బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ.. నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ.. అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తుముని కంఠంలో నుంచి వెలువడిన సుస్వర మంత్రఝురి- గాయత్రి మంత్రం.
ఇది సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించే అద్భుత చంధో తరంగం.
ఉత్క•ష్టమైన గాయత్రి మంత్రాన్ని సృష్టించిన ఆ రుషి సత్తముడు మరెవరో కాదు.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి.
ఈ మహా రుషి తపశ్శక్తిలో నుంచి వెలువడిన మంత్రమే ఇది.
ఓమ్ భూర్భవ స్వ: ఓమ్‍త త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్
ఇదే గాయత్రి మూల మంత్రం.
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రి మహా మంత్రానికి వ్యాఖ్యాన రూపంలో రామాయణ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఈ విశ్వంలో తల్లిని మించిన దైవం లేదు.
గాయత్రిని మించిన మంత్రం లేదు.
త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్టించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రి దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం.
హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.
నాలుగు వేదాలలో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.
ప్రతి నిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని రోజులోని మూడు కాలా (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)ల్లో పదిసార్లు చొప్పున జపిస్తే ఎంతో మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ, చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయొచ్చు. గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
గాయత్రి మంత్రంతో పాటుగా, ‘ఓం నమో గాయత్రి మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీగాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
గాయత్రి మంత్రంలోని అక్షరాలకు మంత్రార్థం, ఆయా అక్షరాల శబ్దం, మంత్రంలోని ఒక్కో అక్షరం ఏయే దేవతలను ప్రతిబింబిస్తుందనే విశేషాల కథనం.. లోపలి పేజీల్లో చదవండి..
(2022, జూన్ 11, శనివారం- గాయత్రి జయంతి)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review సంపాదకీయం మహా మంత్రం.