నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం

ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు.
శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది.
అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది. ఈ వివరాలన్నీ తాంత్రిక గ్రంథాలలో ఉన్నాయి.
అంతటి అద్భుతశక్తి మరి ఏ ఇతర మంత్రంలోనూ కనిపించదు. అందువల్లనే గాయత్రిదేవిని రోజులో మూడు సమయాలలోఆరాధించే ఉపాసకులకు ఈ ఇరవై నలుగురు దేవతల శక్తి లభిస్తుంది. గాయత్రిని ఉదయం, మధ్యాహ్నం, సాయం సంధ్య వేళల్లో ఆరాధించడం ఉత్తమం. మూడు సంధ్య వేళల్లో ఉపాసనలు అందుకుంటుంది కాబట్టే గాయత్రి దేవిని త్రిసంధ్యాదేవిగానూ పిలుస్తారు.
మంత్రాలలో పరమోత్క•ష్టమైన ఆ మహా మంత్ర విశేషాలు.. జూన్‍ 11, శనివారం, గాయత్రి జయంతి సందర్భంగా..

శ్రీ గాయత్రి మంత్రం విశ్వశాంతికి మూల మంత్రం.
గాయత్రి మంత్రం ఒక దివ్యజ్ఞానం.
గాయత్రి దేవమాత.
గాయత్రి ఉపాసన వల్ల మనిషి దేవత అవుతాడు.
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలో నిండి ఉన్న ధర్మం, నీతి, జీవితం, కళ, సామాజిక వ్యవహరణలను గురించిన బోధ.. మనిషి ఆలోచనలనూ, భావనలనూ, లక్ష్యాలనూ, దృక్పథాన్ని ప్రక్షాళన చేసే శారీరక, మానసిక క్రియలలో సత్వగుణమూ, ధర్మనిష్టా పెంపొందుతాయి. గాయత్రి మహా మంత్రంలోని మంత్రాక్షరాలు చేసే మహా బోధనలను అనుసరిస్తే దైవీక్రియ అమలు జరుగుతుంది. కనుకనే గాయత్రి వేద మంత్రాల సారం అయ్యింది. ఆ మంత్రాక్షరాలలో ఇమిడి ఉన్న సారాన్ని గ్రహించే ప్రయత్నమే ఈ వ్యాసం..

ఓం
ప్రకృతి అంరాళంలో ‘ఓం’ వంటి ధ్వని ప్రతి క్షణం ఉత్పన్నం అవుతోంది.
ఈ పరమేశ్వర నామాన్ని సూక్ష్మ ప్రకృతి ప్రతి క్షణం జపిస్తోంది. నినదిస్తోంది. కనుక ఈ నామం అకృత్రిమం. స్వయం వ్యక్తం. సర్వశ్రేష్టమైనది.
ఆస్తికత అంటే అర్థం- సత్వగుణాన్నీ, దైవీయ, ఈశ్వరీయ, పారమార్థిక భావనలనూ హృదయంలో నింపుకోవడం. నాస్తికత అంటే అర్థం- తామసంతో, అసురత్వంతో, భోగవాదంతో, స్వార్థంతో కూడిన వాసనలలో మునిగిపోవడం.
‘ఓం’లో అ ఉ మ్‍ అనే మూడు అక్షరాలు కలిసి ఉన్నాయి.
‘అ’ అంటే అర్థం- ఆత్మ పరాయణత్వం.
మనసును శారీరక విషయాల నుంచి తప్పించి, ఆత్మానందంలో ఓలలాడటం.
‘ఉ’ అంటే అర్థం- ఉన్నతి.
శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సంపదలతో మనసును నింపుకోవడం.
‘మ్‍’ అంటే అర్థం- మహోన్నత గొప్పతనం.
క్షుద్రతనూ, సంకుచితతత్వాన్ని, స్వార్థపరత్వాన్ని, ఇంద్రియ చాపల్యాన్ని వదులుకోవడం.
ఆదర్శాలు, ప్రేమ, దయ, ఉదారత, సేవ, త్యాగం, సంయమనం ఆధారంగా జీవితాన్ని నిర్మించుకోవడం.

భూ:
మనం శరీరాలము కాము. ప్రాణులము. ఆత్మలము. శరీరానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆత్మను ఉపేక్షించడం భౌతికవాదం.
ఆత్మకు ప్రాధాన్యం ఇస్తూ, శరీరాన్ని తగు విధంగా రక్షించుకోవడం ఆధ్యాత్మ వాదం.
మనం ఆత్మలమనీ, కనుక మన శ్రేయస్సు ఆత్మ పరాయణత్వంలో ఉన్నదనీ గాయత్రి చెబుతుంది.
మనం ఆత్మవాదులం కావాలి.
ఆత్మ కల్యాణానికీ, ఆత్మచింతనకూ, ఆత్మోన్నతికీ, ఆత్మగౌరవానికీ అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. వాటి కోసం నిరంతరం కృషి చేయాలి.
సమాజ సేవ ద్వారా విరాట్‍ పురుషుడూ, విశ్వ మానవుడూ అయిన పరమాత్మను ఆరాధించాలి.

భువ
ఈ అక్షరం మనకు కర్మయోగ సందేశాన్ని ఇస్తోంది.
ఎందుకంటే- కర్మయోగం ఆధారంగానే మనం అన్ని రకాల దు:ఖాల నుంచి విడుదల పొందగలుగుతాయి. సత్ఫలితాలను సాధించాలంటే మన జీవనం వికాసం పొందాలంటే చేయవలసిన పనిలో మనం పూర్తిగా నిమగ్నం కావాలి. ఇలా నిర్ణయించుకోవడంలో బుద్ధి కుశలత, దూరదృష్టి, వివేకం ఇమిడి ఉన్నాయి.
మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు- వైఫల్యానికి కుంగిపోవడంలో, సాఫల్యానికి పొంగిపోవడంలో అర్థం లేదు.
మనం చేసే పనులకు ఫలితాన్ని ఇచ్చే శక్తి వేరొకటి. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని నిష్టతో పూర్తి చేయాలంతే. ఈ భావనతోనే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
ఈ భావననే అనాసక్త యోగం అంటారు.
ఈ దృక్పథం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు.
దు:ఖంలో, కష్టంలో విచారించవలసినదేదీ అతడికి కనిపించదు.

స్వ:
మనసును నీ లోపల స్థిరంగా ఉంచుకోవాలి.
మనసులో లోలోపల దృఢంగా ఉండాలి.
సంఘటనలను, పరిస్థితులనూ నీటి అలలుగా పరిగణించాలి.
వాటిలో ఆడుకుని ఆనందించాలి.
అనుకూల పరిస్థితుల్లోని స్వారస్వాన్నీ, ప్రతికూల పరిస్థితుల్లోని స్వారస్వాన్నీ ఆస్వాదించాలి.
అయితే- వాటి వల్ల ఉద్విగ్నులం కాకూడదు. అస్థిరుడవు కావద్దు.
మనసు సమతూకాన్ని కోల్పోకూడదు.
సంతోష, దు:ఖాల ఈ బాల్య క్రీడలలో మనం మునిగిపోకూడదు.
మనం ఆత్మపరాయణులం కావాలి.
‘స్వ:’ గురించి తెలుసుకోవాలి.
ఆత్మచింతనలో, ఆత్మవిశ్వాసంలో,
ఆత్మగౌరవంలో, ఆత్మనిష్టలో, ఆత్మసాధనలో, ఆత్మోన్నతిలో, ఆత్మ నిర్మాణంలో మనం మన ఇచ్ఛాశక్తిని, ఊహాశక్తిని, క్రియాశక్తినీ వినియోగించాలి.
ఎందుకంటే లోపలి మూల కేంద్రం, జన్మస్థలి ఆత్మయే.
ఆత్మస్థితుడైన మనిషి యొక్క అంతరంగం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక అతడు సదా సంతోషంగా ఉంటాడు.
మన ప్రతి ఇచ్ఛనూ, ప్రతి అవసరాన్నీ పూర్తి చేసుకునే బలం మనకు పూర్తిగా ఉంది.
శరీర బలం, బుద్ధి బలం, విద్యా బలం, ధన బలం, సంఘటన బలం, శీల బలం, ఆత్మ బలం- ఈ ఏడూ జీవితంలో వెలుగునూ, ప్రతిష్ఠనూ, సంపదనూ, స్థిరత్వాన్నీ నింపడానికి అవసరం అవుతాయి.

గాయత్రి మంత్రార్థం
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు శక్తులివే..
1. తత్‍, 2. స, 3. వి, 4. తు,
5. వ, 6. రే, 7. ణ్యం, 8. భ,
9. ర్గ:, 10. దే, 11. వ, 12. స్య,
13. ధీ, 14. మ, 15. హి, 16. ధి, 17. యో, 18. యో, 19. న:,
20. ప్ర, 21. చో, 22. ద, 23. యా, 24. త్‍.
గాయత్రి మంత్రార్థం
బ్రహ్మ పురాణంలో శ్రీగాయత్రి మంత్రార్థం గురించి ఇలా వివరించారు..
ఓం- ఓంకారం సర్వమంత్రాలకు మూల మంత్రంగా చెప్పబడింది.
భూ:- నుంచి పృథ్వీ లోకం.
భువ:- నుంచి అంతరిక్షము.
స్వ:- నుంచి స్వర్గ లోకము.
తత్‍- నుంచి తేజస్సు (అంటే అగ్ని దేవత).
సవితు:- సవిత అంటే ఆదిత్యుడు.
వరేణ్యం:- అన్నవరేణ్యం (అంటే ప్రజాపతి).
భర్గ:- సర్వదేవాత్మకమైనది.
దేవస్య:- దేవుడైన వాడే పురుషుడు (ఈతడినే విష్ణువు అంటారు).
ధీమహి:- ఐశ్వర్యం (ఐశ్వర్యం అంటే మహేశ్వరుడు).
గాయత్రి మంత్రంలో సకల దేవతల శక్తులు ఇమిడి ఉన్నాయి. సృష్టిలోని ప్రధానమైన ఇరవై నలుగురు దేవతల దైవీ శక్తితో కూడినదే గాయత్రి మంత్రం.
అంటే- ఒక్క గాయత్రి మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను స్మరించిన పుణ్యం లభిస్తుంది.

వరేణ్యమ్‍
మనం దురాలోచనలను వదిలి సదాలోచనలను స్వీకరించాలి.
అమంగళకరమైన ఆలోచనలను వదిలి మంగళకరమైన ఆలోచనలను స్వీకరించాలి.
అందువల్ల మనస్తాపం, అసంతృప్తి అంతం అవుతాయి.
అన్ని పరిస్థితుల్లో ఆనందం తాండవిస్తుంది.
ఒక మనిషి యొక్క అంతరిక ఉన్నతియే అతడి శ్రేష్టత్వానికి కారణం అవుతుంది.
మనం గొప్పవాళ్లం కావాలి. శ్రేష్టులం కావాలి. సంపన్నులం కావాలి.
అయితే, భౌతిక వస్తువు కాక, అంతరిక పరిస్థితి వాటికి పునాది కావాలి.

భర్గో
మనుషులు పాపరహితులు కావాలి. పాపాల వల్ల కలిగే దుష్ఫలితాలను గుర్తించి, వాటిని ఏవగించుకోవాలి. వాటిని నాశనం చేయడం కోసం నిరంతరం సంఘర్షణ జరుపుతూ ఉండాలి.
పవిత్రత కోసం మన కృషి కొనసాగిత, ప్రపంచంలోని కష్టాల నుంచీ, భవ బంధనాల నుంచీ విముక్తి పొంది, మనం జీవన్ముక్తునిలో ఉండే స్వర్గమయ ఆనందాన్ని చూరగొనగలుగుతాము.

దేవస్య
మలినమైన దృక్పథాన్ని వదిలి, విశుద్ధమైన ఆలోచనా విధానాన్ని అవలంభించాలి. అసురత్వపు విధానాన్ని వదిలి దేవత్వపు కార్యకలాపాలను చేపట్టాలి.
భవిష్యత్తులో దు:ఖాన్ని కలిగించే, ఆత్మను పతనం చెందించే క్షణిక సుఖాలకూ, ఆకర్షణలకూ, ప్రలోభాలకూ దూరంగా ఉండాలి.
మనం దేవతత్వాన్ని వికసింప చేసుకోవాలనీ, దేవత్వాన్ని ప్రోత్సహించాలనీ, దైవీయమైన ఆత్మ సంకేతాలను అనుసరించాలని ఈ పదం ద్వారా గాయత్రి మంత్రం బోధిస్తోంది.

ధీమహి
మనం మన లోపల సద్గుణాలను నింపుకోవాలి.
నమత్రగా, మధురంగా, శిష్టంగా, భయరహితంగా, దయాళువుగా, పురుషార్థ పూరితంగా, అలసత్వరహితంగా, శ్రమశీలంగా మన స్వభావాన్ని మలుచుకోవాలి.
మన వ్యవహరణలో ఉదారత, సత్యసంధత, నిజాయితీ, కపటరాహిత్యం, సహృదయత, న్యాయ పరాయణత్వం, సమానత్వం, ఉద్యమించే గుణం ప్రతిబింబించాలి.
ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్ట, ఉన్నత పదవి, ధనం, వైభవం.. ఇవన్నీ అందించే గుణాలనూ, లక్షణాలనూ, విశేషతలనూ, అర్హతలనూ మనం గడించాలి.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇరవై ఆరు దైవీ గుణాల గురించి వివరించాడు.
వాటి సారాంశం ఏమిటంటే- ఉద్వేగం లేకపోవడం, స్వచ్ఛత, వివేకశీలత, సహనశీలత, సంయమనం, శక్తి సమీకరణ,
ఉదారత, కర్తవ్య పరాయణత. ఈ గుణాలను మన స్వభావంలో, అభ్యాసంలో ఇమడ్చడం అంటే- శిఖరాగ్ర స్థాయి సంపదను ఉత్పత్తి చేయడమే.

గాయత్రి ప్రాదుర్భావం
గాయత్రి అంటే ఎవరు?
ఈమె ఎలా ఆవిర్భవించింది?
ఒకసారి ఇదే సందేహం వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే ఆయన విధాత వద్దకు వెళ్లి గాయత్రితత్వాన్ని తెలపాలని కోరాడు.
‘నా స్ఫురణమాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమైందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంగా వ్యవహరిస్తారు.
నా నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి’ అని బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి వివరించాడు.
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళపరాం
సహస్ర నేత్రాం గాయత్రీం శరణ మహం ప్రపద్యే
గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్ఠమైనది.
‘న గాయత్య్రా నరం మంత్రం న మాతు: పరదైవతమ్‍’
అంటే- తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన మంత్రం లేవు.
గయాన్‍ త్రాయతే ఇతి గాయత్రి
శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. ఆమె ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ, పరమాత్మల క్రియా భాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.

ధియో
ఏ గ్రంథం కన్నా, ఏ వ్యక్తికన్నా వివేకం మరింత ప్రధానమైనది.
కనుక, బుద్ధి సంగతమూ, వివేక సమ్మతమూ, మనకు యోగ్యమూ, సముచితమూ అయిన దానిని మాత్రమే గ్రహించాలి. వివేకం అనే గీటురాయి మీద గీయడం ద్వారా మనం ప్రతి సందర్భంలో మంచిచెడ్డలను కనుగొనగలుగుతాము.
మనం వివేకవంతులం కావాలి. వివేకాన్ని అవలంభించాలి.
వివేకమనే గీటురాయిపై గీసి, మనం మన ఆలోచనలనూ, పనులనూ నిర్ణయించుకోవాలి.

యోన
మన శక్తులలో, మన సాధనలలో- అవి తక్కువగా ఉన్నా, హెచ్చుగా ఉన్నా- అతి కనీసమైన భాగాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి.
మిగతా భాగాన్ని నిస్వార్థ భావంతో అసమర్థులకు పంచాలి.
కూడబెట్టడం, అనుభవించడం అనే ఎండమావుల వెంట పరుగులు తీయకూడదు.
మన అవసరాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలి.
వాటిని పూర్తి చేసుకున్న తరువాత మిగిలి ఉన్న శక్తిలో అత్యధిక భాగాన్ని బలహీనులనూ, పేదలనూ, అమాయకులనూ, చదువు రాని వారినీ పైకి తీసుకురావడం కోసం ఖర్చు చేయాలి.
ఈ పని చేయడం అంటే, దైవకార్యంలో పాల్గొనడమే.
మన బుద్ధి కుశలతనూ, దూరదృష్టినీ, కర్తవ్య పరాయణతనూ నిరూపించడానికి ఇదో మంచి అవకాశం.
ఆత్మ సంయమనంతో, పరమార్థంతో కూడిన ఈ దైవ మార్గాన్ని ‘యోన’ మనకు చూపుతుంది. ఈ మార్గంలో పయనించే గాయత్రి ఉపాసకుడు జీవన లక్ష్యాన్ని సాధించి తీరుతాడు.

ప్రచోదయాత్‍
ఓ భగవంతుడా! మాకు ప్రేరణను ప్రసాదించు.
మా బుద్ధికి స్ఫూర్తిని ఇవ్వు.
బుద్ధిలో ప్రేరణ జనిస్తే- ధనం, వైభవం అన్నీ స్వయంగా మన కాళ్ల వద్ద మోకరిల్లుతాయి.
ఈ ప్రేరణ లేకపోతే కుబేరుని ఖజానాను పొందినప్పటికీ, సోమరులు దాన్ని వృథా చేస్తారు.
గాయత్రిలోని ‘ప్రచోదయాత్‍’ శబ్దంతో సద్బుద్ధికి మాత్రమే ప్రేరణ ఇవ్వవలసిందని మనం పరమాత్మను యాచించాలి.
మనం మనం మన మాటలతో, చర్యలతో ఎవరినీ నిరుత్సాహపరచకూడదు.
ఆత్మవిశ్వాసాన్ని కూలదోసే మాటలను, నిరాశ అనే కూపంలో కూరుకుపోయేటట్టుచేసే మాటలను మనం ఎవరికీ చెప్పకూడదు.
ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలి.
మనిషిలోని ఆలోచనలను ఉన్నతం, ఉదాత్తం చేసేదీ, సన్మార్గంలో పయనించడానికి మనిషి ఆత్మను ప్రోత్సహించేదీ అయిన జ్ఞానాన్ని ఇవ్వడం అన్నింటినీ మించిన దానం. మనం మనల్ని ప్రాణవంతులను చేసుకోవాలి. ఇతరులలో ప్రాణశక్తిని నింపాలి.

శక్తి తరంగం.. గాయత్రి మంత్రం
గాయత్రి మంత్రం విశిష్టత గురించి రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవాన్ని పొందుతారని అంటారు.
ఓం భూర్భువ: సువ: తత్‍ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్‍
ఇది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైనది. ఈ మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనని రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని ఒక నిర్థిష్ట పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతం చేస్తాయని అంటారు. మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి అనేక పరిశోధనలు, ప్రయత్నాలు, అధ్యయనాలు కూడా జరిగాయి. గాయత్రి మంత్ర జపం వల్ల ఒకవిధమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.
గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవాలను పొందుతారట.
ఈ మంత్ర పఠనం వల్ల ఎల్లప్పుడూ జీవిత సత్యాలను గ్రహించి, వాటికి అనుగుణంగా మసులుకుని విజయాలను సొంతం చేసుకుంటారని పురాణాల్లో ఉంది.
గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయట.
గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని జ్ఞాన సంపన్నుడిగా, ధైర్యవంతుడిగా చేసి తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుందని అంటారు.
రుగ్వేదంలో పేర్కొన్న ప్రకారం- గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత- సవిత. అగ్ని ముఖం, రుషి- విశ్వామిత్రుడు.
‘ప్రణవ రూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ, విశ్వాన్ని ప్రకాశింపచేసే సూర్యతేజమైన సవితను ఉపాసిస్తున్నాను’ అనేది గాయత్రి మంత్రానికి ఉన్న అనేక అర్థాలలో ఒకటి.

గాయత్రి మంత్ర సృష్టికర్త.. విశ్వామిత
రుచీకుని కుమారుడైన విశ్వామిత్రుడు మహా తపశ్శక్తి సంపన్నుడు. తన తపో బలంతో రుషిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని లోకపూజ్యుడయ్యాడు.
విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో అనేక వేద మంత్రాలను దర్శించాడు. అందుకే ఆయనను మహా మంతద్రష్ట అని కూడా అంటారు. గాయత్రి దేవి అనుగ్రహంతోనే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడని అంటారు.
రుగ్వేదంలోని పది మండలాల్లో 3వ మండలాన్ని వైశ్వామిత్ర మండలం అంటారు.
ఇందులో అరవై రెండు సూక్తులు ఉన్నాయి.
ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు సృష్టించినవే. ఈ వైశ్వామిత్ర మండలంలో గల బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడే స్వయంగా దర్శించి, ఆపై లోకానికి కానుకగా అందించాడు. విశ్వామిత్రుడి వల్లనే వైశామిత్ర మండలం, తృతీయ భాగం, 62వ సూక్తిలో పదవ మంత్రం గాయత్రి మహా మంత్రంగా ప్రసిద్ధిగాంచింది.
విశ్వామిత్రుడే లేకపోతే ఈ లోకానికి గాయత్రి మంత్రం లభించేది కాదు.
గాయత్రి మంత్రం సమస్త వేద మంత్రాలకు మూలమైన మంత్రం.
అన్ని మంత్రాలకూ ఇదే బీజ మంత్రం.
గాయత్రి దేవి ఎలా ఉంటుంది?
ఆమె రూపు ఏమిటి?
స్వరూపమేమిటి?
ఆమెను ఎలా ఆరాధించాలి?
.. ఈ విషయాలన్నీ మనకు తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్రుడే.
ముక్తావిద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై
స్త్రీ క్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం
తత్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం
వరదా భయాం కుశ
కశాంశుభ్రం కపాలం గుణాంశంఖం
చక్ర మదార
విందయుగళం హస్తైర్వహంతీం భజే ।।

‘గాయత్రి దేవి వేదమాత. ఆ తల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైన అయిదు ముఖాలతో మెరుస్తూ ఉంటుంది. ఆవిడ మూడు నేత్రాలతో విరాజిల్లుతుంటుంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్నమయ కిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆ కిరీటం ఇరవై నాలుగు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రి మాత చేతులలో అంకుశం, వరదముద్ర, కుశ, పాశ, శుభ్రం కపాలం, గద, శంఖం, చక్రం, రెండు కమలాలు ఉంటాయి’ అని పై శ్లోకానికి భావం.
ఈ పరమ పవిత్రమైన మంత్రాన్ని, ఈ మంత్రం మూల దేవత అయిన గాయత్రి దేవిని లోకానికి పరిచయం చేసి పునీతులను చేసిన వాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మ•తి అనే గ్రంథాలలో ఈ శ్లోకం కనిపిస్తుంది. ఇంకా అందులో ఆయన గాయత్రిదేవి ఆరాధన, వర్ణనల గురించి ఎంతో అందంగా రాశారు.

ఇరవై నాలుగు దైవీశక్తుల గాయతి
పరమశివుడు బ్రహ్మానందంతో తన ఢమరుకంతో చేసిన ఇరవై
నాలుగు (24) ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు.
ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై
నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు.
వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి.
వీటిలో పన్నెండు (12) వైదిక మార్గాలు
కాగా, మిగతా పన్నెండు (12) తాంత్రిక మార్గాలు. ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉండే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజలందుకుంటాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడుతాయి. ఈ ఇరవై నాలుగు బీజాక్షరాతో ఇరవై నాలుగు దేవతలకు సంబంధించిన గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నింటినీ కలిపి ‘చతుర్వింశతి గాయత్రి’ అంటారు.

గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు.. వారి చైతన్య శక్తుల
మంత్రార్థాల వివరణ ఇది..

1. వినాయకుడు (తత్‍):
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నోదంతి: ప్రచోదయాత్‍
విఘ్నేశ్వరుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.

2. నృసింహ భగవానుడు (స):
ఓం ఉగ్రసింహాయ విద్మహే
వజ్రనఖాయ ధీమహి
తన్నో నృసింహ ప్రచోదయాత్‍
నారసింహుడు పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

3. విష్ణుదేవుడు (వి):
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు: ప్రచోదయాత్‍
విష్ణువు పాలనా శక్తికి అధిష్టాన దేవత అయిన విష్ణువు సకల జీవ రక్షకుడు.

4. శివదేవుడు (తు:):
ఓం పంచవక్త్రాయ విద్మహే
మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర: ప్రచోదయాత్‍
శివుడు సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని, పర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.

5. కృష్ణభగవానుడు (వ):
ఓం దేవకీనందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో కృష్ణ: ప్రచోదయాత్‍
కృష్ణుడు యోగశక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు.

6. రాధాదేవి (రే):
ఓం వృషభానుజాయై విద్మహే
కృష్ణ ప్రియాయ ధీమహి
తన్నో రాధా: ప్రచోదయాత్‍
ఈమె ప్రేమశక్తికి అధినేత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగచేసి, అసూయా ద్వేష భావాలను దూరం చేస్తుంది.

7. లక్ష్మీదేవి (ణ్యం):
ఓం మహాలక్ష్య్మోచ విద్మహే
విష్ణు ప్రియాయై ధీమహి
తన్నో లక్ష్మి: ప్రచోదయాత్‍
లక్ష్మీదేవి ధన వైభవ శక్తులు అధిష్టాత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా
అందించే దేవత ఈమె.

8. అగ్నిదేవుడు (భ):
ఓం మహా జ్వాలాయ విద్మహే
అగ్ని దేవాయ ధీమహి
తన్నో అగ్ని: ప్రచోదయాత్‍
తేజోశక్తికి అధినేత అయిన
అగ్నిదేవుడు ప్రకాశం, శక్తి,
తేజస్సు, శక్తి, సామర్థ్యాలను
ప్రసాదిస్తాడు.

9. ఇంద్రదేవుడు (ర్గో):
ఓం సహస్ర నేత్రాయ విద్మహే
వజ్రహస్తామ ధీమహి
తన్నో ఇంద్ర: ప్రచోదయాత్‍
ఇంద్రుడు రక్షాశక్తికి అధినేత.
ఇంద్రుడు
అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదుల నుంచి రక్షిస్తాడు.

10. సరస్వతి (దే):
ఓం సర్వస్వత్యై విద్మహే
బ్రహ్మపుత్య్రై ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్‍
సరస్వతీ దేవి విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి (వ):
ఓం గిరిజాయై విద్మహే
శివప్రియాయై ధీమహి
తన్నో దుర్గా ప్రచోదయాత్‍
దుర్గాదేవి దమనశక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శతృవుల బారి నుంచి కాపాడుతూ సకల ఐశ్వర్యాలనూ ప్రసాదిస్తుంది.

12. హనుమంతుడు (స్య):
ఓం అంజనీసుతాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో మారుతి: ప్రచోదయాత్‍
నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ట, కర్తవ్య పరాయణతత్వం, బ్రహ్మచర్య పాలనా శక్తి అనుగ్రహిస్తాడు.

13. పృథ్వీదేవి (భూమాత)- (ధీ):
ఓం పృథ్వీదేవ్యై విద్మహే
సహస్రమూర్త్యై ధీమహి
తన్నో పృథ్వీ ప్రచోదయాత్‍
భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్నీ ప్రసాదిస్తుంది.

14. సూర్యదేవుడు (మ):
ఓం భాస్కరాయ విద్మహే
దివాకరాయ ధీమహి
తన్నో సూర్య: ప్రచోదయాత్‍
సూర్యుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్నీ, సుదీర్ఘ జీవనాన్నీ, ప్రాణశక్తినీ, వికాసాన్నీ, తేజస్సునూ ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు (హి):
ఓం దాశరథాయ విద్మహే
సీతావల్లభాయ ధీమహి
తన్నో రామ: ప్రచోదయాత్‍
రాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వంలాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన.

16. సీతాదేవి (ధి):
ఓం జనక నందిన్యై విద్మహే
భూమిజాయై ధీమహి
తన్నో సీతా: ప్రచోదయాత్‍
సీతాదవి తపశ్శక్తి అధినేత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టులుగా తయారుచేసి, ఆధ్మాత్మికోన్నతి వైపు ప్రేరేపించే శక్తిధాత్రి ఈమె.

17. చంద్రదేవుడు (యో):
ఓం క్షీర పుత్రాయ విద్మహే
అమృతతత్వాయ ధీమహి
తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్‍
చంద్రుడు శాంతి శక్తికి అధిష్ఠాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదించే దైవం ఈయన.

18. యమదేవుడు (యో):
ఓం సూర్యపుత్రాయ విద్మహే
మహా కాలాయ ధీమహి
తన్నో యమ: ప్రచోదయాత్‍
కాలశక్త్యాధిపతి యముడు. మృత్యువుకు భయపడకుండా సకల జనులను సమాయత్తవం చేసే దైవం ఈయన.

19. బ్రహ్మదేవుడు (న:):
ఓం చతుర్ముఖాయ విద్మహే
హంసారూఢాయ ధీమహి
తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్‍
బ్రహ్మ సకల సృష్టికి అధిపతి. సకల జనులకు శక్తిని ప్రసాదిస్తాడు.

20. వరుణదేవుడు (ప్ర):
ఓం జలబింబాయ విద్మహే
నీల పురుషాయ ధీమహి
తన్నో వరుణ: ప్రచోదయాత్‍
వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు (చో):
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో నారాయణ: ప్రచోదయాత్‍
ఆదర్శ శక్తికి అధిష్ఠాత నారాయణుడు. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవుడు (ద):
ఓం వాగీశ్వరాయ విద్మహే
హయగ్రీవాయ ధీమహి
తన్నో హయగ్రీవ: ప్రచోదయాత్‍
హయగ్రీవుడు సాహసశక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస దేవత (య):
ఓం పరమహంసాయ విద్మహే
మహా హంసాయ ధీమహి
తన్నో హంస: ప్రచోదయాత్‍
వివేక శక్తికి హంస అధిష్ఠాత్రి. హంస యొక్క క్షీరనీర వివేకశక్తి జగత్‍ ప్రసిద్ధమైనది.

24. తులసీదేవి (త్‍):
ఓం శ్రీ తులస్యై విద్మహే
విష్ణుప్రియాయై ధీమహి
తన్నో బృందా: ప్రచోదయాత్‍
సేవాశక్తికి అధిష్ఠాత్రి తులసీదేవి. ఆత్మశాంతి, దు:ఖ నివారణ వంటి ఫలాలను అనుగ్రహిస్తుంది.

Review నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top