
యుగ యుగాల యుగాది..
మదిలో మొలిచే కొత్త ఆశలకు పునాది..
మంచిని పెంచే ఆలోచనలకు శుభాది..
మానవ జీవన వసంత గీతిక ఉగాది..
ఉగాది అంటే ప్రకృతి పాడే వసంత గీతం.
శీతగాలులతో ఇక్కలాక్కునిపోయి.. జీవనసారం ఇగిరిపోయి..
పచ్చనాకులు ఎండుటాకులుగా మారి రాలిపోయి..
చెట్టు బోసిపోయినపుడు ఆ కొమ్మ సందుల్లోంచి లేలేత చివుళ్లు చిందులేస్తూ కనిపించాయా?
అదే వసంతాగమన సూచిక. అదే ప్రకృతి పరవశం.
ఉగాది సంరంభానికి అదే స్వాగత సన్నాహం.
ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా.. ప్రతిఘటించి ముందుకు సాగాలన్నదే ప్రకృతి మనకు నేర్పే అతిపెద్ద పాఠం.
ఎదురుగాలులెన్ని వీచినా.. మోడుగా మారిపోయినా.. మళ్లీ మళ్లీ మొలకెత్తి తలెత్తుకోవాలనేదే ఉగాది పర్వం మనకిచ్చే సందేశం.
మావిచిగురు.. గండుకోయిల పాట.. వేప పూత.. ప్రకృతి వసంతానికి స్వాగతం పలికే వేళ నేలంతా పచ్చదనంతో ఒక కొత్త కళను సంతరించుకుంటుంది.
ఆ వాతావరణం, ఆ సస్యశ్యామలత మనసును కొంగొత్త ఆశలతో , మంచి బుద్ధులతో నింపుతుంది.
అలా శుభ తరుణాలకు నాంది పలికే అచ్చ తెలుగు పండుగే ఉగాది.
దీనినే తెలుగు సంవత్సరాది అనీ అంటారు.
ప్రతి ఏటా చైత్ర మాసంలో వచ్చే ఈ పర్వాన్ని.. ఆ సంవత్సరాన్ని ఒక పేరుతో పిలవడం రివాజు.
ఈ ఏడాది తెలుగు సంవత్సరం పేరు ‘విశ్వావసు’ నామ సంవత్సరం.
చైత్ర మాసపు తొలి రోజునే సృష్టి ప్రారంభమైందని అంటారు. కాబట్టి ఏటా ఆ రోజున ఉగాది జరుపుకోవడం ఆచారంగా మారింది.
ఈ సృష్టిలో ప్రకృతిని మించిన పరమగురువు లేదంటారు.
ప్రకృతితో ఎలా మమేకమై జీవించాలో తెలియచెప్పే పర్వం ఉగాది.
మనిషికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ పర్వం చాటుతుంది. అందుకే ప్రకృతిలో లభించే ఆరు ప్రధాన రుచులను ప్రతి ఒక్కరు ఈ పర్వపు వేళ రుచి చూస్తారు.
ఈ ఆరు రుచుల సమ్మేళనంలో అద్భుతమైన అర్థముంది.
అర్థం చేసుకుని ఆచరిస్తే అనంతమైన పరమార్థం ఉంది.
జీవితంలో అన్నీ సుఖాలే ఉండవు. అలాగని అన్నీ దు:ఖాలే కలగవు.
సుఖదు:ఖాలు, కలిమిలేములు, కష్టనష్టాల కలబోతే జీవితం.
అందమైన అనుభవాలూ ఉంటాయి.
విషాదకరమైన జ్ఞాపకాలూ ఉంటాయి.
అన్నిటినీ సమాదరించుకుంటూ.. అంతటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే జీవితానికి అర్థం.. పరమార్థం.
తెలుగుపత్రిక పాఠకులకు, అభిమానులకు
విశ్వావసు నామ సంవత్సర
శుభాకాంక్షలు
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review వసంత వికాసం మనసంతా సంతోషం.