మొగలిపువ్వు:
సువాసన కలిగి మనోహరంగా ఉంటుంది. దీని కషాయం సమస్త వాతాలను, శ్లేష్మాన్ని హరిస్తుంది. కోరికను పెంచుతుంది. గుండెకు బలాన్నిస్తుంది. దీని రేకులు ఎండబెట్టి, ఉబ్బసం, దగ్గుతో బాధపడే వారికి చుట్టలా చుట్టి కాల్చింప చేస్తే శ్లేష్మం వెంటనే పడిపోయి బాధ తగ్గుతుంది.
మోదుగాకుల విస్తరి:
దీనిలో భోజనం పరిశుభ్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉంటుంది. వాతం, శ్లేష్మ హరంగా ఉంటుంది. పైత్యాన్ని అణచివేసి జఠరదీప్తి నిస్తుంది. విరేచనకారి. శ్రేష్ఠమయినది.
మృత్తిక:
మెత్తని పొడి మన్ను వేస్తే గాయం మానుతుంది. రక్తం కడుతుంది. ఎర్రమన్ను ఉడికించి కడితే కంటి మీద కురుపులు పోతాయి. మన్ను తింటే ఆకలి మందగిస్తుంది. పాండురోగం వస్తుంది.
యమున నీరు:
రుచిగా ఉంటుంది. ఇంద్రనీల కాంతి కలిగి మనోహరంగా ఉంటుంది. జఠరదీప్తి, మనో వికాసం, బుద్ధి, బలం, కాంతినిస్తుంది. ఆయాసాన్ని పోగొడుతుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్:
ఈ తైలాన్ని ఒక జాతి చెట్ల ఆకుల నుంచి తయారు చేస్తారు. ఘాటుగా సువాసగా ఉంటుంది. దీనిని శరీరంపై రాసుకుంటే చిమచిమలాడుతుంది. దీనిని గుడ్డ మీద వేసి వాసన చూస్తే పడిశ భారం, ఊపిరితిత్తుల్లో గల ఇబ్బంది, దగ్గూ అణచిపోతాయి. దీనిని నొప్పి ఉన్న చోట రాసి, వేడి నీటి గుడ్డతో కాపడం పెడితే నొప్పి, వాపు పోతాయి. కణతలకు రాసుకుంటే నొప్పి, శిరోభారం తగ్గుతాయి. ఈ చెట్ల ఆకులను నీళ్లలో వేసి కాచి, ఆ నీటితో స్నానం చేస్తే జ్వరం, వంటినొప్పులు, పడిశం తగ్గుముఖం పడతాయి. ఈ తైలంతో మర్దన చేసుకుంటే వాత, మేహ, కీళ్ల, నరాల నొప్పులూ పోతాయి.
రాచ ఉసిరికాయ:
పులుపు, తీపి, వగరు రుచుల్ని కలిగి ఉంటుంది. చలువ చేస్తుంది. రుచి పుట్టిస్తుంది. సర్వ మేహాలను, సర్వ పైత్యాలను, దాహాన్ని, తాపాన్ని అణచివేస్తుంది. దీని వేరు రసం మూత్రాన్ని జారీ చేస్తుంది. వీటిని ఊర వేసి తింటే నీరూరి, దాహం తగ్గుతుంది. రుచి కలుగుతుంది.
రాతి ఇల్లు:
రాతి ఇంటిలో ఉండటం వలన చలి, ఎండ బాధలు ఉండవు. మనోద్రేకం, కఫాలు అణగిపోతాయి. పైత్యం చేస్తుంది. జఠరదీప్తినిస్తుంది. స్థిరమైన బుద్ధి కలుగుతుంది. అయితే సదా నివాస యోగ్యం కాదు.
రాత్రివేళ వేడి నీరు తాగితే..:
నిద్రించే ముందు వేడి నీళ్లు తాగితే వాతం, కఫం, అరుచి పోతాయి. అన్నం జీర్ణం అవుతుంది. జఠరాగ్ని పెరుగుతుంది.
రామ ఫలం:
దీనిని రాంబాళ ఫలం అని కూడా అంటారు. తింటే దాహాన్ని, తాపాన్ని, శ్రమనీ, ఆకలినీ పోగొడుతుంది. చలువచేస్తుంది. కఫ వాతాలను పెంచుతుంది. పొట్టకు భారంగా ఉండి, తలనొప్పిని కలిగిస్తుంది.
రావి చిగుళ్లు:
వెగటుగా ఉంటాయి. కఫ, పైత్యాలను పోగొడతాయి. అతిసారాన్ని అరికడతాయి.
రావిచెట్టు:
దీని చెక్క రసం లేదా కషాయం వగరు, తీపి, చేదు రుచులను కలిగి ఉంటుంది. జ్వరం, మేహాలను అణచివేస్తుంది. నోటిపూతను తగ్గిస్తుంది. ఈ రసంతో కురుపులను కడిగితే త్వరలోనే మానిపోతాయి.
రావిపండ్లు:
రావిపండ్లు తీయగా ఉంటాయి. చలువ చేస్తాయి. పైత్యం, చర్ది, అరుచిని పోగొడతాయి. ఈ పండ్లను ఎండబెట్టి చూర్ణం చేసి పూటకు చిటికెడు చొప్పున రెండు పూటలా తీసుకోగలిగితే ఆస్తమా తగ్గుతుంది. అలాగే, ఈ చూర్ణాన్ని పంచదారలో కలిపి పాలతో తీసుకుంటే సంతాన యోగ్యం కలుగుతుంది. పురుషులకు వీర్య వృద్ధినిస్తుంది.
రేగుపండ్లు:
పుల్లగా, తియ్యగా ఉంటాయి. చలువజేసి ఆర్చుతాయి. బిగదీస్తాయి. వాతాన్ని, మేహాన్ని, మూలవ్యాధిని పోగొడతాయి. మంచి రక్తాన్ని స్తాయి. కాంతిని, బలాన్ని కలుగచేస్తాయి. ఆలస్యంగా జీర్ణమవుతాయి. గొంతును బొంగురు చేస్తాయి. కఫ, పైత్యాలను పెంచుతాయి.
లవంగ నూనె:
కారంగా ఉంటుంది. బలాన్ని, ఇంద్రియపుష్టిని కలిగిస్తుంది. వాత, పైత్యాలను, శ్లేష్మాలను, దగ్గును హరిస్తుంది. అజీర్ణాన్ని, కడుపునొప్పిని పోగొడుతుంది. పళ్లు గట్టిపడేలా చేస్తుంది. పుప్పి పంటి బాధను, చిగుళ్ల వాపు పోగొడుతుంది. ఈ నూనె శిరోజాలకు మేలు చేస్తుంది. కుదుళ్లు గట్టి పడేలా, తల వెంట్రుకలను మృదువుగా మార్చేలా చేస్తుంది.















































































































































































Review వస్తుగుణ దీపిక.