విఘ్నేశ్వరుడు జ్ఞానానికి ప్రతినిధి.
వివేకానికి ప్రతీక.
ఏనుగు తల నుంచి ఎలుక వాహనం వరకు.. ఆయనలోని అంగాంగమూ అమూల్యమైన పాఠమే.
గుమ్మడి కాయంత తల.. గొప్పగా ఆలోచించాలని చెబుతోంది.
చాటంత చెవులు.. శ్రద్ధగా వినమని చాటుతున్నాయి.
తొండం.. విఘ్నేశ్వరుడి తొండం పైకి మెలితిరిగి ఉంటుంది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనే తత్త్వానికి ఇది సూచిక. మనకున్న శక్తిసామర్థ్యాలను, తెలివితేటలను మంచి పనులకు వినియోగించాలని ఇది చెబుతోంది.
బుల్లి నోరు.. వీలైనంత తక్కువగా మాట్లాడమంటోంది.
చిన్ని కళ్లు.. సూటిగా లక్ష్యానికే గురి పెట్టమంటున్నాయి.
బానపొట్ట.. సుదీర్ఘ జీవితానుభవాన్ని తలపిస్తుంది.
చిట్టెలుక.. మనిషిలోని చంచల స్వభావానికి చిహ్నం.
అహాలనూ, అత్యాశలనూ ఎప్పుడూ నెత్తిన ఎక్కించుకోకూడదు.
నిగ్రహశక్తితో వాటిని ఓడించాలి.
బతుకంటే మంచిచెడులూ.. కష్టసుఖాలూ.. ఆనంద విషాదాలూ..
అన్నింటినీ స్థితప్రజ్ఞతతో జీర్ణించుకోవాలని ప్రతీకాత్మకంగా బోధిస్తున్నాడు వినాయకుడు.
ఈ గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఆయనలోని మంచి గుణాలను, లక్షణాలను రోజుకొకటి మనకు అన్వయించుకున్నా చాలు.. తొమ్మిది రోజుల్లోనే మనలోని చెడునంతా నిమజ్జనం చేసేయవచ్చు.
భగవంతుడు మనకు వరాలనూ ఇవ్వడు. శాపాలనూ ఇవ్వడు.
అవకాశాలను మాత్రమే ఇస్తాడు.
వాటిని వరాలుగా మలచుకుంటామా? లేక శాపాలుగా మార్చుకుంటామా అనేది కేవలం మన చేతుల్లోనే ఉంది.
అలాంటి అవకాశం వినాయక నవరాత్రుల రూపంలో మనముందుకు మరోసారి వచ్చింది.
ఎన్నెన్నో వినాయక చతుర్థిలు గడిచిపోయాయి.
గడిచిపోయిన వాటి గురించి ఆలోచన వద్దు.
ఈ గణపతి నవరాత్రులకు మాత్రం అటువంటి జీవన పాఠాన్ని నేర్చుకునే అవకాశాన్ని విడవద్దు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
(సెప్టెంబరు 7, 2024: వినాయక చవితి)
– డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review సంపాదకీయం వినాయకం..వివేకం!.