ఓం గురుభ్యోనమ:

గురువు అంటే..గౌరవమైనది, గొప్పది అని అర్థం. గురువు అనే శబ్దం మనలోని అజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మనలో ఏళ్ల తరబడి పిడచకట్టుకొనిపోయిన అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి, జ్ఞానజ్యోతిని వెలిగించే మహత్తర శక్తి గురువు.
భారతదేశం యుగయుగాలుగా గురువును గొప్ప దృష్టితో చూస్తోంది. ధర్మదండాన్ని గురువు చేతికిచ్చి దేశ ధర్మాన్ని నడిపించాలని కోరిన ఘటన భారతీయులది. గురువులు కూడా పలు రకాలు.
ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆవపోసన పట్టిన గురువులు కొందరు.. రాజనీతి సామాజిక బాధ్యతను తమ భుజాలకెత్తుకున్న గురువులు మరికొందరు..
ఎవరి మార్గంలో వారు పనిచేస్తూ, ధార్మిక తత్త్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు.
వేదకాలంలో రుషి పరంపర గురు పరంపరగా ఉండిపోయింది. దాని వివిధ దశలు, రూపాలను మనం ఈనాటికీ చూస్తూనే, అనుభూతి చెందుతూనే ఉన్నాం.
వైదిక జ్ఞానాన్ని విభజించి, వేదమార్గం సుస్థాపితం చేసిన వేదవ్యాసుడు జన్మించిన రోజునే గురుపౌర్ణమిగా జరుపుకోవడం మన దేశ సంప్రదాయం.
గురుపూర్ణిమ నాడు ఏ సంప్రదాయం వారైనా సరే.. తమ గురు పరంపరను పూజిస్తారు. తమ గురువుల త్యాగాన్ని, తపస్సును స్మరించుకుంటారు.
భక్తుల మధ్య ఏకత్వాన్ని సాధించే గురుపూర్ణిమ వేడుక గురుతత్త్వాన్ని ప్రబోధిస్తుంది.
మరి, గురువులు ఎన్ని రకాలో, ఏ గురు పరంపర ఏం బోధిస్తుందో తెలుసుకుందాం.
సూచక గురువు: చదువు చెప్పే గురువు
వాచక గురువు: కుల, ఆశ్రమ ధర్మాలు బోధించే గురువు
నిషిద్ధ గురువు: వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పే గురువు
విహిత గురువు: విషయ భోగాలపై విరక్తి కలిగించి జ్ఞానమార్గం వైపు నడిపించే గురువు
కారణ గురువు: జీవ బ్రహ్మైక్యం బోధించే గురువు.
పరమ గురువు: జీవాత్మ, పరమాత్మ యోగాన్ని ప్రబోధించే గురువు

గురువులు ప్రధానంగా ఐదు రకాలు దీక్షలను ఇస్తుంటారు.
స్పర్శ దీక్ష: గురువు శిష్యుడిని తాకినంతనే శిష్యునికి శక్తి వస్తుంది. ఇది ఎంతో తపశ్శక్తి గల మహాత్ములిచ్చే దీక్ష
ద్ధ్యనదీక్ష: గురువు దూరంగా ఉంటూనే శిష్యుని ఉద్ధారణకు ధ్యానం చేస్తాడు. దాని వల్ల శిష్యునికి శక్తి కలుగుతుంది. ఆ విధంగా శిష్యుడు ఉన్నత సాధన మార్గంలోనికి ప్రవేశిస్తాడు.
దృగ్దీక్ష: ఈ దీక్ష కంటిచూపుతోనే ఇచ్చేది.
మంత్ర దీక్ష: గురువు శిష్యుడికి క్రమంగా ఆధ్యాత్మిక విషయాలు ప్రబోధిస్తూ, ధర్మసూత్రాలు విశదీకరిస్తూ, మంత్రదీక్ష ఇచ్చి తరుణోపాయం చూపిస్తాడు. మన సంప్రదాయంలో ఎక్కువ మంది ఇలాంటి దీక్షలే ఇస్తుంటారు.
వైదిక దీక్ష: వైదిక సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా వేదమంత్రోచ్ఛారణ మధ్య ఇచ్చే దీక్ష. ఈ దీక్షలో ఉపనయనం, వేదాధ్యాయనం, బ్రహ్మోపదేశం వంటివి ఉంటాయి.

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review ఓం గురుభ్యోనమ:.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top