ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంలో ఇంటికి చేరతాడు
తల్లి- ‘ఎందుకురా? అలా ఉన్నావు?’ అని అడుగుతుంది. ‘మా స్కూల్లో నాటకం వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మటుకు భటుడి వేషం ఇచ్చారు. నాకు ఏడుపొస్తోంది అమ్మా’ అన్నాడు పిల్లాడు బేలగా.
‘పిచ్చికన్నా ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే ముఖ్యం. నాటకం అన్నాక అన్ని పాత్రలు ఉంటాయి.
ఒక్కొక్కరికీ ఒక్కో పాత్ర ఉంటుంది. నీ వేషం మరీ చిన్నదని దిగులు పడకు. అందరికన్నా బాగా నటించాలని ప్రయత్నించు. అప్పుడు నీ పాత్రే పెద్దదవుతుంది’ అని ఆ తల్లి బిడ్డను ఊరడిస్తుంది. రిహార్సల్స్ పూర్తవుతాయి. స్కూల్లో నాటకం వేస్తారు. మంచి నటనకు మొదటి బహుమతి సాధించిన పాత్రధారి ఎవరనుకుంటున్నారు? మన భటుడే. తల్లి మాటల్లోని సత్యాన్ని గుర్తించిన ఆ బాలుడు తన పాత్రలో లీనమై నటించాడు. బహుమతి గెలుచుకున్నాడు. ప్రయత్నాలతోనే మన అర్హతలు మనకు అవకాశాలుగా మారతాయి. అవే మన ఎదుగుదలకు సోపానాలు అవుతాయి.
ఒక పేదవాడు తనుండే గ్రామ సమీపంలోని అడవికి వెళ్లి రోజూ కట్టెలు కొట్టి తెచ్చుకుని అమ్ముకోవడం ద్వారా పొట్టపోసుకునే వాడు. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవి పరిధిలోనే అతను కట్టేల కోసం నిరంతరం అన్వేషించే వాడు. కాబట్టి అతని శ్రమకు తగిన ఫలం లభించేది కాదు. అడవిలోకి కాస్త ముందుకు వెళ్లే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. దీంతో కట్టెలు లభించినంత మేరకే అతను సంపాదించగలిగే వాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న రుషి- ‘ఎంతసేపూ ఇక్కడే ఏం వెతుకులాడతావు? లోపలికి వెళ్లు. కావాల్సినంత దొరుకుతుంది’ అని సలహా ఇచ్చారు.
ఆ పేదవాడు అలాగే చేశాడు. తను జీవితంలో ఊహించలేనంత వృక్ష సంపదను అక్కడ చూశాడు. మరిన్ని ఎక్కువ కట్టెలు కొట్టడం ద్వారా పెద్ద మొత్తంలో సంపాదించాడు.కొన్నాళ్లకు మళ్లీ గతంలో కనిపించిన రుషి మళ్లీ అటుగా వచ్చారు.
‘ఇంకా లోపలికి వెళ్లు.. బంగారు గనే లభించవచ్చు’ అని రుషి చెప్పారు.పేదవాడు నిజంగానే అడవి మధ్యలో బంగారు నిక్షేపాన్ని కనుగొనగలిగాడు. చాలా పనుల్ని మనం పేదవాడి మాదిరిగానే చాలా మామూలుగానే చేస్తుంటాం. కొత్తగా ఆలోచించడానికి, కొత్త విధానాలను అమలు చేయడానికి, కొత్తగా ప్రయత్నించడానికి అసలు ఉపక్రమించం.
నిజానికి పై కథలో మాదిరిగా పేదవాడికి రుషి కనిపించినట్టుగా మనకెవరూ కనిపించి సలహాలు ఇవ్వరు. మన మనసే మనకు మార్గదర్శి కావాలి.
పక్షులు కేవలం గుడ్డును పొదుగుతున్నప్పుడు మాత్రమే ఒకచోట కుదురుగా ఉంటాయి. మిగతా సమయమంతా ఆహారాన్వేషణలోనే గడుపుతాయి. మనమూ అదే ఆదర్శంగా పని, ప్రయత్నం నిరంతరం చేస్తుండాలి. ఫలితం దానంతట అదే ఎదురొస్తుంది
Review పని.. ప్రయత్నం.. ఫలిత.