆపై మంచి ఉద్యోగం పొంది.. ఇదే నేడు పిల్లలు, వారి తల్లిదండ్రుల జీవితం అయిపోయింది. లోకజ్ఞానం అబ్బడం లేదు. లోకం పోకడ అసలే పట్టడం లేదు. విద్య.. విజ్ఞానం స్థాయి నుంచి ఉద్యోగానికి కుదించుకుపోయింది. కేవలం సంపాదనకే పరిమితమైంది. వ్యక్తిత్వ వికాసం మరిచిపోయింది. మంచిచెడులు గాలిలో కలిసిపోతున్నాయి. పిల్లల భవిష్యత్తు మార్కుల గారడీలో, పరీక్షల సుడిగుండంలో పడి విలవిల్లాడుతోంది. బతకడానికి కావాల్సిన తెలివితేటలను నేటి విద్యా విధానం అందించలేకపోతుం దన్నది ముమ్మాటికీ నిజం. ఇది పిల్లల సమస్య కాదు. దేశ భవిష్యత్తుకి సమస్య. కాబట్టి, తల్లిదండ్రులూ ఆలోచించండి. పిల్లల్ని సహజంగానే ఎదగనివ్వండి. సహజంగానే పెరగనిద్దాం. వాళ్లు రేపటి మన భవిష్యత్తే కాదు.. రేపటి జాతి సంపద కూడా. దానిని పదిలంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.
బాలల దినోత్సవ శుభాకాంక్షలు
-కుమార్ అన్నవరపు
Review బాల్యానికి పరీక్ష.