లక్ష్మీ గణపతిం భజే!

లక్ష్మీ గణపతి..
తెలుగునాట ఈ దైవాల చిత్రపటం లేని ఇల్లు దాదాపు ఉండదంటే అతిశయోక్తి కాదు.
చేసే పనుల్లో విఘ్నాలు తొలగించే దైవం ఒకవైపు..
లక్ష్యసిద్ధిని సిద్ధింపచేసే ‘లక్ష్య’దేవి మరోవైపు..
ఇద్దరూ కలిసి మన ఇంట్లోనే ఉంటే.. ఇక మనం చేసే పనులన్నింటా జయమే..
అందుకే కాబోలు ‘లక్ష్మీ గణపతి’ అనే ద్వయం ఇంటింటా కొలువుదీరింది.
ఇదే విశేషమైతే.. ఈ ఆగస్టులో మరో పరమ విశేషం పలకరిస్తోంది.
శ్రావణ, భాద్రపద మాసాల కలయిగా ఉన్న ఆగస్టులో ఈ జంట దేవుళ్ల జంట పండుగలు ఒకే నెలలో వచ్చాయి.
ఆగస్టు 12, శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అదీగాక, శ్రావణ మాసం పొడవునా లక్ష్మీ ఆరాధనకు ‘నెల’వైన మాసం.

అలాగే, ఆగస్టు 31, బుధవారం వినాయక చవితి. ఈనాటి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి.
ఇలా జంట పర్వాలు ఒకే నెలలో రావడం విశేషమే.
ఇక, ‘లక్ష్మీ గణపతి’ చిత్ర విశేషంపై చాలా సందేహాలున్నాయి.
లక్ష్మీదేవి విష్ణుదేవుడి భార్య. మరి, గణపతితో ఉన్న లక్ష్మి ఎవరు?
మంత్ర శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి నిజానికి ఆ లక్ష్మి వేరు. ఈ లక్ష్మి వేరు.
లక్ష్మి అంటే ‘లక్షణ శక్తి’.
ప్రతి దేవతకీ దేవతా శక్తి ఈ లక్ష్మి.
ఐశ్వర్యమే లక్ష్మి. ఆ దైవం యొక్క శక్తే ఆ దైవానికి ఐశ్వర్యం.
కాబట్టి ఆ దైవశక్తిని ‘లక్ష్మి’అన్నారు.
విష్ణుపత్ని లక్ష్మికి, గణపతి శక్తి లక్ష్మికీ భేదం ఉందని అంటారు.
పరాశక్తి లక్ష్మియే గణపతితో కూడి ఉంటుందని గౌరిగా

శివాంకంలో ఉందని తంత్ర శాస్త్రం చెబుతోంది.
పరమాత్మను గణపతిగా ఉపాసించి, ఆయన శక్తిని లక్ష్మిగా ఉపాసించడమే ‘లక్ష్మీగణపతి’ భావన.
మొత్తానికి లక్ష్యాన్ని సిద్ధింప చేసే లక్షణ శక్తి లక్ష్మి అయినా, విష్ణుపత్ని లక్ష్మి అయినా ఒకరే.
ఆ విజయలక్ష్మిని, విఘ్నాలను తొలగించే విఘ్నరాజాధిపతిని ఒకేసారి ఉపాసించే సందర్భం కలిసి వచ్చింది.
ఇద్దరినీ రెండు కళ్లుగా చేసుకుని ఆరాధించి నేత్రపర్వం గావించుకునే మహా విశేష సందర్భమిది.

అందరికీ వరలక్ష్మీ వ్రతం,
వినాయక చవితి శుభాకాంక్షలు
– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review లక్ష్మీ గణపతిం భజే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top