ఉగాది.. యుగానికి ఆది..
కొత్త ఆశలకు పునాది..
ఉగాది అంటే వికాసానికి గుర్తు.
ఈ నేలపై వసంతం వికసించిన తొలి రోజుకు ఉగాది నాంది.
వసంతమాసంలో ప్రకృతి కొత్త చిగుర్లు వేస్తుంది.
కాలం మానవ జీవితాలకు కొత్త ఆశల రెక్కలు తొడుగుతాయి.
రానున్న కాలంలో అందే సత్ఫలితాలకు ఉగాది ఒక సంకేతం.
మనిషి ఆశలు కూడా చిగురుల వంటివే. అవి ఫలించాలి. ఫలితాలనివ్వాలి. అదే ఉగాది పండుగకు చాటే శుభ సంకేతం.
మనకు వచ్చే పండుగలన్నీ ఏదో ఒక దేవుడు లేదా దేవత ప్రాధాన్యంగా ఉంటాయి. అంటే, ఆయా పండుగలు, పర్వదినాల వేళ ఆయా దేవుళ్లను కొలుస్తాం.
కానీ, ఉగాది అందుకు పూర్తి భిన్నం. ఉగాది నాడు ప్రత్యేకించి ఏ దేవత, దేవుడి పేరూ వినిపించదు.
ఉగాది కాలానికి సంకేతం. అందుకే ఈనాడు కాలాన్ని దైవంగా భావించి కొలుస్తారు.
ఎందుకంటే, కాలం.. ఈ భూమ్మీద మనకు గల ఆయుఃప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ నేల మీదే మన ఆశలు, ఆశయాలను ఈడేర్చేది కాలమే.
అందుకే మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే ఆనంద వేళ ఉగాది.
కాలాన్ని గుణిస్తూ, మార్పులకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఉగాది అందిస్తుంది.
సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి ఉగాది ఆలంబనగా నిలుస్తుంది.
ఎల్లప్పుడూ మంగళధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత.
ఉగాది పునరుజ్జీవనానికి సంకేతం.
అప్పటి వరకు మోడుబారిన చెట్లు, తీగెలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడతాయి.
ఈ విధంగా ఉగాది మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది.
కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఉగాది పర్వం మనకు అందిస్తుంది.
నిత్య జీవితంలో కష్టం, సుఖం, ఆనందం, విషాదం వంటివన్నీ తప్పించుకోలేని విధి విధాయకృత్యాలు.
బాధలు, దుఃఖాలను అధిగమించుకుంటూ సుఖాలను, సంతోషాలను ఎలా పొందాలనేది కాలంతో పాటు పయనించే వారికే తెలియవస్తుంది. అదే ఉగాది నేర్పే పాఠం.
రాగల వసంతాన్ని కాలం ఆపలేనట్టు.. జీవితంలో మనం పొందే సుఖాలు, సంతోషాలను మనకు ఎదురయ్యే కష్టాలు, నష్టాలు ఆపలేవు.
ఈ ఉగాది పర్వదినం వేళ అందరి జీవితాల్లో వసంతం వెల్లివిరియాలనీ, శుభ సంతోషాలు కలగాలని మనసారా ఆకాంక్షిస్తూ..
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review తొలి అడుగు కొత్త జీవితానికి ఆశల చిగురు.