సంపాదకీయం
ఆనందంగా జీవించడం.. అందరినీ ప్రేమించడం
ఆదరంగా కనికరించడం.. సమత.. మమతలతో పరవశింపచేయడం..
ఇదే శివతత్త్వం. ఇదే సదాశివుని వ్యక్తిత్వం.
సనాతనమైన శివతత్త్వం ఇప్పుడు ఆధునిక వ్యక్తిత్వ వికాస సూత్రమై విరాజిల్లుతోంది.
ఆనందకరమైన జీవనానికి అందమైన బాటలు వేస్తోంది.
పరమశివుని తత్త్త్వం సామాన్య మానవుని వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుంది.
శివుని దృష్టిలో అందరూ సమానమే.
రాజైనా, పేదైనా, మిత్రుడైనా, శత్రువైనా, చక్రవర్తి అయినా, భిక్షగాడైనా శివుని దృష్టిలో అంతా ఒక్కటే.
దైవాల్లో పరమశివుని అంతటి భక్త వశంకరుడు మరొకరు లేరు.
‘నమస్తే సదాశివా!’ అంటే చాలు..ముల్లోకాలూ రాసిచ్చేస్తాడు.
ఆ పాదాలను ఆశ్రయిస్తే హృదయానికి హత్తుకుని గుండెల్లో దాచుకుంటాడు.
రాక్షసుడైనా సరే.. తనను ఆశ్రయిస్తే యథాలాపంగా ప్రేమించేస్తాడు.
సర్వసృష్టి సమానత్వమే శివతత్త్వం.
శివతత్త్వమంటే ప్రేమతత్త్వమే.
ఆ ప్రేమకు హద్దుల్లేవు. షరతులు లేవు.
లింగాన్ని ఆలింగనం చేసుకుని ‘హే.. శివా!’ అని పిలిచిన పసివాడి కోసం పరుగున వెళ్లి యముడి మరణ శాసనాన్నే తిరగరాశాడు.
ఇప్పుడు అందరిదీ ఒకటే సమస్య..
అది- ఒకడు మంచివాడే.. కానీ మేకవన్నె పులి.
ఇంకొకడు సమర్థుడే.. కానీ స్వార్థపరుడు.
మరొకడు సహృదయుడే.. కానీ మూర్ఖుడు.
అటువంటప్పుడు ఇలాంటి వాళ్లతో ఎలా ఉండాలి?. వీళ్లని ఎలా ప్రేమించాలి? ఎంతమేరకు ద్వేషించాలి?.
ఈ ప్రశ్నలకు శివతత్త్వమే జవాబు.
‘‘ఎదుటి వాళ్లు ఎలాంటి వాళ్లయినా సరే.. హృదయపూర్వకంగా ప్రేమించు. ఆ ప్రేమను నిలుపుకోవడం, నిలుపుకోలేకపోవడం అవతలి వారి సమస్య’’.
ఇదే శివతత్త్వం.
శివతత్త్వాన్ని ఆకళింపు చేసుకోవడం అంటే మనం పరమశివుడిలా మారిపోవడం.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review శివతత్త్వం.