నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ..

మన తెలుగు వారంతా
గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు- శ్రీకృష్ణదేవరాయలు.
ఈయన విజయనగర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడమే కాదు.. మన మాతృభాష తెలుగును దశదిశలా వ్యాపింప చేశారు. భాషా ఉన్నతికి పాటుపడ్డారు.
రాయల వారు 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు.
ఆయనకు సాహితీ అభిలాష మెండు. ‘సాహితీ సమరాంగణ చక్రవర్తి’ అనేది ఆయనకు గల అనేక బిరుదుల్లో ఒకటి. అందుకు తగినట్టే ఆయన ‘భువన విజయం’ అనే సభను నిత్యం నిర్వహిస్తుండే వారు. ఇందులో అష్టదిగ్గజాలు అని పిలిచే ఎనిమిది మంది కవి శ్రేష్ఠులు ఉండేవారు. ఈ అష్ట దిగ్గజాలలో ప్రముఖుడు తెనాలి రామకృష్ణుడు. ఈయననే రామలింగడు అనే పేరుతోనూ వ్యవహరించే వారు.
అలాగే, తన సమయస్ఫూర్తి, చాకచక్యం, ఎగతాళి, వికటత్వం అనే లక్షణాలనూ కనబరిచే కారణంగా ఈయనను వికటకవి అని కూడా అంటుండే వారు. రామకృష్ణుడంటే రాయల వారికి ఎనలేని అభిమానం. అటు సాహితీపరంగానే కాదు.. ఇటు పరిపాలనాపరమైన అంశాల్లోనూ ఎన్నో చిక్కుముడులను తనదైన శైలిలో, తన చతురతతో ఈయన పరిష్కారాలను సూచించే వారు. రామకృష్ణుడు కనబరిచే యుక్తాయుక్త విచక్షణ, చాతుర్యం, తెలివితేటలు నాటి విజయనగర సామ్రాజ్యవాసులను విపరీతంగా అలరించేవి. ఆయన కథలు నేటి భావి తరానికి కూడా అవసరం. తెనాలి రామకృష్ణుడి కథలను చదవడం, తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
– రామలింగడి కథల వల్ల విద్యార్థులకు అపారమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి అలవడుతాయి.
– జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకోవచ్చు.
– ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ముఖం మీద చిరునవ్వును చెరిగిపోనివ్వకూడదు.
తెనాలి రామకృష్ణుడు తన కథల ద్వారా పై మూడు విషయాలను తెలియచెప్పారు.
అవి నేటి తరానికీ అవసరం.
ఈ క్రమంలోనే తెలుగు పత్రిక జనవరి 2023 సంచికను ‘తెనాలి రామకృష్ణ కథల’ ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దాం.
ఇందులో అందచేసిన కథలన్నీ వివిధ మాధ్యమాల ద్వారా సేకరించినవి.
ఇవి పిల్లల్లో చదవాలనే ఆసక్తిని పెంచుతాయి. పెద్దలనూ ఆలోచింపచేస్తాయి.
నవ్విస్తూనే, సమస్య పరిష్కార మార్గాలను సూచిస్తాయి.
సమస్యలు ఎదురైన సందర్భాల్లో ఎలాంటి సమయస్ఫూర్తిని ప్రదర్శించాలో కళ్లకు కడతాయి.
ఇంకెందుకు ఆలస్యం? కథల్లోకి పదండి..
– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review నవ్విస్తూ.. ఆలోచింపచేస్తూ...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top