అమ్మ ప్రేమకు మారు పేరు

లోకంలో ఎందరు బిడ్డలైనా ఉండవచ్చు. వాళ్ల తత్వం వేరు. అయితే, ఎందరు తల్లులైనా ఉండవచ్చు. ఆ తల్లుల తత్వం మాత్రం ఒక్కటే.
అవును! ఈ సృష్టిలో ప్రతి తల్లి తత్వం ఒక్కటే. అది- ప్రేమ, మమకారం, సేవ, అంకితభావం, త్యాగాల మేళవింపు. ఆ బేల మనసులో, ఆ బలహీన శరీరంలో బిడ్డ పట్ల కొండంత ప్రేమ. బిడ్డ కోసం కొండను ఢీకొట్టేంత తెగువ.. సర్వం ఇవ్వగల, ఇచ్చేయగ•లిగేంత త్యాగం.. తన రెక్కల చాటు ఉండగా, తన ఆశీస్సుల చాటు ఉండగా, ఆ పిల్ల పక్షిని ఏ గద్దలూ తన్నుకుపోలేవు. ఏ పాములూ మింగలేవు. బిడ్డ శరీరాన్ని గర్భస్థ శిశువుగానే తన రక్తమాంసాలతో, ఊపిరితో మలుచుకున్న తల్లి ఆ బిడ్డ మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా మలుచుకుంటుంది. తనను మించి మెరుగు పెట్టుకుంటుంది. ఒక బిడ్డలో తల్లిది కానిదంటూ ఏమీ లేదు. ఉండదు. అవసరం తీరిపోయాక పేగు కోసుకుని ఆ బిడ్డ విడిపోయినా తన మనోబంధంతో, అనురాగ బంధంతో తల్లి బిడ్డతో తన బంధాన్ని, అనుబంధాన్ని ఎప్పట్లాగే కొనసాగిస్తుంది. ఆమె దృష్టిలో ఆ కోత బిడ్డ బొడ్డు గాయంగానే కనిపిస్తుంది కానీ, తన నుంచి బిడ్డను విడదీసిన కసాయి కోతగా అనిపించదు. తన మనోబంధం నుంచి బిడ్డ విడిపోవడం అనేది తల్లి కలనైనా ఊహించలేనిది. తల్లి పక్షి పిల్ల పక్షి కాలికి దారం కట్టి వదిలి నిశ్చింతగా ఉన్నట్టు తన నాభి బంధాన్ని నమ్ముకునే ఉంటుంది అమ్మ. పిల్ల స్వేచ్ఛగానే తిరుగుతున్నా తన ఆత్మబంధానికి కట్టుబడే ఉంటుందని నమ్ముతుంది పిచ్చి తల్లి. ఒక మనిషికి సాటిలేని, మరోదానితో పోల్చలేని అత్యంత అద్భుత వరం అమ్మ. అంతకు మించిన వరాన్ని మరోదాన్ని దేవుడైనా ఇవ్వలేడు. అమ్మను మలిచిన ఆ దేవుడిని మించిన శిల్పి, కళాకారుడు, మనస్తత్వ శాస్త్రవేత్త, మనిషి అవసరాలను, ఆశలను, బలహీనతలను యథాతథంగా గ్రహించిన అవగాహనపరుడు మరొకరు ఉంటారని ఊహించడం కూడా అవివేకం. అలా ఊహించే అవకాశమే లేదు. ఎందుకంటే అమ్మ ఇవ్వలేనిది ఏమీ లేదు కనుక. ఇవ్వడంలో దేవుడు కూడా అమ్మ కంటే వెనుకబడే ఉంటాడు. ఎందుకంటే, దేవుడిది అహేతుక ప్రేమే అయినా ఆయన పట్ల మనకు భయం ఉండాలి. భక్తి ఉండాలి. నిర్మొహమాటంగా శిక్షిస్తాడనే పాపభీతి ఉండాలి. ఒక పూజ్యభావం, ఒక గౌరవం.. ఇలాంటివే మరెన్నో ఉండాలి. ఉంటాయి. కానీ, అమ్మకు అవన్నీ ఏమీ అవసరం లేదు. తన గుండె పెకలించినా, ‘అలా పెకలించినప్పుడు నీ చేయి నొప్పి పెట్టిందా కన్నా!’ అంటూ బాధపడుతుంది. ఆమె బిడ్డకు ఏదైనా ఇవ్వడానికి, అది తన దగ్గర లేకపోవడం ఒక్కటే అభ్యంతరం కానీ, ఇచ్చేందుకు కాదు. అది ఏదైనా! అదీ అమ్మంటే.. మనిషి జీవితంలో- అతడెవరైనా కానీ గాక, అమ్మది అత్యంత ప్రభావవంతమైన స్థానం. అందుకే మనందరిపై అమ్మ ప్రభావం ఉంటుంది. మనందరి జీవితంలో అమ్మది విడదీయరాని పేగు బంధం. ఆ బంధాన్ని కలకాలం నిలుపుకోవడమే మనందరి విధి. ఆషాఢ మాస వేళ.. ఈ సృష్టికి మూలపుటమ్మ అయిన ఆ ఆదిపరాశక్తితో పాటు ఆమెకు సరిపాటి అయిన మన అమ్మనూ కొలుద్దాం. తరిద్దాం.

Review అమ్మ ప్రేమకు మారు పేరు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top