త్రేతా, ద్వాపర యుగాల్లో మనుషులు యజ్ఞయాగాదులు, తపస్సుల ద్వారా మోక్షం పొందారు. కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, దైవ నామ పారాయణ, స్మరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఎవరికున్నంతలో వారు చేయగలిగిన దానిని దానం చేయవచ్చు.
వాటిలో విశిష్టమైనది అన్నదానం.
ఇది మనిషిని పూర్తిగా సంతృప్తిపరిచే దానం.
ఆకలితో ఉన్న వారికి ఒక్కోసారి మనం అన్నం పెట్టలేకపోవచ్చు. కానీ.. అటువంటప్పుడు అన్నం పెట్టే ఇంటి వైపైనా చూపించాలనేది పెద్దల మాట.
కర్ణుడు అదే చేశాడు.
అడిగిన వారికీ, అడగని వారికీ.. ఎందరికో ఎన్నో దానాలు చేసిన కర్ణుడు ఒక్కరికి కూడా అన్నదానం చేయలేకపోయాడు. మరి ఆ దోషం నుంచి ఎలా బయటపడ్డాడు?
కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాక కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అతడు బతికుండగా చేసిన వివిధ దానాల ఫలితంగా ఎన్నో స్వాగత సత్కారాలు పొందాడు. ఏది కావాలంటే ఆ సౌఖ్యాన్ని పొందేవాడు. ఇన్ని ఉన్నా.. కర్ణుడిని నిత్యం ఏదో అసంతృప్తి, వెలితి వేధించేవి. ఎంత తిన్నా కడుపు నిండినట్టనిపించేది కాదు. తృప్తి కలిగేది కాదు. ఒకసారి ఇదేమాట ఇంద్రుడికి చెప్పాడు.
‘నువ్వు అనేక దానాలు చేశావనీ, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడవని అంటారు. అన్ని దానాలు చేశావు కదా.. ఎవరికైనా, ఎప్పుడైనా అన్నదానం చేశావా?’ అని అడిగాడు.
‘లేద’ని చెప్పాడు కర్ణుడు.
‘పోనీ ఎవరికైనా అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’ అని అడిగాడు దేవేంద్రుడు.
కాస్త ఆలోచించి, ‘అవును ఒకసారి ఓ బీదవాడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేనేదో ధ్యాసలో ఉండి, నేను పెట్టలేను గానీ, అదిగో.. కనిపించే ఆ ఇంటికి వెళ్లు. అక్కడ అన్నం పెడతారు అని చెప్పాను’ అని బదులిచ్చాడు కర్ణుడు.
‘అయితే, ఆ ఇంటిని ఏ వేలితో చూపించావో ఆ వేలిని నీ నోట్లో పెట్టుకో’ అన్నాడు ఇంద్రుడు.
కర్ణుడు అలాగే చేశాడు. ఆ క్షణంలో అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మాయమైపోయింది. ఎనలేని తృప్తి కలిగింది.
ఙ ఙ ఙ
దానం చేసే స్థానం, ప్రాంతం, దేశం, కాలం కూడా ముఖ్యమైనవే. దానం చేసే స్థానం చాలా ముఖ్యమైనది. అది స్వచ్ఛంగా ఉండాలి. పవిత్రమైనదై ఉంటే ఇంకా మంచిది. అందుకే చాలామంది అన్నదాతలు తమ కార్యానికి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటారు. అటువంటి పవిత్ర స్థలాలలో చేసే దానం వల్ల ఆ స్థలం యొక్క పవిత్రత కారణంగా దాత – గ్రహీత.. ఇద్దరూ గొప్ప ఫలితాలను పొందవచ్చు.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా తన అన్నదాన మహత్కార్యానికి పవిత్ర పుణ్యక్షేత్రాలనే ఎంచుకుంది. అక్కడ వారందించే అన్నప్రసాదాలను స్వీకరించడమే కాదు.. ఇతోధిక సాయమూ చేయవచ్చు.
ఉరుకుల పరుగుల జీవితంలో సేవకు కాసింత తీరిక చేసుకోలేని వారు నేరుగా కరివెన నిత్యాన్నదాన సత్రానికి నగదు, వస్తురూపంలో సాయం చేయవచ్చు. దాతలు అన్నదాన ఫలాన్ని, ఫలితాన్నీ పొందవచ్చు.
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

































































Review మహోన్నత దానం!.