సమస్యలు – ధైర్యం – పరిష్కారం

ఒక రాజ్యంలో ప్లేగు వ్యాధి విజృంభించి అపార జన నష్టం సంభవిస్తుంది. దాంతో రాజ్యాధినేత తీవ్ర ఆందోళనకు గురవుతాడు. రాజ గురువు సలహా మేరకు శివ యజ్ఞాన్ని ఆచరిస్తాడు. ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ రాజు చేస్తున్న క్రతువుకు శివుడు సంతుష్టుడై ప్రత్యక్షం అవుతాడు. ఆ రాజును నీ అభీష్టం ఏమిటని అడుగుతాడు. మహారాజు ఎంతో ఆర్తితో ‘భగవాన్‍! మా రాజ్యంలో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి బారి నుంచి వారిని రక్షించలేక పోతున్నాను. నీవే ఆ బాధ్యతను తీసుకుని ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి’ అని వేడుకుంటాడు. భక్తుడి విన్నపానికి స్పందించిన ఆ ముక్కంటి తన బంటు నందికి ఆ బాధ్యతను అప్పగించాడు. ఎలాగైనా ప్లేగు వ్యాధిని నియంత్రించాలని శివుడు నందిని ఆదేశిస్తాడు. దీంతో స్పందించిన నందీశ్వరుడు హుటాహుటీన సదరు రాజ్యానికి బయల్దేరి వెళతాడు. రాజ్యంలోకి ఆయన అడుగుపెట్టిన వెంటనే, అక్కడ వ్యాపించిన ప్లేగు వ్యాధికి కారకుడైన రాక్షసుడిని తక్షణమే తన సమక్షంలో హాజరు కావాలని ఆదేశిస్తాడు. వెంటనే నంది వద్ద ప్రత్యక్షమైన ఆ ప్లేగు రాక్షసుడు విషయం ఏమిటి అని అడుగుతాడు. ఈ రాజ్య ప్రజలను పీడించడం తగదని, వెంటనే రాజ్యం విడిచి పెట్టి వెళ్లిపోవాలని అతనిని నంది ఆదేశిస్తాడు. ప్లేగు రాక్షసుడు ఇందుకు సరేనని అంగీకరించి, ఇంత దూరం వచ్చాను కనుక ఒక్కరినైనా వెంట తీసుకుని వెళ్తానని అర్ధిస్తాడు. దానికి అంగీకరించిన నంది, ‘ఈ రాజ్యం నుంచి ఒకే ఒక్కరిని ప్లేగు వ్యాధి బాధితునిగా ఆ పై లోకానికి తీసుకుని వెళ్లు. అంతకు మంచి ఒక్కరికి వ్యాధి సోకినా నీ అంతం తప్పదు’ అని చాలా స్పష్టంగా హెచ్చరిస్తాడు. సరేనంటూ వెళ్లిపోతాడు ప్లేగు రాక్షసుడు. కొన్నాళ్లకు ప్లేగు వ్యాధి పీడితులుగా వందలాది మంది ప్రజలు మరణిస్తారు ఆ రాజ్యంలో. నందికి ఈ విషయం తెలుస్తుంది. ఆగ్రహోదగ్రుడవుతాడు. మళ్లీ ఆ ప్లేగు రాక్షసుడిని పిలుస్తాడు. తనకు ఇచ్చిన మాట తప్పి ఒక్కరి బదులు వందలాది మందిని బలి తీసుకున్నావంటూ నంది కన్నెర్ర చేస్తాడు. అప్పుడు ప్లేగు రాక్షసుడు- ‘మహాప్రభూ! ఇందులో నా తప్పేం లేదు. నేను మీకు మాటిచ్చినట్టు ఒక్కరికే సోకాను. కానీ, మిగతా అందరూ భయంతో కన్నుమూశారు’ అంటాడు వినయంతో. విస్తుపోవడం నంది వంతవుతుంది.
జీవితంలో చాలా విషయాల్లో ఇలాగే జరుగుతుంటుంది. మనం ఒక సమస్యను ఎదుర్కోవడం కంటే కూడా, దానిని తలుచుకుని భయపడటం లేదా మదన పడటంతోనే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటాం. ఆ వ్యధతోనే విలువైన సమయాన్ని కోల్పోతుంటాం. నిజానికి మరణం అంటే వేరేమిటో కాదు.. మనలో గూడుకట్టుకుని ఉండే భయమే. భయపడటం వల్ల, బెదిరిపోవడం వల్ల మనల్ని చుట్టుముట్టిన సమస్యలు పరిష్కారం కాకపోగా, అపాయానికి గురి చేస్తుంటాయి. అందుకే మనకు ఎదురైన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. పై కథలో ప్లేగు వ్యాధి సమస్య అయితే, అది సోకడం వల్ల కంటే దాని గురించి భయపడటం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కాస్త స్థిమితంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచన లోపిస్తే, వివేకం పనిచేయకుంటే ఇలాగే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకూడదంటే మనందరం ఆలోచనాపరులుగా ఉండాలి.

Review సమస్యలు – ధైర్యం – పరిష్కారం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top