సంపాదకీయం – ఎలుగు చెప్పిన నిజం!

ఒకసారి సాయం అందుకుంటే సాయం చేసిన వారు, సాయం అందుకున్న వారు మిత్రులవుతారు.

ఈ నీతిని చెప్పే కథలు మన సాహిత్యం లోనూ, బయటి ప్రపంచంలోని సాహిత్యంలోనూ విశేషంగా కనిపిస్తాయి.

అయితే, మిత్రునిగా నటించే వారికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పే చక్కని నీతి కథ ఇది.

ఇద్దరు మిత్రులు అడవిదారి వెంబడి పొరుగూరుకు బయల్దేరారు. కొంతదూరం నడిచాక ఇద్దరూ అలసిపోయారు. చుట్టూ పరిశీలించి, అక్కడికి అడవి జంతువులు ఏవీ వచ్చే అవకాశం లేదని భావించి ఒక చెట్టు కింద నడుం వాల్చారు. అలా పడుకున్నారో లేదో ఇట్టే నిద్రపట్టేసింది. కొంతసేపటికి ఏదో అలజడి వినిపించి ఒక మిత్రుడికి చటుక్కున మెలకువ వచ్చేసింది.
చూస్తే ఏముంది?.. ఎదురుగా భయంకరమైన ఎలుగుబంటి నిలుచుని ఉంది. అది చాలా సమీపంలో ఉంది. మీద పడి రక్కేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అతడికి అనిపించింది.

చివాలున లేచి తాను పడుకున్న చెట్టు కొమ్మ ఒకటి అందుకుని పైకి ఎక్కేసి కూర్చున్నాడు.

అంతేతప్ప ఆ ఆపద సమయంలో తోటి మిత్రుడిని నిద్రలేపలేదు. అతడిని ప్రమాదం నుంచి తప్పించే యత్నం కూడా చేయలేదు.

అంతలో ఎలుగు నిద్రలో ఉన్న మిత్రుడిని సమీపించింది. కానీ, ఏమీ చేయలేదు. అతడి చెవి దగ్గర మూతి పెట్టి ఏదో వెతికింది. ముఖం వాసన చూసింది. కొద్దిసేపటికి తన దారిన తాను వెళ్లిపోయింది.

అది వెళ్లిపోగానే అతడు చటుక్కున లేచి ‘హమ్మయ్య’ అనుకుని ‘ఇక చెట్టు దిగి రా. వెళ్దాం’ అని చెట్టెక్కి కూర్చున్న మిత్రుడిని పిలిచాడు.

‘నేను చెట్టెక్కినట్టు నీకెలా తెలుసు?’ అని ఆశ్చర్యపోతూ అడిగాడు మొదటి మిత్రుడు.

‘ఎలుగ్గొడ్డు రావడం, క్షణంలో నువ్వు చెట్టెక్కడం నేను గమనిస్తూనే ఉన్నాను. కానీ, నేను నిద్ర లేవడంలో ఒక్క క్షణం ఆలస్యం చేశాను. నిజానికి ఆ క్షణంలో నేను కూడా లేచి ఉంటే ఎలుగుబంటి చంపేసేదే..’ అన్నాడు రెండో మిత్రుడు.
‘పడుకుని ఉంటే చంపదా?’ అని సందేహం వ్యక్తం చేశాడు చెట్టు దిగిన మిత్రుడు.

‘ఊపిరి బిగపట్టి నేల మీద చచ్చినట్టు పడి ఉంటే ఎలుగులు ఏం చేయవని వెనకటికి ఎవరో చెప్పగా విన్నాను. ఆపద సమయంలో అదే నియమాన్ని పాటించాను’ అని బదులిచ్చాడు చెట్టు కిందే ఉండిపోయిన మిత్రుడు.
అనంతరం ఇద్దరూ కలిసి మళ్లీ బయల్దేరారు. నడుస్తూ ఉండగా మధ్యలో అడిగాడు మొదటి మిత్రుడు- ‘నీ చెవిలో ఎలుగుబంటి ఏదో గుసగుసలాడిందే.. ఏమిటది?’ అని నవ్వుతూ అడిగాడు.

‘నీలాంటి మిత్రుడితో కలిసి ఎప్పుడూ ప్రయాణం చేయవద్దని చెప్పింది’ అని తడుముకోకుండా బదులిచ్చాడు రెండో మిత్రుడు.
దొంగమిత్రుడికి సరిగ్గా చురక పడినట్టయింది.

(ఆగస్టు 2 – స్నేహితుల దినోత్సవం)

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు రాజేశ్వరి అన్నవరపు

Review సంపాదకీయం – ఎలుగు చెప్పిన నిజం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top