కనులపండువ.. శరత్కాలపు వెన్నెల

చందనం శీతలం ఆరోగ్యదం లోకే
చందనాదపి ఫలవాన్‍ చంద్రికా
చంద్ర చందనయోరపి శీతలా ఆరోగ్యదా
సౌందర్య సంపత్కరీ సుఖదా చ శరత్చంద్రికా
లోకంలో చల్లనిదీ, ఆరోగ్యాన్ని ఇచ్చేదీ చందనం.
దాని కంటే శక్తి గలది పున్నమి వెన్నెల.
అంతకంటే సౌఖ్యాన్ని, సౌందర్యాన్ని, సంపదలనూ ఇచ్చేది శరత్కాల వెన్నెల.
ఇదీ పై శ్లోకం భావం.
ఎందరో కవులు శరత్కాల వర్ణనలకు పెద్దపీట వేశారు.
నన్నయ్య ‘శారద రాత్రులుజ్జ్వల..’ అంటూ శరత్కాల వర్ణనతో రచన చాలించాడు.
ఎరాప్రగడ శరత్కాల వర్ణనతో భారతాన్ని కొనసాగించాడు.
విశేషమేమిటంటే- నన్నయ్య రాత్రిని వర్ణిస్తే, ఎర్రన పగటి కాంతిని వర్ణించాడు.
శరత్కాలంలో పగలు, రాత్రి కూడా సొగసైన ప్రకృతి సౌందర్యాన్నే కలిగి ఉంటాయి.
శరత్కాలంలో రాత్రి పూట ఆకాశాన్ని జాగ్రత్తగా పరికిస్తే, నక్షత్రాల అమరిక సింహ వాహనంపై ఆదిపరాశక్తి ఉన్నట్టు ఉంటుందని అంటారు.
ఈ ఖగోళ విన్యాసాన్ని రుషులు సామాజిక పర్వంగా అభివర్ణించారు.
రుతువుల్లో శరదృతువే ప్రధానమైనదని పేర్కొంది రుగ్వేదం.
ఎందుకంటే కారణాలు చాలానే ఉన్నాయి.
శరత్కాలంలో ప్రధాన పాత్ర చంద్రుడిది.
ఈ కాలంలో చంద్రకాంతి నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.
చంద్ర కిరణాల కాంతిలో ఆరోగ్య కారక గుణాలున్నాయి.
ముఖ్యంగా మానసిక స్థితి మీద ఇది ప్రభావాన్ని చూపుతుంది.
శరత్కాల చంద్రకాంతిలో ఔషధ గుణాలుంటాయి. కనుక ఆహార నియమాలు పాటిస్తూ, పూజావిధి నిర్వర్తించడం వల్ల సకలాభీష్టాలూ నెరవేరుతాయని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
శరన్నవరాత్రుల్లో జగదంబను ఆరాధించే వారికి సర్వ శుభాలూ సంప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు. ఇవి అమ్మవారికెంతో ప్రియమైన రోజులు.
‘దుర్‍’ అంటే చెడు స్వభావం. ‘గ’ అంటే దాటడం.
భక్తుని చెడు స్వభావాన్ని పోగొట్టి కష్టాలు దాటేటట్టు చేసే శక్తిస్వరూపిణి దుర్గ.
అందువల్ల శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో ఆరాధించాలని దేవీ భాగవతం చెబుతోంది.
శరత్కాలం వచ్చే నాటికి వర్షాకాలం ముగిసి వాతావరణంలో ప్రశాంతత అలముకుంటుంది.
ఈ వాతావరణ మార్పు వ్యాధులకు కూడా కారణమవుతుంది.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో శుచిగా ఉంటే అనారోగ్యాలు దరిజేరవు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శరన్నవరాత్రుల పేరిట ఆచరించే వేడుకల, పాటించే నియమాల ఆంతర్యం ఇదే..

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review కనులపండువ.. శరత్కాలపు వెన్నెల.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top