యాదేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ:।।
శరన్నవరాత్రుల్లో ఎనిమిది తిథులు గడిచిన సెప్టెంబరులోనే ముగిశాయి. ఇక మిగిలినవి నవమి, దశమి.
అక్టోబరు 1 మహర్నవమి, అక్టోబరు 2 విజయదశమి.
తిథుల్లో నవమి.. ధైర్యానికీ, ధర్మానికీ, శత్రుసంహారానికి ప్రతీక.
మహర్నవమి రోజున అమ్మవారిని అపరాజిత (ఓటమెరుగనిది)గా పూజిస్తారు.
నవమి నాడు అమ్మవారు ధరించే రూపం- కాళిక.
‘క్రోధేచ కాళీ’ అంటారు.
అంటే భయంకరమైన క్రోధంతో ఉంటుంది. కాల అంటే మృత్యువు. శత్రువులను సంహరించాల్సి వచ్చినపుడు అమ్మ అంత రౌద్రంతో కాళికగా మారుతుందట.
నవమి నాడు దేవి రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించింది.
బీజం అంటే విత్తనం. తన రక్తం నేల మీద పడితే తనలాంటి వాళ్లు వేలమంది పుట్టాలని వరం పొందాడు రక్తబీజుడు. అందుకే భూమినే నాలుకగా చేసుకుని ఆ రాక్షసుడిని సంహరించింది దుర్గాదేవి.
అలాగే, మహిషాసురుడనే రాక్షసుడితో అమ్మవారు తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేస్తుంది. మహిళ చేతిలో తప్ప తనకు చావులేకుండా వరం పొందిన ఆ రాక్షసుడిని అంతమొందించే బాధ్యతను ఆ ఆదిపరాశక్తి తీసుకుంటుంది. తొమ్మిది రోజుల యుద్ధంలో అతడిని సంహరించి లోకానికి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది.
నవమి తరువాతది దశమి తిథి.
ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు సాయంత్రాన్ని ‘విజయ కాలం’ అంటారు.
ఆ కాలంలో ఎవరు శక్తిస్వరూపిణిని ఆరాధిస్తారో వారికి తమ కార్యాల్లో తప్పక విజయం లభిస్తుందని అంటారు.
శ్రవణా నక్షత్రంతో కలిసిన దశమి తిథిని విజయదశమి లేదా దసరా దశమిగా జరుపుకుంటారు.
నక్షత్ర మండలంలో శ్రవణా నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుందనీ, అందుకే ఏవైనా కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునే వారు ఆ రోజు ప్రారంభిస్తే విశేష ఫలితం ఉంటుందని చెబుతారు.
దశమి రోజు చేసే మరో విశేషమైన కార్యక్రమం- శమీపూజ.
శమి అంటే పాపాల్నీ, శత్రువుల్నీ నశింపచేసేదని అర్థం.
జమ్మిచెట్టు కొమ్మ లేదా సమిధకు ప్రదక్షిణ చేస్తే.. శరన్నవరాత్రుల్లోని తొమ్మిది రోజులు పూజలో తెలియక చేసిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయని అంటారు.
దశమి రోజున జమ్మిచెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట.
తనను నమ్మిన భక్తుల పాలిట అమ్మగా మారి ఎలాగైతే కరుణను కురిపిస్తుందో, లోకకంటకుల పాలిట అంతే రౌద్రాన్ని చూపి దుష్టసంహారం చేస్తుంది దుర్గామాత.
అటువంటి తల్లిని స్మరించుకునే ఉత్సవమే విజయదశమి.
దసరా, దీపావళి,
కార్తిక మాస శుభాకాంక్షలు
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు




























































Review అమ్మకు వందనం!.