ఆంగ్ల మానం ప్రకారం జనవరి కొత్త సంవత్సరం. ఇది ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో మొదటి మాసం. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి.. పుష్య మాసం. అలాగే మార్గశిర మాస తిథులు కూడా కొన్ని కలుస్తాయి. చైత్రాది మాస పరిగణనలో పుష్యమి తొమ్మిదవ మాసం. ఈ మాసంలో 13వ తేదీ వరకు మార్గశిర మాస తిథులు, ఆపై పుష్య మాస తిథులు కొనసాగుతాయి. జనవరి 14 నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. తెలుగు సంప్రదాయంలోనే అతి పెద్ద పర్వమైన సంక్రాంతి, విశిష్టమైన వైకుంఠ ఏకాదశి వంటి పండుగలకు ఈ మాసం నెలవు.
2021- జనవరి 1, శుక్రవారం, మార్గశిర బహుళ విదియ నుంచి
2021- జనవరి 31, ఆదివారం, పుష్య బహుళ తదియ వరకు..
శ్రీశార్వరి నామ సంవత్సరం- మార్గశిరం – పుష్యం- హేమంత రుతువు- ఉత్తరాయణ
పుడమిని సస్యశ్యామలం చేసే మాసం- పుష్యం. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం కాబట్టి పుష్య మాసం అయ్యింది. ‘పుష్య’ అనే పదానికి పోషణ శక్తి కలిగినది అని అర్థం. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాలకు, వేదాధ్యయనానికి అనువైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని పండితులు చెబుతారు. పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యేందుకు అవకాశం కల్పించేది కూడా ఈ మాసమే. పుష్య మాసంలోనే పంటలు చేతికి అందిన సంతోషంతో రైతులు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర
పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు. వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యాన్ని కలుగచేస్తుంది. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలో ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి
Review ఆధ్యాత్మిక ‘మార్గం‘.