శివం.. శివం అంటే మనసు పరవశం చెందుతుంది.
శివతత్త్వం జీవన వేదం. నిరాకార స్వరూపుడైన శివుడి భావాలను, మననం చేసుకుంటే జీవితం ఆనందసాగరం అవుతుంది. శివుని అలంకరణలను మన జీవన విధానానికి అన్వయించుకుని చూద్దాం!
పరమశివుడికి నిరాడంబర జీవితం. మనిషి కూడా భ్రమ కలిగించే ఆస్తులను చూసి గర్వంగా కాకుండా సామాన్య జీవితం గడపాలన్నది శివుడిలో ఇమిడివున్న నిరాడంబర తత్త్వం చాటుతుంది. అవసరాన్ని మించి ఖర్చులతో ఆనక ఇబ్బందుల పాలవడం ఎంతమాత్రం మంచిది కాదని ఆయన నిరాడంబరత్వం వివరిస్తుంది. ఆయన తానుండే శ్మశానమే కైలాసంగా భావించాడు. ఎక్కడ ఉంటున్నామన్నది ప్రధానం కాకుండా ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే ముఖ్యమని గుర్తించాలి.
శివుడి శిరస్సున చంద్రుడు ఉంటాడు. చంద్రుడు జీవన కళలకు ప్రతిరూపం. మనిషి శరీరంలో శిరస్సు ప్రధాన భాగం. అందుకే అది ఎత్తున ఉంటుంది. బాధల్ని మనసులోకి రానివ్వకుండా జీవితం గడపాలి.
శివుడి వాహనం నంది. నంది అంటే ఆనందం కలిగించేది. మనిషి కూడా ఆనందం అనే వాహనంలో నిత్యం ప్రయాణించాలి. ఎదుటి వారికి ఇబ్బంది, కష్టం కలగనీయకుండా జీవించడం అలవర్చుకోవాలి.
శివుడు గరళాన్ని మింగి గొంతులో దాచుకున్నాడు. క్షీరసాగర మథనంలో అమృతం కన్నా ముందు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఇలాగే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను గొంతు దిగనివ్వకుండా దాచుకుని హుందాగా జీవించాలి.
శివుడు త్రినేత్రుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని పరమశివుడి యొక్క మూడు కళ్లని చెబుతారు. సూర్యుడు ఆరోగ్యం, చంద్రుడు జీవన కళలు, అగ్ని తేజోమయమైన జీవితానికి సంకేతాలు. ఇందులో రెండు మానవుల మాదిరిగానే ఉన్నా మరో కన్ను నుదుటన నిలువుగా ఉంటుంది. ఇది జ్ఞాననేత్రం. కనిపించిన అంశాన్ని జ్ఞాన సంబంధ దృష్టితో చూడటం అలవర్చుకోవాలి. మనకు తెలిసిందే నిజమని, భ్రమను వాస్తవంగా అన్వయించుకుని సమాజంపై ప్రభావం చూపవద్దని ఇందులో పరమార్థం.
శివుడు అర్థనారీశ్వరుడు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే. సమాజం పురుషాధిక్యం కావడంతో మహిళలకు అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. పరమశివుడే తన భార్య పార్వతికి శరీరంలో సగ భాగం అందించి ఆదరించిన క్రమంలో ప్రతివారూ మహిళాభ్యుదయాన్ని కాంక్షించాలి.
శివుడి నెత్తిన గంగ ఉంటుంది. గంగ అంటే జలం. జలం పవిత్రతను ఆపాదిస్తుంది. సమస్త జీవకోటికి అది ప్రాణాధారం. ప్రతి ఒక్కరూ ఉన్నంతలో పవిత్రంగా ఉంటూ సమాజాన్ని పవిత్రంగా ఉంచాలనేది ఈ అలంకరణ తెలియచెబుతుంది.
శివుడు నిరంతర ధ్యానమగ్నుడు. బయట ఎంత కల్లోలంగా ఉన్నా స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. ప్రశాంత వాతావరణంలోనే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
శివుడు ఆనందతాండవం చేస్తుంటాడు. అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా పరహితం కోరుకుంటే మన ముఖాన నిత్యం చిరునవ్వు తాండవిస్తుంది.
శివుడి నివాస స్థలం శ్మశానం. ఎన్ని సుఖదు:ఖాలు అనుభవించినా చివరకు చేరేది అక్కడికే. అనవసర భోగాలకు తావివ్వకుండా ప్రశాంత జీవనం గడపాలనేది దీని భావన.
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review శివతత్త్వమే మనతత్త్వం.