
తల్లి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తుంది.
తండ్రి మనుగడకు దారి చూపిస్తాడు.
గురువు తన దిశానిర్దేశంతో సరైన దారిలో ఉంచుతాడు.
పిండిని సరిగా కలిపి మర్దిస్తేనే రొట్టె ముక్క తినడానికి వీలుగా ఉంటుంది.
దైవం స్వీకరించగల రీతిలో మనల్ని సంసిద్ధం చేయడానికి గురువు అవసరం.
వేదకాలం నాటి నుంచి కొనసాగుతున్న గురు పరంపర ఒకానొక ఆధ్యాత్మిక రహస్య ఉద్యమం.
ఇలా పరంపరగా మనల్ని అనుగ్రహిస్తున్న గురువులను పూజించేందుకు ప్రత్యేకంగా ఒకరోజును మన పెద్దలు నిర్దేశించారు.
ఆషాఢ మాసానికి ఉత్తమ గ్రహం గురువు.
కనుక ఈ మాసాన్ని గురుపూజకు అనుకూలంగా ఎంచుకున్నారు.
ఆధ్యాత్మిక గురువులు, పీఠాధిపతులు ఈ మాసంలో చాతుర్మాస్య దీక్ష చేపట్టి.. సంచారం వీడి శిష్యులు అందరికీ అందుబాటులో ఉంటారు.
అజ్ఞాన పొరలను తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించే వాడు గురువు.
‘గు’ అంటే చీకటి.
‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం.
అజ్ఞానమనే చీకటిని పోగొట్టే వాడు గురువు.
అలాంటి గురువును దైవం కన్నా ఎక్కువగా ఆరాధించే సంస్కంతి మనది.
అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్ట దేవతా ప్రార్థన చేస్తాడు.
ఆ తరువాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.
ఆధునిక కాలంలోనూ ఎందరో గురువులు తమ అపారమైన శక్తి, మేధస్సుతో శిష్యులను తయారుచేసి, వారి ద్వారా మన దేశాన్ని సుసంపన్నం చేశారు.. చేస్తూనే ఉన్నారు. ప్రగతిపథంలో నడిపిస్తున్నారు.
మనం గదిలో బందీలుగా ఉన్నామని అనుకోండి.
ఆ గదికి ఉన్న ఏదైనా ద్వారం మనం బయటపడటానికి ఉపయోగపడుతుంది.
ఆ సమయంలో అక్కడ ద్వారం ఉండటం గొప్ప అవకాశం.
గురువు లభించడమూ అంతే!
గురువనే ద్వారం మనకు అవతల ఉన్న దానిని చూపిస్తుంది.
అంటే మనకు అందని, తెలియని అవకాశాలను కల్పించే శక్తి గురువు.
అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువునే దైవంగా భావిస్తూ చేసుకునే పండుగ గురుపూర్ణిమ.
అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు
(జూలై 21, 2024:
గురు పూర్ణిమ)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review జ్ఞానదీపం.