పెదవే పలికిన మాటల్లోనే
తీయదనం అమ్మా..
కదిలే దేవత అమ్మా.. కంటికి వెలుగమ్మా
—
ఎవరు రాయగలరు అమ్మ అను
మాట కన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అను
రాగం కన్నా తీయని రాగం
—
సృష్టికర్త ఒక బ్రహ్మ..
అతనిని సృష్టించిందొక అమ్మ
—
అమ్మంటే తెలుసుకో
జన్మంతా కొలుచుకో
—
అమ్మను మించి దైవమున్నదా?
అవతార పురుషుడైనా అమ్మకు కొడుకే
—
.. ఇవీ మన తెలుగు సినిమాల్లో అమ్మకు పట్టం కట్టిన పాటల్లోని కొన్ని చరణాలు.
నిజానికి అమ్మ ప్రేమను కొలవడానికి ఈ సృష్టిలో ఏ కొలమానమూ లేదు.
బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు.
నిజానికి బ్రహ్మ అమ్మను సృష్టించాడా?
లేదు.. లేదు.. అమ్మే బ్రహ్మకు ప్రాణం పోసింది.
‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ ఉండరు’..
ఇది ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలోని పవర్‍ఫుల్ డైలాగ్. అమ్మ గురించి చెప్పడానికి ఇంతకుమించిన పదాలుండవేమో!.
అభిమానం పెంచాలన్నా.. అనురాగం పంచాలన్నా అమ్మ తరువాతే ఎవరైనా.
ప్రేమ అనే పదానికి సంపూర్ణ రూపం- అమ్మ.
కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు మోసి, రక్తమాంసాలు పంచి అమ్మ తాను పునర్జన్మ పొందుతూ బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ.
మనకు నడక, నడత, నాగరికత నేర్పేది అమ్మే.
దేవుడు అన్నిచోట్లా తానుండలేక అమ్మను సృష్టించాడంటారు.
అంతులేని త్యాగం, నిరుపమానమైన ప్రేమ, ఆప్యాయతకు మారుపేరైన మాతృమూర్తి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే.
అమ్మను స్మరించుకోవడానికి ఒకరోజు పెట్టారు కానీ, ఆమెను స్మరించుకోకుండా గడిచే రోజంటూ ఒకటి మనకు ఉందా?
(అంతర్జాతీయ మాతృ దినోత్సవం,
మే 12, 2024)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review అమ్మకు ప్రేమతో...