
మహా శివరాత్రి నాటికి చలి.. ‘శివ.. శివా’ అంటూ వెళ్లిపోతుందట. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్య కిరణాల తీక్షణత మరుసటి వారం నాటి శివరాత్రికి వేడిని సంతరించుకుంటాయి. అంటే, శివరాత్రి నాటికి చలి-వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్న మాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం. చలికాలం జాగరణ చేయడం కష్టం. ఈ రెండూ ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా అనుకూలించాలి. అటువంటి సమ శీతోష్ణస్థితి ఉండేది మహా శివరాత్రి నాడే. మానవ జీవనం భోగమయం కాదు.. త్యాగమయం అని చాటుతుంది శివతత్త్వం. ఈ ప్రపంచంలోని సంపదలన్నీ స్వార్థం కోసం కాదు..సమస్త ప్రాణుల సుఖ సంతోషాల కోసం పరమేశ్వరుడు సృష్టించినవే. అను నిత్యం మంగళకరమైన భావాలను మనిషి తన ఎదలో పదిలం చేసుకోవాలి. జీవితాన్ని ఒక పూజా కుసుమంగా రూపొందించుకోవాలి. తనలో అందరినీ, అందరిలో తననూ చూసుకుని ఈ ప్రపంచాన్ని శివమయంగా భావించడమే మనిషి యొక్క కర్తవ్యం. మహా శివరాత్రి పర్వదినం అందచేసే సందేశం ఇదే. ఈ శివ భావనతో పరమశివుడిని ఆరాధిస్తేనే లోకమంతా శివ (మంగళ)మయం అవుతుంది.
•••
‘సర:’ అంటే కాంతి. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. జన జీవితాలను జ్ఞాన, కాంతిమంతం చేసే మాతృశక్తి, అక్షరజ్ఞానాన్ని ఒసగే మంత్రశక్తి- శ్రీ సరస్వతీమాత. సాహిత్యం, సంగీతం అనే రెండు అమృత కలశాలను మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి అయిన సరస్వతీదేవి అక్షరానికి అధిదేవత. ప్రణవ స్వరూపిణి. జ్ఞానానంద శక్తి. లౌకిక, అలౌకిక విజ్ఞాన ప్రదాయిని. శ్రీవాణి కృప లేకుంటే లోకానికి మనుగడే లేదు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. సరస్వతిదేవి జన్మించిన రోజుగా శ్రీపంచమిని భావిస్తారు. అందుకే ఆనాడు ఆ దేవిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆమె ప్రతిమ ముందు ఉంచి, పూజించి, సాయంకాలం ఊరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు. వసంత పంచమి నాడే సరస్వతీదేవిని పూజించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది.
•••
దేవుళ్లు ఎందరో ఉన్నా.. మనకు నిత్యం కనిపించే దైవం మాత్రం ఒక్క సూర్యభగవానుడే. ఆయన ఎన్నటికీ ఆగిపోడు. అలసిపోడు. ఆలస్యం చేయడు. నిరీక్షించడు. నిరంతరం సంచరిస్తూనే ఉంటాడు. ఆ సంచార గమనం వల్లనే కాలంలో, రుతువుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. యుగయుగాలుగా నిర్విరామంగా సాగుతున్న ఆయన గమనమే ఈ సృష్టిలో గల చరాచర జీవకోటి ఆహార చక్రానికి ఆధారభూతం. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడని కీర్తిస్తోంది మానవాళి. సూర్యోదయం ప్రాణుల్ని నిద్రలేపి కర్తవ్యోన్ముఖుల్ని చేస్తే.. సూర్యాస్తమయం అలసిన జీవకోటికి విశ్రాంతినిచ్చి సేదదీరుస్తుంది. విశ్రమించని సూర్యుడి ప్రయాణం మనిషికి ఆదర్శం. లక్ష్యం సిద్ధించే వరకు విశ్రమించకూడదని సూర్యుడి గమనం మనకు చెబుతోంది. చల్లబడి పడమటి కొండల్లో వాలిన ఆ సూరీడే మళ్లీ మర్నాడు సరికొత్త తేజస్సుతో ఉదయించి ప్రాణుల్లో ఉత్తేజాన్ని నింపుతాడు. ప్రతిరోజూ ప్రభాత సూర్యుడిలా వెలుగొందాలని మనిషికి ప్రేరణనిస్తాడు.
•••
పరిస్థితుల ప్రభావంతో శత్రుపక్షం వహించినా.. ఆయనెప్పుడూ హరిపక్షమే. కొన్ని సందర్భాల్లో మౌనం వహించినా.. అవసరమైనపుడు ధర్మాన్ని లోకమంతా ఎలుగెత్తేలా చాటాడు. ఒళ్లంతా బాణాలు గుచ్చుకుని.. దేహమంతా రక్తపుధారలు.. కళ్లలో ప్రాణం మిణుకు మిణుకుమంటోన్న సందర్భం.. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏది ధర్మం? ఏది అధర్మం? ఏది నీతి? ఏది రీతి? పాలకుడు, మనిషనేవాడు ఎలా నడుచుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు? వంటి మంచి విషయాలు బోధించగలరా? కానీ, అటువంటి పరిస్థితుల్లోనూ ఆయన సత్యాన్ని చాటారు. ధర్మాన్ని అనుసరించారు. తాను అవన్నీ చెప్పగలిగినా.. ఆయన చెప్పినంత స్పష్టంగా చెప్పలేనని ఆ పరమాత్మే స్వయంగా ఆయన చేత చెప్పించాడు.
ఆ కురు వృద్ధుడే.. భీష్మ పితామహుడు.
•••
మాఘ మాసం మహా పుణ్య మాసం.
మహా శివరాత్రి, శ్రీపంచమి, భీష్మ ఏకాదశి, రథసప్తమి.. ఇంకా ఎన్నో పుణ్యపర్వాలకు నెలవు ఈ మాసం. ఒక్కో పర్వం మనకు అనేక పాఠాలను, పరమార్థాలను బోధిస్తుంది.
ఆ విశేషాల ‘మాఘ’ సందేశ మాలిక..
ఈ మాసం తెలుగుపత్రిక
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review సంపాదకీయం ‘మాఘ’ సందేశం!.