ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను..
అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ భావనకు దగ్గరగా ఉండేదే ప్రారంభంలో పేర్కొన్న వాక్యం. ఇది యెహాను సువార్తలో ఉంది.
‘ఆదియందు వాక్యముండెను.
వాక్యము దేవుని యొద్ద ఉండెను.
వాక్యము దేవుడై ఉండెను..’ అనడం ద్వారా వాక్యానికి దైవత్వాన్ని ఆపాదించి, భగవంతునితో ఆధ్యాత్మికంగా అనుబంధం ఏర్పరిచే వంతెనగా దాన్ని నిలిపే ప్రయత్నం జరిగింది.
తాత్విక ధోరణితో పాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు, ఉపమానాలు క్రీస్తుకు భక్తులను దగ్గర చేసేందుకు దోహదపడ్డాయంటే అందుకు కారణం.. తెలుగులోకి బైబిలు సరళానువాదమే కారణం.
నైతికత, మానవ జీవితంలోని కఠిన వాస్తవాలు, పాప ఫలం, పరలోక రాజ్యం.. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు పామరులు సైతం మనసుకు ఎక్కించుకుని తమ జీవితాలను సన్మార్గంలో నడిపించుకునేందుకు బైబిలులోని కొన్ని అందమైన, అర్థవంతమైన వాక్యాలు దోహదం చేశాయి. ఇలాంటి అమూల్యమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి.
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు: పరలోక రాజ్యము వారిది.
దు:ఖపడువారు ధన్యులు: వారు ఓదార్చబడుదురు.
సాత్వికులు ధన్యులు: వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు: వారు తృప్తిపరచబడుదురు’.
ఇలాంటివే మరెన్నో మచ్చుతునకలాంటి వాక్యాలు ఆధ్యాత్మికపరులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయి.
బైబిలులో ప్రధానంగా వి(క)నిపించే పదాలు ‘గాస్పెల్’, ‘ఆమెన్’, ‘హలేలూయా’ తదితరాలు..
గాస్పెల్ అంటే సువార్త అని తెలుగు అర్థం.
ఆమెన్ అంటే తథాస్తు అని అర్థం.
హలేలూయా అనే హిబ్రూ పదానికి తెలుగు అర్థం- దేవునికి స్తుతి కలుగు గాక.
ఏ మత గ్రంథంలోనివైనా కానీయండి. వాటిలోని పదాలు, వాక్యాలు, ఆధ్యాత్మిక బోధనలు సార్వకాలీనమైనవి.
అవి సార్వజనీనమైనవి.
నిత్యమై, సత్యమై నిలిచి జనరంజకంగా భాసిల్లిన క్రీస్తు బోధనలు జీవన నాణ్యతను మెరుగుపరిచే మహిమాన్విత మేలి ముత్యాలు.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review ఆదియందు వాక్యముండెను...