కాలాన్ని భగవత్ స్వరూపంగా భావిస్తే ప్రతి రోజూ, ప్రతి నిమిషమూ పండుగే. ఆనందమే.
ఇలాంటి భావనే లేకుండా ఆచరించే పండుగలు మన జీవితంలో ఎన్ని వచ్చినా దండుగలే.
పవిత్ర భావన లేకుండా చేసుకునే పండుగ నాడు పిండివంటలూ, పండుగ వంటలూ కడుపారా తింటే రజస్తమోగుణాలు కలగడమే తప్ప సాత్త్విక ప్రవృత్తి లభించదు.
పండుగల నాడు ఇలాంటి పవిత్ర భావన కలగాలనే ఉద్దేశంతోనే మన పూర్వులు ప్రతి పండుగకూ ఒక అధిష్టాన దేవతనూ, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పరిచారు.
పవిత్ర భావంతో చేసే ప్రతి పనీ ఇహపరానందదాయకమే అవుతుంది.
మన తెలుగు పంచాంగాల ప్రకారం తొట్ట తొలి పండుగ ఉగాది.
‘ఉగాది’ ప్రత్యేకించి ఇతర వ్రతాలూ, పండుగల వలే ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఆచరించే పర్వం కాదు.
అనంతమైన కాలాన్ని, మన సౌలభ్యం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి సంవత్సరాది నాడు కాలాన్ని మన ఇష్ట దైవస్వరూపంగానూ, సకల దేవతా స్వరూపంగానూ భావించి, సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకుని ఆయా సమయాల్లో దైవానుగ్రహప్రాప్తి కోసం చేయాల్సిన సాధనాలను సిద్ధం చేసుకునే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పర్చుకోవడం ఉగాది పండుగలోని విశిష్టత.
వరహామిహిరాచార్యుని నిర్ణయాన్ని బట్టి, మనం చాంద్రమానం రీత్యా చైత్ర మాసాన్ని సంవత్సరారంభంగా భావించి, చైత్ర శుక్ల ప్రతిపత్తు (పాడ్యమి) నాడు బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడన్న శాస్త్ర వాక్కును ప్రామాణికంగా తీసుకుని దానినే ఉగాదిగా గణించి, ఉగాది పండుగను ఆచరిస్తున్నాం.
మనం జీవిస్తున్న ఈ సృష్టి జరిగిన రోజును పండుగగా జరుపుకుంటున్నట్టు భావించి, ఈ ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలి పండుగగా జరుపుకుంటున్నాం. అలాగే దీన్ని నిర్వహించుకోవాలి కూడా.
బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమి, సూర్యోదయ వేళ ఈ సృష్టిని సమగ్రంగా చేసినాడు. అందుకు కృతజ్ఞతాసూచకంగా, జ్ఞాపక చిహ్నంగా ఉగాది పండుగను జరుపుకొంటున్నాము.
ఉగాది పండుగలో ముఖ్యమైనది- పంచాంగ శ్రవణం.
జీవన ప్రయాణంలో మున్ముందుగా వచ్చే సుఖదు:ఖాలనే ద్వంద్వాల మజిలీలను గురించి ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మన మార్గాన్ని సుఖతరమూ, సులభతరమూ చేసుకుని పురోగమించడానికి ఉద్దేశించినదే పంచాంగ శ్రవణం.
కాలజ్ఞానాన్నీ, ప్రభావాన్నీ గ్రహించి మనుషులు ధర్మకార్య నిమగ్నులై వ్యవహరించాలని పంచాంగం మనకు బోధిస్తుంది.
కాలంతో పాటు కలిసి ముందుకు సాగిపోవడమే జీవితం.
గడిచిన ఏ క్షణమూ తిరిగిరాదు. కాబట్టి కాలాన్ని ఆచితూచి ధర్మబద్ధంగా వినియోగించుకోవాలి.
కొత్త సంవత్సర వేళ.. కొత్త ఆశలు, కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో కొంగొత్త జీవితాన్ని గడుపుదాం.
అందరికీ తెలుగు సంవత్సరాది,
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review కొత్త జీవితం...