
అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన బుల్లి కృష్ణుడు.. నడుస్తూ నడుస్తూ దబ్బున పడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి విబూది పూతలా మారింది. ఉంగరాల జుత్తును పైకి దువ్వి, ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంతా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠాన ఉన్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి.. బాలకృష్ణుడు అచ్చు శివుడే అనిపించాడట!.
ఒకసారి పాలు తాగడానికి చిన్ని కృష్ణుడు పేచీ పెట్టాడు. యశోద నచ్చచెప్పి తాగించాలని చూసింది. కన్నయ్య వింటేనా! చివరకు, ‘పాలు తాగితే జుట్టు బాగా పెరుగుతుంది’ అందట యశోద. అంతే.. వెంటనే గుటుక్కున పాలు తాగేసిన కృష్ణయ్య, తన జులపాలు తడిమి చూసుకుని ఇంకా పెరగలేదేమిటని బుంగమూతి పెట్టాడట.
ఇంకోసారి, బాలకృష్ణుడు కథలు చెప్పాలని తల్లిని ఒకటే వేధించసాగాడు. కథలు పగలు చెప్పకూడదు. రాత్రికి చెబుతానని యశోద సముదాయించింది. ‘రాత్రి అంటే ఏమిటి?’ అని అడిగాడు బాలకృష్ణుడు.
‘చీకటిగా ఉంటుంది. ఏమీ కనిపించదు’ అని తల్లి బదులిచ్చింది. వెంటనే కన్నయ్య కళ్లు మూసుకుని, ‘ఇప్పుడు నాకేం కనిపించడం లేదు. కథ చెప్పు’ అన్నాడట. తల్లి యశోద కన్నయ్య తర్కశాస్త్ర ప్రావీణ్యానికి మురిసిపోయి ముద్దాడటం మినహా ఇంకేం చేస్తుంది?
ఒకసారి కుబేరుడు ఈశ్వరుడిని విందుకు ఆహ్వానించాడు. తాను రాలేనని, తన కుమారుడైన బుల్లి గణేశుడిని తీసుకువెళ్లాలని శివుడు చెప్పాడు. అలాగే, ‘అతడు మిక్కిలి ఆకలి గలవాడు. జాగ్త్రత సుమా!’ అని కూడా శివుడు హెచ్చరించాడు. తనకున్న ధనసంపదలతో వినాయకుడి ఆకలి తీర్చడం సమస్య కాదనుకున్నాడు కుబేరుడు. గణపయ్య విందుకు రానే వచ్చాడు. కుబేరుని సేవకులు రకరకాల పదార్థాలు తెస్తున్నారు. అవన్నీ క్షణంలో గణపయ్య బొజ్జలోకి చేరిపోతున్నాయి. చివరకు అతిథుల కోసం చేసిన వంటకాలూ గణపతికే అర్పణమైపోయాయి. అయినా ఆకలి తీరలేదు. ఆ భవనంలో ఉన్న వస్తువులనూ గణపతి మింగేయడం ప్రారంభించాడు. కుబేరుడు రెండు చేతులూ జోడించి ఇక ఆపాలని కోరాడు. ‘నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇవ్వకపోతే నిన్నూ తినేస్తాను’ అన్నాడట గణపతి. కుబేరుడు కైలాసానికి పరుగెత్తాడు. అప్పుడు శివుడు ఒక పిడికెడు కాల్చిన బియ్యాన్ని ఇచ్చి.. ఇది గణపతికి నివేదించు అని చెప్పాడు. కుబేరుడు ఆ బియ్యాన్ని వినయంతో, ప్రేమతో గణపతికి నివేదించాడు. గణేశుడు సంతృప్తి చెంది శాంతించాడు.
చిన్నపిల్లల ఆటలే అంత. వారి అల్లరుల వెనుక ఉండే మర్మాలెన్నో!. ముద్దు ముద్దు మాటలు.. మురిపాల చేష్టలు.. అంతులేని ఆటలు.. మాయ తెలీని అమాయకత్వం.. అబ్బురమనిపించే ఆలోచనలు.. పందడి చేసే అల్లరులు.. ఇవన్నీ పిల్లలు పంచే వినోదాలే కాదు.. మన దేవుళ్లూ అనుభవించిన మనకు మిగిల్చిన అనుభూతులు.
సెప్టెంబరు 6: కృష్ణాష్టమి,
సెస్టెంబరు 19: వినాయక చవితి
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review కృష్ణుడి అల్లరి.. గణపతి ఆకలి.