అనగా అనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా జిత్తులమారిది. అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. దాని తరహా అంతా చిత్రంగా ఉండేది. తోటి నక్కల మధ్య తంటాలు, తగవులు పెట్టి వినోదం చూస్తుండేది. అందుకని మిగతా నక్కలన్నీ దానిపై కోపంగా ఉండేవి. రానురాను దాని ఆగడాలు మితిమీరిపోవడంతో దానితో మాట్లాడటం మానివేయడంతో పాటు దానికి తగినంత దూరంలో మసులుకునేవి. దాని పీడ ఎలాగైనా విరగడ చేయాలనే తలంపుతో తోటి నక్కలన్నీ కలిసి ఒకనాడు అడవిలో సమావేశమయ్యాయి. ఇక, ఆ జిత్తులమారి నక్కను ఏమాత్రం ఉపేక్షించకూడదని, దానిని తమ మధ్య ఉండనివ్వకుండా దూరంగా తరిమి
వేయాలని నక్కలన్నీ కలిసి తీర్మానించాయి.
‘నువ్వు మా కులముదానివే కాదు. నీదంతా పెడబుద్ధి. మా మధ్య ఉండటానికి నీకు అర్హత లేదు. తక్షణం ఈ చోటు విడిచిపెట్టి వెళ్లిపో. లేదంటే అంతా కలిసి తగిన శాస్తి చేస్తాము’ అని ముఖం మీదే చెప్పేశాయి.
కాదూ కూడదంటే వాటితో ప్రమాదమని గ్రహించిన జిత్తులమారి నక్క వాటి కాళ్లావేళ్లా పడింది. అయినా మిగతా నక్కలు చలించలేదు సరికదా.. తక్షణం వెళ్లిపోవాల్సిందేనని ఖరాఖండీగా చెప్పాయి. తన ఆటలు సాగకపోవడంతో ఇక చేసేదేమీ లేక జిత్తులమారి నక్క ఆ అడవిని వదిలిపెట్టక తప్పింది కాదు.
అలా అడవి నుంచి బయటపడిన జిత్తులమారి నక్క దగ్గరిలో ఒక ఊరు కనిపించేసరికి అక్కడకు వెళ్లింది. అక్కడున్న మనుషులను బాగా పరికించి చూసిన ఆ నక్క.. రంగడు అనే అతను కాస్త అమాయకంగా కనిపించేసరికి అతని దరి చేరింది. అతడికి ఆ కబుర్లూ ఈ కబుర్లూ చెప్పి బాగా మచ్చిక అయింది. పాపం! రంగడు చాలా మంచివాడు. కానీ, ఈ నక్క సంగతి అతడికి తెలియదు కదా! పైగా నక్క పెద్దమనిషిలాగా తియ్యతియ్యగా మాట్లాడేది. అది చెప్పేదంతా నిజమేనని రంగడు నమ్మేవాడు. చివరికి వాళ్లిద్దరికీ మంచి స్నేహం కుదిరింది.
ఒకనాడు నక్క రంగడితో అన్నది కదా-
‘రంగ మామా.. రంగ మామా! మనం ఇంటి వెనుక ఇంత ఖాళీ స్థలాన్ని వదిలే బదులు చక్కని పండ్ల తోట వేసుకుంటే తిన్నన్ని తినవచ్చు. మిగతావి అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. నీకూ బయట ఎలాగూ చేతినిండా పని దొరకడం లేదు. చన్నీళ్లకు వేన్నీళ్ల సాయంలా ఉంటుంది. చక్కని పండ్ల మొక్కలు పెంచు’ అని సలహానిచ్చింది.
ఇదేదో రంగడికి బాగా నచ్చింది. దాని సలహా మంచిదేనని అనిపించింది. తనకు ఎలాగూ అన్ని రోజులూ చేతినిండా పని దొరకడం లేదు. జీవికకు ఇబ్బందిగానూ ఉంది. కాబట్టి నక్క చెప్పిన పని చేస్తే చేతిలో నాలుగు డబ్బులు గలగల్లాడతాయని నమ్మాడు.
వెంటనే మామిడి మొక్కలు, సపోటా మొక్కలు, అరటి మొక్కలు తెచ్చి నాటాడు. వాటితో పాటు అక్కడక్కడా గుమ్మడిపాదులూ, దోసపాదులూ పెట్టాడు. తనూ పెళ్లామూ కలిసి పాదులు చేసి నీళ్లు తెచ్చి రోజూ మొక్కలకు పోసేవారు. వాటిని గేదెలు, ఇతర జంతువులు పాడుచేయకుండా తాను కాపలాగా ఉంటానంటూ కావలి కాస్తున్నట్టు మహా బాగా నటించేది. నక్క ఇచ్చిన సలహా, అది చేస్తున్న సాయం రంగడిని మరింత బాగా దానికి దగ్గర చేశాయి.
కొన్నాళ్లకు పండ్ల మొక్కలు చెట్లయ్యాయి. ఇంకొన్నాళ్లకు మంచి కాపునకు వచ్చాయి. ఈ సమయంలోనే చెట్లకు కాపలా మరింత పెంచాలని, లేదంటే ఇరుగుపొరుగు
తెంచుకుపోతారని చెప్పి నక్క రాత్రంతా మేల్కొని ఉండేది. నక్క మాటలను పూర్తిగా నమ్మిన రంగడు పండ్లతోట బాధ్యతను దానికే వదిలి హాయిగా పడుకునేవాడు. దాని మాయలో పడి అసలు ఏ చెట్లకు ఎన్ని కాయలు కాశాయో లేదో కూడా గమనించేవాడు కాదు.
ఇదే అదనుగా నక్క బాగా పక్వానికి వచ్చిన పండ్లను కడుపు ఉబ్బే దాకా తినేది. చెట్టుని ఒక్క పండు కానీ, కాయ కానీ కనబడనిచ్చేది కాదు. కాసినవి కాసినట్టే గుటుక్కుమనిపించేది.
ఒకనాడు రంగడు, ‘నక్క బావా.. నక్క బావా! తోటలో కాయలేమైనా కాశాయా?’ అని అడిగాడు.
‘ఇప్పుడెక్కడి అదను? వానాకాలం వస్తే కదా చిగురు వేసేదీ.. కాయలు కాసేదీ!’ అంటూ నక్క వయ్యారాలు పోయింది.
పాపం రంగడు కూడా అదే నిజం కదా! అనుకున్నాడు. వానాకాలం రానే వచ్చింది.
‘వానలు మొదలయ్యాయి. మన చెట్లకు పిందెలేమైనా వేశాయా?’ అని అడిగాడు రంగడు.
‘వచ్చింది కానీ, ఇప్పుడంతా అదను తప్పిన కాలం కదా! వానలు కురిసే సమయంలో కురవట్లేదు. ఎండలు కాలం తప్పి కాస్తున్నాయి. చూస్తుంటే చలికాలం వచ్చే దాకా పిందెలు వచ్చేలా లేవు’ అంటూ కాలం తెలిసిన దానిలా నిర్వికారంగా చెప్పింది నక్క.
రంగడు అది కూడా నిజమే కదా! అనుకున్నాడు.
శీతాకాలం కూడా వచ్చేసింది. రంగడు ఆశగా, ‘నక్క బావా! చలి మొదలైంది. మన తోటలో పండ్ల చెట్లకు పిందెలేశాయా?’ అని అడిగాడు.
‘ఇప్పుడు వేసేది పిందెలే కదా! అవి కాయలవ్వాలంటే వేసవి కాలం వరకు ఆగక తప్పదు. ఇంకెంత! కొద్దికాలం ఆగితే ఎంచక్కా నువ్వూ నేనూ పండ్లను కోసి అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. కాస్త ఓపికపట్టు’ అంది నక్క.
ఇలా ఏదో ఒక సాకు చెబుతూ, నమ్మకంగా నటిస్తూ రంగడిని పండ్ల తోట వైపు వెళ్లనిచ్చేది కాదు నక్క. అతడి కుటుంబానికి పిందె కూడా దక్కనివ్వలేదు. అన్నీ తానే మింగేసేది.
ఇంతలో ఎండాకాలం వచ్చింది. పండ్ల తోట నిండా కాయలు కాశాయి.
నక్కకు ఒక ఆలోచన వచ్చింది. తోటి జాతి నుంచి వేరు పడినందుకు అదెంతగానో బాధపడుతూ ఉంది. ఎప్పటికైనా తన వాళ్లతో కలిసిపోవాలని దానికి ఆశ. కాబట్టి వాటితో చుట్టరికం కలుపుకోవడానికి ఇదే సరైన సమయమని దానికి తోచింది. అడవికి వెళ్లి తోటి నక్కలను కలిసింది. తనెంతగా మారిపోయానో చెప్పింది. చక్కటి విందునిస్తానని, ఆతిథ్యం స్వీకరించి తిరిగి వాటితో తనను కలుపుకోవాలని కోరింది. మిగతా నక్కలు సరేనన్నాయి. అవి వచ్చి తోటలో పడి పొట్ట పట్టినన్ని తిని మిగతావి తుంచి, కొరికి, మట్టిలో పారబోసి కంటి నిండ నిద్రపోయాయి.
రంగడు తోట చూసుకుందామని వస్తే.. కళ్ల వెంబడి నీళ్లొచ్చాయి. చెట్టుని ఒక్క కాయ లేదు. కడుపు నిండా తిని మూలుగుతున్న నక్కలు కనిపించాయి. వాటి మధ్యలో ఉన్న జిత్తులమారి నక్కను కూడా రంగడు చూశాడు. ఇన్నాళ్లూ అది తనను మాటలతో బోల్తా కొట్టించిందని గ్రహించాడు. తోటలో ఒక్క మూలన మాత్రం గుమ్మడిపాదుకు ఒక కాయ మిగిలి ఉంది. అదీ ఆకులు కమ్మి ఉండటంతో అది బయటకు సరిగా కనిపించడం లేదు. నక్క చేసిన మోసానికి ఈ గుమ్మడికాయతోనే దానికి బుద్ధి చెప్పాలని రంగడు ఆలోచన చేశాడు.
ఇంట్లోకి వెళ్లి కత్తులు తీసి బాగా సానబెట్టి గుమ్మడికాయకు చుట్టూ కట్టాడు. ఆ కత్తులు కనబడకుండా ఆకులు అడ్డం పెట్టి ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయాడు.
మర్నాడు జిత్తులమారి నక్క మళ్లీ తోటలోకి వచ్చింది. దానికి బాగా ఆకలి వేస్తోంది. కానీ, తోటలోని కాయలన్నీ మిగతా నక్కలు అప్పటికే పాడు చేసినై. తోటంతా తిరగగా గుమ్మడికాయ కనిపించింది. ఆశతో ఒక్కమాటుగా దానిపైకి దూకింది. ఇంకేం! ఒళ్లంతా ఎక్కడపడితే అక్కడ తెగింది. నెత్తురు కారటం మొదలుపెట్టింది. ఏడ్చుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ పోయి ఒక రాతి మీద కూర్చుంది. చాలాసేపటి వరకు నెత్తురు కారిపోతూనే ఉంది. ఇకపై ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదని మనసులో అనుకున్నది. రంగడిని బూతులు తిట్టింది. అయితే మాత్రం ఒంటికైన గాయాలు తగ్గుతాయా? నెత్తురు కారడం ఆగిన తరువాత బయల్దేరుదామని అనుకున్నది. కానీ నెత్తురు కారి, కారి, నక్క చుట్టూ గడ్డకట్టింది. నక్క అందులో ఇరుక్కుని బయటకు రాలేకపోయింది.
‘నేను ఇందులోంచి బయటపడి ఆ రంగడి పని పట్టకపోతే నా పేరు నక్కే కాదు’ అని శపథం కూడా చేసింది.
పాపం! ముందు అది నెత్తురుగడ్డ నుంచి బయటపడితే కదా.. రంగడి పని పట్టడానికి. అలా ఒంట్లోని రక్తమంతా పోయి చివరకు ఆ జిత్తులమారి నక్క సొమ్మసిల్లి పడిపోయింది.

































































































































































































































































































































































































































Review అనగనగా.. కథ.