పతీది మన ప్రారబ్ధం అనుకోవడం బలహీనుల లక్షణం. మన పుట్టుక,. దేహవర్ణం, తల్లిదండ్రులు, బంధువర్గం తదితర విషయాల్లో మనం స్వతంత్రులం కాకపోవచ్చు. భగవంతుడు ఎక్కడ పుట్టిస్తే, అక్కడి నుంచే మన జీవితాన్ని ఆరంభించాలి. కానీ స్వప్రయత్నంతో మనం ఏ స్థాయికైనా చేరుకోవచ్చు. మన చరిత్రను మనమే తిరిగి రాసుకోవచ్చు. మన జన్మ ప్రారబ్ధ కర్మ కావచ్చు. కానీ, భవిష్యత్తు మాత్రం మన పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది.
అంటే మనం చేసే ప్రయత్నం ఫలితమే మన భావి జీవితం. ఈ ప్రపంచంలో ఏదీ సులభంగా లభించదు. ప్రకృతి నుంచి మనం దేనిని పొందాలన్నా ఎంతో కొంత మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మన కర్మ ఇలా ఉందని నిరంతరం కాలాన్ని నిందిస్తూ కూర్చునే వారు జీవితంలో ఏమీ సాధించలేరు.
మన వ్యక్తిగత సామర్థ్యం, పట్టుదల, పైకి రావాలన్న దీక్ష, ప్రతికూలమైన ప్రారబ్ధకర్మను కూడా సానుకూలంగా మార్చేస్తుందని మన సనాతన ధర్మం ఎన్నో ఉదాహరణలతో తేటతెల్లం చేసింది. ఆత్మవిశ్వాసం, అకుంఠిత దీక్ష కొరవడిన వారే ప్రారబ్ధం పేరు చెప్పుకుంటూ పలాయనవాదులుగా, ఏమీ సాధించకుండా నిరాశావాదులుగా మిగిలిపోతారు. నిజాయతీగా, ధర్మబద్ధంగా మన వంతు ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకప్పుడు అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలుగుతాం. పాండవులు ఎన్నో ఇక్కట్ల పాలయ్యారు. కానీ, వారు ధర్మ మార్గాన్ని విడువలేదు. అందుకే వారి నైతిక శక్తికి శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం తోడైంది. దుష్టవర్తనులైన కౌరవులు పన్నిన ఎన్నో పన్నాగాల నుంచి పాండవులను ఆ అనుగ్రహమే, వారి ధర్మవర్తనే కాపాడింది. చివరకు ధర్మమే గెలిచింది. పాండవులను విజయులను చేసింది. విధివశాత్తూ ఎన్ని వైపరీత్యాలు ఎదురైనా ధర్మాన్ని పునాది చేసుకుని పురుషార్థాన్ని నమ్ముకోవాలి. మన భవితకు మనమే సూత్రధారులమని మరువరాదు.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు- మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి. అంతేకానీ అథోగతి పాలు కారాదు. ఎవరు తమ మనసును జయించి, దానిని అదుపులో ఉంచుకుంటారో అతని మనసే అతనికి బంధువవుతుంది. అదే భవిష్యత్తుగా మార్గదర్శనమై దారి చూపిస్తుంది. నిరంతర కృషి, నిర్విరామ సాధన, ఆత్మవిశ్వాసం- ఇవి మనిషిని ఉన్నతస్థితికి చేరుస్తాయి.
స్తబ్ధత, సోమరితనం, జడత్వం- ఇవి మనిషికి మానసికంగా, లౌకికంగా, పారమార్థికంగా దెబ్బతీస్తాయి.
Review ఏది నీ దారి?.