ఒక చిన్న కుర్రాడు ఒకరోజు దిగులు ముఖంతో ఇంటికి వచ్చాడు. తల్లి..
‘ఎందుకురా అలా ఉన్నావు?’ అని ప్రశ్నించింది.
‘మా స్కూల్లో డ్రామా వేస్తున్నారు. నా మిత్రులందరికీ రాజు, మంత్రి, సేనాధిపతి వంటి మంచి వేషాలు ఇచ్చారు. నాకు మాత్రం భటుడి వేషం ఇచ్చారు’ అని కంటతడి పెడుతూ చెప్పాడు ఆ పసివాడు.
‘పిచ్చి కన్నా.. ఆ నాటకంలో రాజు పాత్ర ఎంత ముఖ్యమో భటుడి పాత్ర కూడా అంతే కీలకమైనది. నాటకం అన్నాక రకరకాల పాత్రలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో పాత్ర మాత్రమే లభిస్తుంది. నీ వేషం మరీ చిన్నదని దిగులు పడకు. అందరికన్నా బాగా నటించాలని ప్రయత్నించు. అప్పుడు నీ పాత్రే పెద్దదవుతుంది’ అని ఆ తల్లి కుమారుడికి సర్ది చెప్పింది.
రిహార్సల్స్ పూర్తయ్యాయి. స్కూల్లో నాటకాన్ని ప్రదర్శించారు. ఇందులోని నటనకు గాను మొదటి బహుమతి ఎవరికి లభించిందనుకుంటున్నారు. మన ‘భటుడి’ పాత్రధారికే. తల్లి చెప్పిన మాటలతో ఆ చిన్నారి తన పాత్రలో లీనమై నటించాడు. అందరికన్నా మంచి నటనా ప్రతిభను కనబరిచాడు. చివరకు బహుమతి గెలుచుకున్నాడు.
ప్రయత్నం మనల్ని ఎంత ఎత్తుకైనా తీసుకువెళ్తుందనేందుకు పై కథ ఒక ఉదాహరణ.
తనది చిన్నపాత్రే కదా అని ఆ చిన్నోడు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే.. అతనికి గుర్తింపు లభించేదా?
పక్షులను చూడండి. అవి గుడ్డును పొదుగుతున్నప్పుడు మాత్రమే ఒకచోట కుదురుగా కూర్చుని ఉంటాయి. ఇది తప్ప మిగతా సమయమంతా అవి ఆహారాన్వేషణలోనే గడుపుతుంటాయి. తమ జీవిత కాలంలో లక్షల మైళ్ల దూరాన్ని ప్రయాణిస్తాయి. ఈ పయనమంతా గూడు కోసం, ఆహారం కోసమే కొనసాగుతుంది. కానీ, పక్షుల కంటే ఎన్నో రెట్లు వికాసవంతుడైన మనిషి మాత్రం తన జీవిత కాలంలో ఎక్కువ భాగాన్ని వృథాగానే పొద్దుపుచ్చుతాడు. చాలామంది జీవితంలో ఏం సాధించామా? అని వెనక్కి తిరిగి చూసుకుంటే శూన్యమే కనబడుతుంది. ఏ పనీ చేయకుండా రాయిలా పడి ఉండే గుణం మనిషికి అచ్చిరాదు. ఈ గుణాన్ని వదులుకోనిదే మనిషి గొప్పవాడు కాలేడు.
మనిషి జీవిత పర్యంతం ఏదో ఒక పని, ప్రయత్నం చేయాల్సిందే. గొప్ప వ్యక్తుల నిజ జీవిత విజయగాథలను, జీవితాలను చదవాలి. చుట్టూ ఉన్న వారిని గమనించి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. విజయం సాధించడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ ఒక ప్రయాణమే కానీ.. గమ్యం కాదు. ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే మనం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి.
Review బతకొద్దు.. జీవిద్దాం!.