
కాల చక్రానికి అధిపతి సూర్యుడు.
కర్మసాక్షి అయిన ఆయన ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి రెండు ఆయనాలు వస్తాయి. అవి- దక్షిణాయనం, ఉత్తరాయణం.
జనవరి తొలి పదిహేను రోజుల చివర్లో అంటే, సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అనీ అంటారు.
ఈ సమయంలోనే పంట చేతికి వస్తుంది.
అందుకే సంక్రాంతి వేళ సూర్యారాధన చేస్తూనే ఆహారాన్ని ప్రసాదించే నేలతల్లినీ అందమైన రంగవల్లులతో, పూజలతో పూజిస్తారు.
భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే సంక్రాంతి పండుగ మది నిండా సంబరాలు నింపి, మనసుల్లోనూ, జీవితాల్లోనూ సరికొత్త కాంతులు, క్రాంతులు వెలిగించే దివ్య సందర్భం.
ముంగిట్లో కాంతులీనే రంగవల్లికలు, ఎక్కడున్నా తప్పకుండా వచ్చే బంధుజనం, పిల్లల పతంగుల సంబరం, హరిదాసు కీర్తనలు, కొమ్మదాసరుల కోలాహలం, గంగిరెద్దుల సందడి.. సంక్రాంతి అంటేనే ఓ సంబరం.. ఓ ఆనందం..
అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పెద్ద పండుగ వెనుక ఎన్నో అంతరార్థాలున్నాయి.
అవేమిటో లోపలి పేజీల్లో చదవండి.
—
హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్!
కొత్త సంవత్సరం కొత్తగా వినిపించే మాట- విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్…
‘కొత్త సంవత్సరం మీకు సకల సంతోషాలనూ, సంపదలనూ సమకూర్చాలని కోరుకుంటున్నా..’ అనే ఈ గ్రీటింగ్ వెనుక పెద్ద కథే ఉంది.
చైనాలో ఎల్లో రివర్ వరదలకు పెట్టింది పేరు.
శతాబ్దాలుగా ఈ నది వరదల వల్ల విపరీతమైన నష్టం జరిగేది.
1931లో వచ్చిన వరదలను గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ చైనా అంటారు.
లక్షలాది మంది ప్రాణాలను హరించే ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి భావితరాలకు చెప్పడం అవసరం అని భావించి దాన్ని పాఠ్యాంశంగా పెట్టిన అక్కడి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తుంది. కానీ ప్రజలకు ఎలాంటి సామాజిక భద్రత కల్పించదు.
దాంతో ప్రజలు తమ కష్టాలు తామే పడాలి.
అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు డబ్బు విలువ నేర్పిస్తారు.
తమ కొత్త సంవత్సరం శుభాకాంక్షల్లోనూ డబ్బు కావాలనే కోరుకుంటారు.
అలా మనం ఆంగ్లంలో చెప్పుకునే ‘హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్’ను పొరుగు దేశమైన చైనా నుంచే అందిపుచ్చుకున్నామన్న మాట.
ఆంగ్లనామ కొత్త సంవత్సరం గురించి మరిన్ని విశేషాలు, కొత్త కొత్త కబుర్లు లోపలి పేజీల్లో బోలెడున్నాయి.
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర,
సంక్రాంతి శుభాకాంక్షలు
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review సంపాదకీయం కొత్త క్రాంతి.