అలంకారాలన్నింటిలో వెలుగే పెద్ద అలంకారం. అసలు ఏ అలంకారమైనా వెలుగు లేనిదే గోచరించదు కూడా. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికైనా ఏ ఉత్సవం జరిపినా వెలుగు తోరణాలతోనో, వెలుగు చిమ్మే బాణసంచాతోనే వేడుకలు సాగించడం అలవాటు. దీన్నిబట్టి మానవ స్వభావంలోనే వెలుగురవ్వలు ఉత్సాహానందాలకు ఉనికిపట్టు అనే భావం దాగి ఉందని స్పష్టమవుతోంది. అందుకే మన భారతావని నేలపై దీపావళి పర్వం వెలుగుపూల వేడుకగా ఆవిర్భవించింది. యుగాల క్రితం భారతీయ సంస్క•తి ఈ వెలుగుల వేడుకను ‘దివ్యత్వం’గా దర్శించి, దాన్ని పండుగగానూ, పవిత్రమైన ఆధ్యాత్మిక సాధనగానూ ప్రతిష్ఠించింది. ఒక చక్కని వ్యవస్థగా దీపావళిని తీర్చిదిద్దింది. కేవలం వేడుక మాత్రమే కాక- జ్యోతిష్యశాస్త్రం, దేవతల అనుగ్రహాన్ని పొందే అర్చనా విధానం, పితరుల్ని తృప్తిపరిచే పూర్వీకుల పట్ల ప్రేమ.. ఇవన్నీ ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి. దీపావళి నాడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటామో, ఏడాది పొడవునా అదే స్థితి కొనసాగుతుందని ధర్మశాస్త్ర వచనం. అందుకే దీపావళి రోజున అందరూ ఉత్సాహంగా కలసిమెలసి ప్రేమను పంచుకునే కుటుంబ, సామాజిక సామరస్య పర్వంగా వేడుక జరుపుకొంటారు. పితృ తర్పణాలతో పెద్దలను తలచుకుని పూర్వీకులపై భక్తిని ప్రకటిస్తారు. ఇంట సిరులు స్థిరంగా ఉండాలని లక్ష్మీపూజ, కుబేరపూజ చేస్తారు. అలక్ష్మి (దారిద్య్ర, భయ, రోగాది దుర్భావాలను)ని తోలగించేందుకు ధ్వనులతో కూడిన వెలుగురవ్వలను బాణసంచాలుగా జ్వలింప చేస్తారు. దేవతల కృప లభించేలా దీపతోరణాలను వెలిగిస్తారు. భాద్రపద మహాలయ దినాల్లో ఆరాధించిన పితరులకు ఈ ఆశ్వయుజ అమావాస్య ఒక విధంగా వీడ్కోలు తెలుపుతుందని- పితృ దేవతారాధన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వం నాడు ఇంటి వాకిళ్లలో, గుమ్మాల్లో, గోశాలల్లో, దేవాలయాల్లో దీప మాలికలను వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు కాంతి శరీరులు కనుక దీపజ్యోతుల వల్ల దేవతాశక్తులు ఆహ్వానితులై అనుగ్రహిస్తారనే కారణంతో దీపాలను వెలిగించాలని అంటారు. లక్ష్మీపూజతో పాటు గోమాతను, వృషభాలను అలంకరించి పూజించాలని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహదోషాలు తొలగాలన్నా, ఆయువు పెరగాలన్నా, అభీష్టాలు సిద్ధించాలన్నా దీపాలను వెలిగించి నమస్కరిస్తే చాలని పురాణ గ్రంథాలు వివరిస్తున్నాయి. వేదన కలిగించే స్థితికి ‘నరకం’ అని నిర్వచనం. ఆ నరకాన్ని పోగొట్టి ఆనందాన్నిచ్చే సంతోష కాంతి సాధనే ‘దీపావళి’ పర్వం.
Review వెలుగుల వేడుక.