మాటలు-ఈటెలు
మహా విష్ణువు ధరించే పాదుకలను చూసి శంఖం, చక్రం, కిరీటం ఒకసారి అపహాస్యం చేశాయట.
‘మేం చూడు.. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామో! నీవో? పాదాల కింద పడి ఉన్నావు’ అని పాదుకలను అవి ఎగతాళి చేశాయి.
‘నేను స్వామి పాదాల కింద ఉన్నందుకు సంతోషిస్తున్నాను. మహర్షులు అందరూ మన స్వామి పాదాలకే కదా మొదట నమస్కరించేది. భక్తులు పూజించేదీ ఆ పాదాలనే కదా! మహా విష్ణువు పాదసేవా భాగ్యం లభించాలని ఎందరో తపస్సు చేస్తుంటారు. అటువంటి పాదాలను సదా స్ప•శించే భాగ్యం నాకు లభించింది కదా!’ అని పాదుకలు అత్యంత వినయంతో పలికాయట. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి వాటి సంభాషణను మౌనంగా విని ఊరుకున్నాడని కథ. ఆ తరువాత ఆయన ఈ కథను ఎలా నడిపించారో చదవండి. శ్రీమన్నారాయణుడు త్రేతా యుగంలో శ్రీరామావతారం ధరించాడు. శంఖం, చక్రం, శత్రుఘ్న, భరతులుగా అవతరించాయి. భరతుడు శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటికే పట్టాభిషేకం గావించి, వాటికి కిరీటాన్ని అలంకరించాడు. భరతుడు శత్రుఘ్నుడితో కలిసి ఆ పాదుకలనే పద్నాలుగేళ్లు సేవించాడు. పాదుకలు కిరీటాన్ని ధరించి ధన్యతను పొందాయి. రామావతారం పరిసమాప్తమైంది. శంఖ, చక్ర, కిరీటాలు, పాదుకల ప్రాధాన్యాన్ని గుర్తించాయి. సృష్టిలోని ఏ ప్రాణినీ, వస్తువునీ హీనంగా చూడకూడదని తెలుసుకున్నాయి.
‘చల్లగా మాట్లాడటం సజ్జన లక్షణం. ఆడంబరంగా పలకడం అల్పుడి లక్షణం’ అన్నాడు వేమన. వినయంగా ఉన్నంత మాత్రాన, అందవిహీనంగా కనిపించినంత మాత్రాన ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. కులాన్ని బట్టి, స్థలాన్ని బట్టి అవివేకులు మాత్రమే అధిక గౌరవం ఇస్తారు. వస్త్రాలూ, ఆభరణాలూ కొన్నిచోట్ల, కొంతమందిలో మాత్రమే గౌరవం పొందుతాయి. ఉత్తమ వ్యక్తిత్వం మాత్రం అన్నిచోట్లా మన్ననలు అందుకుంటుంది. ఒక ఆధునిక కవి- ‘హీనంగా చూడకు దేన్నీ’ అని ఉపదేశించాడు. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లు చిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిని చిన్న చూపు చూడటం తగదు. గౌరవం ఇస్తే, గౌరవమే తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితం అనుభవించక తప్పదు.
అందుకే మనం మాట్లాడే మాటలను ఆచితూచి ఉపయోగించాలి. మనం సరళమైన మాటలు మాట్లాడితే అవి మనసుకు స్వాంతన కలిగిస్తాయి. పరుషమైన పదాలు ఉపయోగిస్తే హృదయాన్ని గాయపరుస్తాయి.
వివిధ ఆయుధాల ద్వారా శరీరానికి అయిన గాయాలు త్వరలోనే మానిపోతాయి.
కానీ, ఈటెల్లా ఉపయోగించే మాటల వల్ల మనసుకు అయిన గాయం ప్రాణం పోయే వరకు మానదు.
కాబట్టి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే-
‘‘పాదాలు నేలను తాకుతుంటాయి. అంతమాత్రాన వాటి విలువ తక్కువేమీ కాదు’’
Review మాటలు-ఈటెలు.