భవిష్యత్తుకు ఓ ఆకారమంటూ ఉంటే అది స్త్రీ రూపంలోనే ఉంటుంది.
అదే- శక్తి స్వరూపం.
శక్తి.. అనంతతత్త్వానికి ప్రతీక.
ఆ శక్తి స్వరూపిణికి మరెవరో సాధికారత కట్టబెట్టలేదు. తనకు తానే అధికారాన్ని సృష్టించుకుంది.
సృష్టించడం అనేది ఆమెకు మాత్రమే తెలిసిన విద్య.
విధాత బొమ్మను మాత్రమే చేయగలడు.
ప్రాణం పోసేది మాత్రం శక్తి స్వరూపిణి అయిన మూలపుటమ్మే!.
ఆమె సరస్వతిగా- విజ్ఞాన స్వరూపం.
ఆమె పార్వతిగా- అధికార స్వరూపం.
ఆమె లక్ష్మిగా- సంపద స్వరూపం.
నిజానికి ముగ్గురు మూర్తులున్నట్టు కనిపిస్తారు కానీ, ఉన్నది ఒక్కటే మూర్తి.
మూడు లోకాలని అంటారు కానీ, ఉన్నది ఒకటే పదార్థం.
మూడు కాలాలని లెక్కలేస్తారు కానీ, ఉన్నది ఒకటే స్వరూపం.
ఆమే.. అమ్మ!.
అమ్మవారి ఈ మూడు స్వరూపాల పునాదులపైనే లోకమంతా నడుస్తోంది. కాదు.. కాదు.. అమ్మలగన్న అమ్మే ఈ లోకాన్ని నడిపిస్తున్నది.
సృష్టి, పున:సృష్టి, ఆలనాపాలనా అన్నీ అమ్మ బాధ్యతలే.
పురుషుడు కేవలం ఆమెకు సహాయకుడు.
అతడు తీగ అయితే.. ఆమె అందులో ప్రవహించే విద్యుత్తు.
అతడు కలం అయితే.. ఆమె అందులోని సిరా.
అతడు వాహనం అయితే.. ఆమె ఇంధనం.
అతడు గల్లాపెట్టె అయితే.. ఆమె ధనం.
అమ్మ స్వతహాగా పరిపూర్ణ.
మరి పురుషుడో..?!. అచ్చమైన అరసున్నా!
అతడికి ఆమె (శక్తి) తోడైతేనే పురుషుడికి పూర్ణత్వం.
ముగ్గురు మూర్తులను తనలో సమన్వయం చేసుకుని, త్రికాలాలను తన నేత్రద్వయంతో అమ్మ నడిపించే పద్ధతి.. ఆమెకు మాత్రమే సాధ్యమైన ‘పాలన’.
అమ్మ లోకాన్ని నడిపించే పద్ధతిని ‘శక్తి మేనేజ్‍మెంట్’ అనొచ్చు.
ముగ్గురమ్మల మూలపుటమ్మ సహజమైన నాయకురాలు.
ఆమె పాలనలోనే మనకు శాంతి, సౌఖ్యం.
ఆమె కన్ను తెరిస్తే అన్యాయం, అక్రమం, దుర్మార్గం తదితర అవలక్షణ చీకట్లన్నీ పటాపంచలైపోతాయి.
లోకమంతా దసరా, దీపావళి వంటి వేడుకలు వెల్లివిరుస్తాయి.
అందరికీ దసరా, దీపావళి
శుభాకాంక్షలు
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవర
Review అమ్మకు వందనం!.