రెండక్షరాల మంత్రం!

శ్రీరాముడు..
దైవంగానే కాదు.. ఆయన పేరు కూడా పూజనీయమే.. నిత్యస్మరణీయమే..
ఏదైనా లేఖ రాసేముందు ‘శ్రీరామ’ అని రాస్తాం.. ఏదైనా దుర్వార్త వింటే ‘రామ రామ’ అంటూ నొచ్చుకుంటాం..
ఆకలి వేసే ‘అన్నమో రామచంద్రా’ అంటాం.
ఏదైనా భయం ఆవహిస్తే ‘శ్రీరామ రక్ష’ చెప్పుకుని ధైర్యం తెచ్చుకుంటాం..
‘రామ’ అనే నామం తారకమంత్రం.
కలియుగంలో జనులు స్తోత్రాలు, సహస్ర నామాలు పఠించేంత తీరిక లేకుండా ఉన్నారు కదా.. వారంతా తేలికగానే మోక్షం పొందే మార్గం కానీ, మంత్రం కానీ ఏదైనా ఉందా? అని ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగిందట.
‘లేకేం.. ‘శ్రీరామ రామ రామ’ అనే ఒక్క నామాన్ని పారాయణం చేస్తే మొత్తం విష్ణు సహస్ర నామాలను పారాయణ చేసిన ఫలితం వస్తుంది’ అని ఉపదేశించాడట శివుడు.
‘రామ’ అనే పదాన్ని పలకడంతోనే సమస్త పాపాలన్నీ హరించుకుపోతాయని ‘శ్రీరామ కర్ణామృతం’ చెబుతోంది.
‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మన పెదవులు తెరుచుకుంటాయి.
దీనివల్ల మనలో ఉండే ప్రతికూల శక్తులు బయటకు పోతాయి.
‘మ’ అనే అక్షరాన్ని పలికేటపుడు పెదవులు మూసుకుంటాయి.
దీంతో తిరిగి అవి మనలో చేరకుండా నిరోధానికి గురవుతాయి.
అందుకే ‘రామ’ అనే మంత్రం అత్యంత శక్తివంతమైనది.
‘రా శబ్దోచ్ఛారణే జాతే వక్త్రాత్పాపం విగచ్ఛతి
మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి’
‘రా అనే శబ్దం ఉచ్ఛరించగానే ముఖం నుంచి మనలోని పాపాలు బహిర్గతం అవుతాయి.
మ’ అనే అక్షరం వినబడగానే అవన్నీ భస్మం అవుతాయి.
ఉమాసంహితలోనిదీ పై శ్లోకం.
‘రా’ అంటే పరబ్రహ్మ. ‘మ’ అంటే జీవుడు.
కాబట్టి ‘రామ’ అనే నామం పరమాత్మలో లీనమైన జీవాత్మను ప్రకటిస్తుంది.
శరీరమనే క్షేత్రంలో జీవాత్మ రూపంలో దాగి ఉన్న పరమాత్మను దర్శించమనే సందేశాన్నిస్తుంది ‘రామ’ అనే శబ్దం.
పసిబిడ్డలను ఉయ్యాలలో వేసి ‘రామ లాలీ మేఘశ్యామ లాలీ’ అంటూ జోకొట్టడం ఆత్మీయతకు ప్రతిరూపం.
తుదిశ్వాస విడిచిన తరువాత రుద్రభూమికి పార్థివదేహాన్ని తీసుకెళ్తూ ‘రామ్‍ నామ్‍ సచ్‍ హై’ అంటూ ఉచ్ఛరించే ఆచారం ఉత్తరాదిలో ఉంది.
ఇలా తొలి, తుది శ్వాసల్లో మనిషికి తోడుగా ఉండేది కేవలం రామనామం మాత్రమే..
మీకు లోపల, బయట వెలుగు కావాలన్న కోరిక ఉంటే జిహ్వ అనే ద్వారం దగ్గర రామ నామం అనే దీపాన్ని వెలిగించండి అంటారు తులసీదాసు.
భక్త రామదాసు ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా’ అంటూ, ‘పిబరే రామ రసం పిబరే రామ రసం’ అంటూ సదాశివ బ్రహ్మేంద్రుడు, ఇంకా ఎందరో వాగ్గేయకారులు రామనామంలోని ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని కీర్తించారు.
‘రామ నామం’ మన నాలుకపై నిత్యం నాట్యమాడాలని, మనకు తోడునీడలా నిలవాలని శ్రీరామచంద్రుడిని కోరుకుందాం!

తెలుగుపత్రిక పాఠకులకు, అభిమానులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

– డాక్టర్‍ కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review రెండక్షరాల మంత్రం!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top