ప్రపంచానికి నిన్ను పరిచయం చేసేది అమ్మ..
నీకు ప్రపంచాన్ని పరిచయం చేసే వాడు నాన్న..
నిజమే!
అమ్మ జీవితాన్నిస్తుంది.
నాన్న జీవన విధానాన్ని నేర్పుతాడు.
బిడ్డకు నడక, నడవడిక, నాగరికత, సమాజంలో మనగలిగే ఒడుపు, లౌకిక వ్యవహారాలు, మనుగడకు మెలకువలు వంటివెన్నో నేర్పించే ఆది గురువు తండ్రి.
తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడంటే.. దానర్థం దారి చూపుతున్నట్టు కాదు.. భవిష్యత్తులోకి దారితీయడం.
నాన్న అమ్మ మాదిరిగా బోళామనిషి కాడు.
కలిగే కష్టాలు, తగిలే గాయాలు బహిర్గతం చేయని ధీరగంభీరుడు.
కాఠిన్యాలూ, కన్నెర్ర చేయడాలూ ప్రేమ లేక కాదు.. దాన్ని వ్యక్తం చేయలేకా కాదు..
ఎదుగుదల ఆగక, విజయపథంలోకి దూసుకుపోవాలన్న ఆరాటమే ఆయనను మౌనంగా ఉంచేస్తుంది.
బిడ్డ గెలిచినపుడు మనసులోనే అభినందిస్తాడు.
ఆ బిడ్డే ఓడిపోతే భుజం తట్టి ధైర్యం చెబుతాడు. అదీ తండ్రి శైలి.
అదే ఆయన ఔన్నత్యం.
ఒక్కమాటలో చెప్పాలంటే నాన్న ప్రేమిస్తాడు. వ్యక్తం చేయడు.
ఆదరిస్తాడు. ఆర్భాటం చేయడు.
తప్పటడుగుల వయసులో చేయూతనందించి, తెలిసీ తెలియక చేసిన తప్పులను సరిదిద్ది, త్యాగాలకు గాంభీర్యపు పూత పూసేది నాన్నే.
అందుకే అనాదిగా తండ్రి పూజ్యనీయ స్థానంలోనే ఉన్నాడు.
నిరంతరం బిడ్డల ఉన్నతిని కాంక్షించే తండ్రి పట్ల భయభక్తులే కాదు.. మమతానురాగాలనూ పంచాలి.
అదే ఆయనకు మనం ఇచ్చే సిసలైన గౌరవం.
నాన్నకు వందనం!
(జూన్ 16, 2024
ఫాదర్స్ డే/పితృ దినోత్సవం)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review నాన్నా.. నీకు వందనం!.