ఇళ్లు దీపకాంతులతో వెలుగొందుతూ పండుగ వాతావరణం సంతరించుకునేదీ, హరివిల్లు సాక్షాత్కరించేలా లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో కళకళలాడేదీ ధనుర్మాసంలోనే.
ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తూ రంగనాథుడే దిగి వచ్చాడని చెబుతారు.
విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ ప్రస్తుతించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినిపిస్తాయి.
తులసికి బదులు బిల్వ పత్రాలతో శ్రీవేంకటేశ్వరుడిని అర్చిస్తారు.
ధనుర్మాసంలో చేసే పూజలు కోరికలను నెరవేరుస్తాయని విశ్వసిస్తారు.
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు మధుసూదనుడిగా పూజలందుకుంటాడు.
గోధుమపిండి, బియ్యప్పిండి, మట్టితో విష్ణు ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు.
వైష్ణవాలయాల్లో అర్చనలు చేసి చక్కెర పొంగలితో తయారుచేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు.
అనంతరం దాన్ని పిల్లలకు పంచుతారు. దీనినే ‘బాలభోగం’ అని వ్యవహరిస్తారు.
ఈ మాసమంతా ఆలయాలు గీతా ప్రవచనాలు, విష్ణు సహస్రనామ పారాయణాలూ, తిరుప్పావై సంకీర్తనలతో మార్మోగుతాయి.
కార్తీక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసం మదిరిగానే ధనుర్మాసమూ విశేషమైనది.
ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజిస్తారు.
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.
అప్పటి నుంచి భోగి, సంక్రాంతి పండుగ వరకూ నెల రోజుల కాలాన్ని తెలుగువారు నెలగంటగా పరిగణిస్తూ పూజలు చేపడతారు.
‘ధను’ అంటే ప్రార్థించేది సిద్ధిస్తుందనే అర్థాన్ని పురాణాలు చెబుతున్నాయి.
ఆండాళ్ రచించిన దివ్యప్రబంధమే ‘తిరుప్పావై’. ద్రవిడ భాషలో ‘తిరు’ అంటే పవిత్రమనీ, ‘పావై’ అంటే వ్రతమనీ అర్థం.
అందుకోసమే ధనుర్మాసం దివ్య ప్రార్థనలకు వేదికని, ఈ నెలలో ఆచరించే వ్రతాలతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ అంటారు.
ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై సంకీర్తనలు ఆలపించిన వారికి ముక్తి మార్గం లభిస్తుందని గోదాదేవి చరిత్ర చాటుతోంది.
గోపికలు రేపల్లెలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందినట్టే, గోదాదేవి తన పాశురాలతో శ్రీరంగనాథుడిని కొలిచి ఆయననే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.
అంతటి పావనమైన పాశురాలను ఆలపిస్తూ ఈ ధనుర్మాసంలో మోక్షాన్ని, పుణ్యాన్ని పొందుదాం!.
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు






























































Review పుణ్యం.. ధన్యం.