హరిహరులకు ప్రీతికరమైనది- కార్తిక మాసం.
హరి స్థితికారకుడు. హరుడు శుభంకరుడు.
వీరిద్దరి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, చేసే ప్రతీ పనీ శుభాలనిచ్చేదిగానూ ఉండాలనే ఆశయసిద్ధి కోసం అంతర్ముఖయానం గావించుకోవాలన్న దానికి ప్రతీక కార్తిక మాసమని అంటారు.
కార్తిక స్నానం, వ్రతం, దీపం, పౌర్ణమి, సమారాధన, ఉపవాసాలు, జాగరణలు భక్తితత్త్వాన్ని పెంచుతాయి. కార్తికంలో ప్రాత:కాలపు స్నానాలకు ఎంతో ప్రశస్తి ఉంది. ఆ సమయంలో చేసే స్నానాన్ని రుషీ స్నానం అంటారు. కాబట్టి ప్రాత:కాల స్నానం పరమోత్తమైనది.
స్నానం- ఈ మాసంలో ఆరోగ్యదాయకం. కార్తిక మాసం ప్రవేశించే నాటికి వర్షరుతువు సమాప్తమవుతుంది. వర్ష జలధారలు సమస్త మూలికల సారాన్ని, భూపొరల్లోని ధాతువుల సారాన్ని కలగలుపుకుని నదుల్లోకి అంతర్వాహినిగా వచ్చి చేరుతాయి. ఔషధ జలంలా జల ప్రవాహాలు పరిఢవిల్లుతాయి. ప్రవాహ వేగానికి ఎదురు నిలబడి స్నానమాచరిస్తే- జల ప్రవాహాల్లోని ఔషధీయ గుణాలు, విద్యుత్ తరంగాలు దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. స్నానం చేసిన అనంతరం రావిచెట్టు, తులసి, ఉసిరిక చెట్ల వద్ద దీపారాధన, దైవారాధన చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వృక్ష సంపద ఆరోగ్య భాగ్యాన్ని కలుగచేస్తుంది. యజ్ఞ ద్రవ్యంగానూ ఉపయోగపడుతుంది.
దీపం- జ్ఞానానికి చిహ్నం. సర్వ సంపదలు జ్ఞానం వల్ల లభిస్తాయి. ఈ నెలంతా దీపారాధన చేసి, చివరి రోజున వెలుగుతున్న వెండి ప్రమిదను దానం చేస్తే అనంత పుణ్యఫలం, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు.
ఏకభుక్తం- కార్తికంలో అవశ్యం. ఈ మాసం నాటికి జఠరాగ్ని మందంగా ఉంటుంది. దాన్ని చురుగ్గా ఉంచేందుకు ఏకభుక్తమే ఔషధం.
ఉపవాసం- కార్తికంలో శివుడికి మనల్ని దగ్గర చేస్తుంది. ఉపవాసం అంటే ఆహారం లేకుండా రోజు గడపడమని కాదు. భగవస్నాన్నిధ్యంలో ఆ రోజును గడపడం.
సోమవారం- శివుడికి ప్రీతికరమైన దినం. ఇక కార్తిక సోమవారం మరింత ప్రత్యేకం. ఈరోజు మారేడు దళాలతో శివుడిని పూజిస్తే శివసాయుజ్యం పొదుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
పూర్ణిమ- కార్తిక పూర్ణిమ నాడు శ్రీమహావిష్ణువును షోడశోపచారాలతో పూజిస్తే యశస్సును, సామ్రాజ్య వైభవాలను పొందుతారని ‘పురంజయుని’ చరిత్ర చెబుతోంది.
సమారాధాన- కార్తికంలో జరిగే ఈ సమారాధన, వన భోజనాల సంప్రదాయం ఐకమత్యానికి నిదర్శనం. ప్రజలు అన్ని భేదాలు విడనాడి సామూహిక భోజనాలు ఆచరించాలనేది దీని ఉద్దేశం.
చాతుర్మ్యాస వ్రతం- కార్తిక శుద్ధ ఏకాదశితో ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది. మానవ జీవితకాలంలో సగం ఆయుష్షు నిద్రకే సరిపోతుంది. మేల్కొని ఉండే జాగ్రదావస్థ, జీవిత స్థితిగతులను వ్యవస్థీకృతమైన విధానంలో నడుపుకోవాలి. సమయపాలనకు, కాలానికున్న విలువను తెలియ చెబుతుంది చాతుర్మ్యాస వ్రతం.
అందరికీ కార్తిక మాస శుభాకాంక్షలు
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review ఆధ్యాత్మిక దీపం.