ఒక ఎలుక ఉదయాన్నే జీవయాత్ర కోసం బయలుదేరింది. కన్నం దాటి నాలుగడుగులు వేసిందో లేదో యమధర్మరాజులా పిల్లి ఎదురుపడింది. ఎలుక కంగుతింది. అంతలోనే స్థిమితపడింది. ఆ పిల్లి వేటగాడి వలలో చిక్కుకుని ఉంది.
హమ్మయ్యా అనుకుని ఎలుక ఇంకొంచెం ముందుకు వెళ్లే సరికి చెట్టు మీద గుడ్లగూబ, పొదలో నుంచి ముంగిస గుర్రుగా చూస్తూ కనిపించాయి. ఇదెక్కడి సంకటంరా దేవుడా! అని ఎలుక అనుకుందే కానీ, ధైర్యం కోల్పోలేదు. ఒక్క క్షణం చురుగ్గా ఆలోచించింది.
పిల్లిని చూస్తే ముంగిస, గుడ్లగూబ భయపడతాయి. కాబట్టి పిల్లి రక్షణలో ఉన్నట్టు నటిస్తే అవి తన జోలికి రావు.
ఈ సంగతి గ్రహించిన మరుక్షణం ఎలుక, పిల్లిని రక్షణ కోరింది. వలతాళ్లు కొరికి నిన్ను రక్షిస్తానని ఎలుక ప్రమాణం చేసింది. ప్రాణం మీద ఆశతో పిల్లి అందుకు అంగీకరించింది. పిల్లి రక్షణలో ఉన్న ఎలుకను తామేమీ చేయలేమని నిర్ణయించుకుని గుడ్లగూబ, ముంగిస అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
ఎలుక హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇక, పిల్లిని విడిపించడం ఒక్కటే మిగిలి ఉంది. అలాగే, విడిపించాక దానివల్ల తనకు ప్రాణాపాయం లేకుండా చూసుకోవాలి. అందుకే పిల్లి ఎంత కంగారు పడుతున్నా, వేటగాడు దగ్గరకు వచ్చే వరకు ఎలుక వలతాళ్లు కొరకలేదు. వేటగాడు సమీపించాక, హడావుడిగా కొరికేసింది. బతుకు జీవుడా అంటూ వేటగాడి బారి నుంచి తప్పించుకొని పిల్లి పారిపోయింది. బతికానురా దేవుడా అంటూ ఎలుక కన్నంలోకి దూరింది.
ఇక్కడితో ఈ కథ అయిపోలేదు. ఎలుక తనకు చేసిన మేలు మరిచిపోలేని పిల్లి జీవితాంతం స్నేహంగా ఉందాం రమ్మని కన్నం దగ్గరకు వచ్చి ఎలుకను ఆహ్వానించింది.
‘జీవితాంతం స్నేహం అవసరం లేదు. స్నేహం వల్ల జీవితం అంతం కాకుండా ఉంటే చాలు’ అని ఎలుక మనసులోనే అనుకుంది.
జీవితంలో మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకోవడం చాలా కష్టం.
కొందరు పైకి చురచురలాడే ముఖాలతో కనిపిస్తారు. కానీ, అవసరానికి ఆదుకుంటారు.
కొందరు రాసుకుపూసుకు తిరుగుతారు. అవసరానికి ముఖం చాటేస్తారు.
ఇవన్నీ అందరి జీవన యానంలో ఎదురుపడే పరిస్థితులే.
పై కథలో ఎలుక లౌక్యంగా తన శత్రువుల నుంచి తప్పించుకుంది. అదే సమయంలో పిల్లిని నమ్మి స్నేహం చేయడం ఎప్పటికీ అవివేకమే అని భావించింది.
ఎలుక వివేకం సరైనదే.
ఈ ప్రపంచం మనం ఎలా చూస్తే అలా కనబడుతుంది. సృష్టిలో భేదం లేదు. మన దృష్టిలోనే ఉంది.
ఎంత వ్యతిరేకి అనుకున్నా అతనిలో మనకు కావాల్సిన లక్షణాలు కొన్నయినా ఉంటాయి. అలా అని, ఆ లక్షణాల ఆధారంగా స్నేహం చేయలేం. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి పనులు కానిచ్చుకోవడమే లౌక్యం, వివేకం. ఈ భావంతో జీవిస్తే ప్రపంచంలో ప్రతికూలత అనేదే ఉండదు.
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review నీ స్నేహం...