పఠనం.. పాఠవం..
ఇటీవల పుస్తక పఠనం పూర్తిగా తగ్గిపోయింది. అంతర్జాలం మాయాజాలంలో పడి జనం ‘చదువు’ అనేదే మరిచిపోయారు. జర్మన్ కవి గోథె- ‘ప్రతి రోజూ ఉదయాన్నే ఒక మంచి పుస్తకంలోని వాఖ్యాలు చదవాలి. ఒక మంచి పాట వినాలి. ఒక అందమైన చిత్తరువును చూసి ఆనందించాలి. వీలైతే కొన్ని మంచి మాటలు మాట్లాడటం నేర్చుకోవాలి’ అంటారు. కానీ, నేడు మనం అలా చేయగలుగుతున్నామా? మంచి పుస్తకం మంచి మిత్రుడు వంటిది. ఎన్నో మంచి కబుర్లు చెప్పి మంచి మార్గంలోకి మళ్లిస్తుంది. మనం చదివేది ఏ పుస్తకం? ఎటువంటి విజ్ఞానాన్ని అందిస్తుందనేది కూడా ముఖ్యం. కాలక్షేపం కోసం చదివే పుస్తకాలు పరిమిత లక్ష్యంతో కూడినవి. అవి మనకు పరిమిత జీవితాన్ని మాత్రమే అందిస్తాయి. నిష్కల్మత్వానికి, నిర్మలత్వానికి, జీవన సందేశానికి సంకేతాలైన మంచి ముత్యాల వంటి పుస్తకాలు చదివితే జీవితానికి కొత్త వెలుగు వస్తుంది. మనోవికాసం, జీవనవికాసం, ఆత్మవికాసం- ఇది మంచి పుస్తకాలు అందించే ప్రస్థాన త్రయం. ఈ ప్రపంచమనే పుస్తక భాండాగారంలో అటువంటి పుస్తకాలు ఎక్కడెక్కడో దాక్కుని ఉంటాయి. వాటిని వెదకడంలోనే మన వివేకం, వివేచన నిబిడీకృతమై ఉంటాయి. మంచి పుస్తకాలు దేవతల సంతకాలు. శాశ్వతత్వం గీసుకొన్న రేఖాచిత్రాలు. మనం కోరేది- కరిగిపోయే స్వప్నం లాంటి పుస్తకం కాదు. భూమిపై మనతో పాటే, మానవత్వమే పునాదులుగా పెరిగే స్వర్గంలాంటి పుస్తకాల్ని. విజ్ఞానం, వినోదాలు- అవే పుస్తకాలు కాదు. కనిపించని నక్షత్రాల్లా ఆత్మోపలబ్ధికి దారితీసే పుస్తకాలు ఉన్నాయి. అవే చదవాలి. అదే సద్గ్రంథ పఠనం. అణువులతో అసంఖ్యాక ప్రపంచాలు సృష్టిస్తున్నాడు భగవంతుడు. అక్షరాలతో అంతులేని సాహితీవనాలు సృజిస్తున్నాడు మనిషి. ‘లోకాలు నశించినా విద్య నశించదు’ అన్నాడు భర్త•హరి. వేద మంత్రాలు.. యుగాలు దాటి, ప్రళయాలు దాటి ఇప్పటికీ వినిపిస్తున్నాయి. అక్షరాలు నశించవు. మంత్రధ్వనాలై భవిష్యత్తు మానవాళికి అనంత తేజోవంతం అందించే దీపశి•లై భాసిస్తాయి. అసలైన సాహిత్యం అక్షరం (క్షరం కానిది). ఆ ‘అక్షరం’ వైపే మానవ మహా యాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తూ..
Review మన తెలుగు.. మన వెలుగు.