అఖిల పురాణాలూ అమ్మ వ్యక్తిత్వాన్ని పై విధంగా నిర్వచించాయి. ‘దు:ఖహంత్రీ, సుఖప్రదా, దుష్టదూరా, దురాచారశమనీ, దోషవర్జితా..’ అంటూ దుర్గాదేవి సుగుణాలను కీర్తించాయి.
అసుర సంహారం కోసం దుర్గాదేవి ఎంచుకున్న మార్గాలూ, చేసిన యుద్ధాలూ, సాధించిన విజయాలూ మనకు నిత్య పాఠాలు. దుర్గాతత్త్వాన్ని ఒక్క మాటలో చెప్పలేం.
ఆమె మహామాయ.. ప్రేమను పంచడంలో జగన్మాత. శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేయడంలో వ్యూహకర్త. శత్రు సంహార సమయంలో రౌద్రమూర్తి. మొత్తంగా అమ్మ- సచ్చిదానంద స్వరూపం.
ఎదురుగా మహిషాసురుడు.
ఎల్ల లోకాలూ గజగజా వణికిపోతున్నాయి.
త్రిమూర్తులూ నీవే దిక్కని ప్రార్థించారు.
ముక్కోటి దేవతలు సాయం కోసం ప్రణమిల్లారు.
అప్పుడు ముల్లోకాల రక్షణ కోసం ఆమె సింహవాహనంపై సమరానికి బయల్దేరింది. వేవేల అసురుల్ని ఒక్క దెబ్బకు నేలకూల్చింది.
త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా వియోగ దు:ఖంలో మునిగిపోయాడు. నారద మహర్షి వచ్చాడు. ‘బాధపడకు. శరన్నవరాత్ర పూజ చెయ్యి. రావణవధకు అవసరమైన సమృద్ధ శక్తిని నీకు అమ్మ ప్రసాదిస్తుంది’ అని సలహా ఇచ్చాడు.
రాముడు అమ్మను ఆరాధించాడు. సింహవాహినియై కనుల ఎదుట నిలిచింది. ‘దశమి నాడు దండెత్తు’ అని విజయమంత్రాన్ని రాముడి చెవిలో ఊదింది.
పాండవులు అడవుల పాలయ్యారు. అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు కష్టాల పాలవకుండా అమ్మవారి స్తవం చేయాలని చెప్పాడు కృష్ణుడు. ధర్మరాజు పాటించాడు.
కురుక్షేత్ర యుద్ధం.. ఎదురుగా సముద్రమంత శత్రు సైన్యం. అర్జునుడు విల్లు ఎక్కుపెట్టలేక నీరుగారిపోయాడు. కృష్ణుడు భుజం తట్టి.. ‘మరేం భయం లేదు. అమ్మ వారి స్తవాన్ని పఠించు’ అని ధైర్యం చెప్పాడు. అర్జునుడు విజయం సాధించాడు.
ఇన్ని విజయాల వెనుక ఉన్న ఆమె- ‘అమ్మలగన్నయమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ.. చాల పెద్దమ్మ.. సురారులమ్మ.. అమ్మ దుర్గమ్మ’
అమ్మ అందాల మూల ప్రకృతి. నగరాజపుత్రి. సౌకుమార్య సౌందర్యలహరి. మల్లేశ్వరుడి హృదయ సామ్రాజ్య పట్టమహిషి. ఆ తల్లి దయా దృష్టి కోసం మానవులే కాదు.. దేవతలూ తపిస్తారు. శుద్ధ స్పటిక రూపిణి, బ్రహ్మ తేజస్విని అయిన దుర్గ.. తూర్పున ఐంద్రి, పడమర వారుణి, ఉత్తరాన కౌమారి, దక్షిణాన శ్రేష్ట ధర్మ దేవతాశక్తిగా సింహవాహినియై సమస్త లోకాలనూ పాలిస్తుందట!.
శివుడు సర్వశక్తిమంతుడు. సర్వమంగళోపేతుడు. కానీ, ‘శక్తి’తో కూడితే కానీ జగత్తును ఆవిర్భవింప చేయలేడు.
బ్రహ్మ విష్ణువులు సృష్టి, స్థితికారకులు. కానీ, అమ్మ దయ లేనిదే కదలడానికి కూడా సమర్థులు కారు.
అందుకే త్రిమూర్తులకూ అమ్మ పూజనీయురాలు. అలాంటి అమ్మను మనం పూజించాలన్నా, స్తుతించాలన్నా, అమ్మ రూపాన్ని తలుచుకుని తరించాలన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి.
మగ్గురు మూర్తులనే కాదు.. ముల్లోకాలనూ శక్తియుక్తం చేసే ఆ శక్తి- ఆదిశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయిన జగన్మాత. ఆమె మూలశక్తి.
పూర్వం మార్కండేయ మహర్షి సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెళ్లాడు.
‘బ్రహ్మదేవా! మీరు సృష్టికర్త కదా! మీకంటూ తెలియని రహస్యం ఏదీ లేదు. మీకు తెలిసిన రహస్యాలలో ఇంతవరకు ఎవరికీ చెప్పకుండా గుప్తధనంలా దాచి ఉంచిన విషయం ఏదైనా ఉందా?’ అని అడిగాడు.
‘అయితే నాకు చెప్పగలరా?’ అని అడిగాడు మార్కండేయుడు.
బ్రహ్మ ఒక్క క్షణం సంశయించాడు.
మార్కండేయుడు ఆలోచనలో పడ్డాడు.
‘పితామహా! లోక కల్యాణం కోసమే అడుగుతున్నాను. లోకంలో అతి రహస్యమై, పండితులను, పామరులను, సకల భూతాలను ఆ రహస్యం రక్షించేదై ఉండాలి. దాన్ని నేను లోకోపకారం కోసం ఉపయోగిస్తాను’ అన్నాడు.
బ్రహ్మ సంతోషించాడు.
‘నాయనా! బ్రహ్మవేత్తవు. లోకోపకార పరాయణుడవు. నువ్వడిగినట్టు గోప్యం, పావనం, స్మరణ మాత్రం చేతనే మనల్ని రక్షించి సమస్త కోర్కెలనూ తీర్చే ‘నవదుర్గా కవచం’ అని ఒకటుంది. అది చెప్పడానికి ముందు నవదుర్గల పేర్లు, వాటి ప్రాశస్త్యాన్ని చెబుతాను విను’ అంటూ ప్రారంభించాడు.
‘నవదుర్గలు’ అనే పదం దేవీ కవచంలో ఉంది.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ ।
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ।।
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ ।
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ।
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా: ప్రకీర్తితా: ।
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ।।
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో విరాజిల్లుతుంది. ఈ తొమ్మిది రూపాలకూ తొమ్మిది నామాలున్నాయి. వాటిలో ఎవరు ఏ ఒక్క నామాన్ని నిష్టగా జపించినా సద్గతులు ప్రాప్తిస్తాయి. దుర్గాదేవి ఒక్కో నామానికి ఒక్కో విశిష్టత, ఒక్కో వైచిత్య్రం, ఒక్కో ఫలం ఉన్నాయని శ్రుతి స్మ•తి పురాణంలో ఉంది. ఆయా నామ రూప విశేషాలివీ..
శైలపుత్రి:
వందే వాంఛిత్ లాభం చంద్రార్ధకృతశేఖరం ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ।।
‘తలపై చంద్రవంక ధరించి, వృషభంపై సవారీ చేస్తూ, త్రిశూలాన్ని ధరించి, తేజోవంతంగా ఉండే శైలపుత్రి దేవిని నా కోరికలు తీర్చాలని పూజిస్తాను’ అని పై శ్లోకానికి భావం.
దుర్గాదేవి మొదటి నామం శైలపుత్రి. ఇది అమ్మవారి తొలి రూపం కూడా. శరన్నవరాత్రుల తొలిరోజు పూజించేది శైలపుత్రి అమ్మవారినే. హిమవంతుడు పర్వతరాజు. ఆయన కుమార్తె కాబట్టి ఆమెకు శైల (పర్వత)పుత్రి అనే పేరు వచ్చింది. సతీదేవి తండ్రి దక్షుడు పిలవకున్నా ఆయన తలపెట్టిన యాగానికి వెళ్లింది. పిలవని పేరంటానికి వచ్చిందని తండ్రి ఆమెను ఘోరంగా అవమానించాడు. అక్కడికక్కడే యోగాగ్నిని సృష్టించుకుని సతీదేవి తనువును త్యజించింది. పర్వతరాజులలో యోగ్యుడైన హిమవంతుడు.. సతీదేవి తన ఇంట జన్మించాలని తపస్సు చేశాడు. అలా ఆమె హిమవంతుని ఇంట పుట్టిందని చెబుతారు. శైలపుత్రికి సతి, పార్వతి, భవానీ అనే పేర్లు కూడా ఉన్నాయి. శైలపుత్రి వాహనం వృషభం (ఎద్దు). ఆమె కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటాయి. తలపై చంద్రవంక ఉంటుంది. శైలపుత్రిని బలానికి, స్వచ్ఛతకు ప్రతీకగా భావిస్తారు. ఆమె భక్తవాత్సల్య పూర్ణ. అనుపమానమైన భక్త వాత్సల్యం చేతనే అమ్మవారి తొలి నామం ‘శైలపుత్రి’ అయింది.
బ్రహ్మచారిణి:
దధానా కర్ పద్మాభ్యామక్ష్మల కమండలూ ।
దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా ।।
‘చేతులలో జపమాల, కమండలువు ధరించిన బ్రహ్మచారిణి దేవీ.. నన్ను అనుగ్రహించు’ అని శ్లోకార్థం.
దుర్గామాత నవదుర్గ రూపాల్లో రెండోది- బ్రహ్మచారిణి రూపం. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని రెండో రోజు కొలిచేది ఈ రూపాన్నే. శివుడి కోసం ఘోర తపస్సు చేసి పతిగా పొందిన పార్వతిదేవి రూపమే బ్రహ్మచారిణి. ఈ రూపంలో అమ్మవారు తెల్లని చీర ధరించి ఉంటుంది. ఒక చేతిలో జపమాల, మరో చేతిలో కమండలం ఉంటుంది. ఆమె జ్ఞానానికి, భక్తికి, తపస్సుకు ప్రతీక. ఆమె ఈ రూపం స్వచ్ఛత, త్యాగాన్ని సూచిస్తుంది. బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల సకల విజయాలూ కలుగుతాయని, నిస్వార్థ ప్రేమ, సేవ లభిస్తాయని భక్తుల నమ్మకం. ఆమె ఆరాధనతో మనసుకు ఏకాగ్రత కలుగుతుంది. సూక్ష్మమైన భగవత్ తత్త్వం మీద మనసు స్థిరపడుతుంది. శివుడిని పతిగా కోరి తపించిన ఈ నగరాజ కన్య.. సదా తపో ముద్రాంకిత. వేదవేద్య. వేద విహారిణి.
చంద్రఘంటా:
పిండజ్ ప్రవారూడ్ చంద్కోపాస్త్రకైర్యుత
ప్రసాదం తనుతే మధ్యం చంద్రఘంటేతి విశ్రుతా ।।
‘పులిపై స్వారీ చేస్తూ, శత్రువులను దనుమాడుతూ, పది చేతులతో అనేక ఆయుధాలతో విరాజిల్లే చంద్రఘంటా దేవీ నన్ను అనుగ్రహించు’ అని పై శ్లోకానికి భావం.
దుర్గాదేవి నవరూపాల్లో మూడోది- చంద్రఘంట రూపం. ధైర్యం, నిర్భయం, తేజస్సుకు ఈ రూపం ప్రతీక. చంద్రఘంటా దేవి నుదుటిపై అర్ధచంద్రుడు ఉంటాడు. ఈమె నుదుటిపై గల గంట శబ్దం ప్రతికూలతలను తొలగించి ప్రకాశాన్ని ఇస్తుందని నమ్మకం. ఈమె కృప ఉంటే భక్తుల పాపాలు, శారీరక, మానసిక ఇబ్బందులు, దుష్టశక్తులు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రూపానికి ఇంకా చంద్రఖండ, చండిక, రణచండీ అనే నామాలు కూడా ఉన్నాయి. చెప్పనలవి కాని లావణ్యాతిశయంతో చంద్రుని వంటి స్వచ్ఛమైన పానపాత్రను చేత ధరించి, నిత్యానందమనే రసపానం చేత సమస్త ప్రాణికోటిని ఆహ్లాదంలో ముంచెత్తే రూపమిది. చంద్రఘంటా దేవి ఆరాధన వల్ల మనసులోని కుత్సికం, క్రూరమైన భావ పరంపర నశించి స్వచ్ఛం, పవిత్రమైన స్వభావులవుతారని అంటారు.
కూష్మాండ:
సురసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ ।
దధానా హస్తపద్యాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే ।।
‘తన పద్మ హస్తాలలో రుధిరంతో నిండిన రెండు కలశాలను ధరించిన ఓ కూష్మాండ దేవీ! నాకు అనుగ్రహం ప్రసాదించు’.
‘కూ’ అంటే కొద్ది. ‘ఊష్మ’ అంటే శక్తి. ‘అండ’ అంటే విశ్వం అని అర్థం. అంటే ఈ విశ్వాన్ని తన శక్తితో సృష్టించిన దేవత- కూష్మాండ దేవి. సంస్క•తంలో కూష్మాండ అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ప్రాణశక్తిని పెంచుతుంది కాబట్టి అమ్మకు ఈ పేరు వచ్చిందని అంటారు. దేవీ శరన్నవరాత్రులలో నాలుగో రోజు దుర్గాదేవిని కూష్మాండాదేవి రూపంలో పూజిస్తారు. కూష్మాండ దేవి తన దివ్యమైన నవ్వుతో ఈ లోకాన్ని సృష్టించిందని అంటారు. తన శక్తితో ఈమె శూన్యాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది.
లోకంలో దు:ఖాలు మూడు రకాలు. అవి- ఆధ్యాత్మికం, ఆధిభౌతికం, ఆధిదైవికం. జ్వరాది శారీరక రోగాలు, శోక మోహాదుల వల్ల కలిగే మనోవ్యాధులు ఆధ్యాత్మికమైనవి. విష జంతువులు, క్రూర మృగాల వల్ల కలిగే ఉపద్రవాలు ఆధిభౌతికాలు. అతివృష్టి, అనావృష్టి, కరవుకాటకాది ప్రకృతి వైపరీత్యాలు ఆధిదైవికాలు. ఈ మూడు తాపాలు గల సంసారమనే జగత్తు యొక్క అండాన్ని ఉదరంలో ధరించి రక్షించే మాయారూపిణి అయిన జగన్మాత కూష్మాండ అయింది.
స్కందమాత:
సింహాసంగతం నిత్యం పద్మాంచిత్ కర్ద్యాయా ।
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ।।
కార్తికేయుని (స్కందుడు)తో పాటు సింహంపై స్వారీ చేస్తూ, రెండు చేతులలో పద్మాన్ని, మరో చేతిలో వరముద్రను ధరించిన స్కందమాత నాకు అనుగ్రహం ప్రసాదించుగాక’ అని పై శ్లోకానికి అర్థం.
స్కందుడి తల్లి కాబట్టి ఆమెకు స్కందమాత అనే పేరు వచ్చింది. దసరా నవరాత్రుల్లో జ్ఞానానికి, రక్షణకు ప్రతీకగా ఐదో రూపమైన ఈ స్కందమాతను కొలుస్తారు. ఆమెను ఆరాధించడం వల్ల తెలివితేటలు కలుగుతాయని అంటారు. ఈ రూపంలో ఆమె కార్తికేయుడి తల్లి. అంటే మాతృత్వానికి ప్రతీక. సింహాన్ని అధిరోహించి, పద్మాసనంపై ఆసీనురాలై ఒడిలో కార్తికేయునితో కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం, సంతానం కోరుకునే వారు స్కందమాతను పూజిస్తారు.
ఈ లోకంలో గర్భస్పర్శ లేని ప్రాణి ఉంటుందా? అమ్మ లేకపోతే ‘నేను’ అని చెప్పుకునే ‘అహం’ ఉండదు. ఈ సృష్టిలోని సర్వప్రాణులకు ఎన్నో జన్మలు. ఎందరో తల్లులు. ఏ అమ్మ గురించి చెప్పాలి? ఏ అమ్మను పిలవాలి? ఏ అమ్మ పలకాలి? అందుకే చరాచర జగత్తుకే మూలపుటమ్మ, కడుపారడి ఎరిగిన అమ్మ- దుర్గమ్మ. జ్ఞానులై, జన్మరాహిత్యాన్ని కోరుకునే వారు స్కందమాత గర్భంలో పుట్టాలని కోరుకుంటారు. ఈమెను పూజించిన స్త్రీలు సత్సంతానవతులు అవుతారని ప్రతీతి. స్కందమాతను ఆరాధించే వారికి సర్పభీతి ఉండదనీ, గర్భశుద్ధి కలిగి తల్లికీ, బిడ్డకీ చక్కని పాండిత్యం లభిస్తుందనేది జ్ఞానుల మాట.
కాత్యాయని:
చంద్రహాసోజ్జ్వల కరా శారదూల్పార్వాహనా ।
కాత్యాయనీ శుభం దద్యాద్ దేవీ దానవఘటినీ ।।
‘పది చేతులలో చంద్రహాస ఖడ్గం, ఇతర ఆయుధాలను ధరించి, సింహంపై స్వారీ చేస్తూ రాక్షసులను సంహరించే కాత్యాయని దేవీ.. సదా నా వెన్నంటి ఉండు’ అని భావం.
ఇది దేవి ఆరవ రూపం. మహిషాసురుడిని సంహరించి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన రూపమిది. నవరాత్రుల్లో ఆరో రోజున ఈమెను పూజిస్తే దు:ఖం, భయం నుంచి విముక్తి లభిస్తుందని అంటారు. ఈమె సింహవాహిని. దేవతలు ప్రసాదించిన ఆయుధాలను ధరించి ఉంటుంది. ముక్కోటి దేవతల ప్రార్థనల ఫలితంగా అమ్మవారు కశ్యప గోత్రానికి చెందిన కాత్యాయునుడు (కతుడు) అనే మహర్షి ఆశ్రమంలో పుట్టి పెరగడం చేత కాత్యాయని అయింది. దేవతల కార్యార్థం అవతరించిన రూపమిది. ఆమె సదా బ్రహ్మవేత్తల మనసులో నివసిస్తుందని, సమస్త దేవతల ఆయుధాలు, తేజస్సుతో ఆవిర్భవించి వెలుగొందుతుందని చెబుతారు. ఈమెను కొలిచిన వారికి వేద విజ్ఞాన సర్వస్వమూ కరతలామలకం అగునని మహర్షుల మాట.
కాల(ళ)రాత్రి:
ఏకవేణీ జపకర్ణపూరా నాగ్నా ఖరాస్థితా।
లంబోష్ఠీ కర్ణికా కర్ణీ తైలాభ్యక్త శరీరిణీ।।
వాం పాడోల్లసల్లోహ్లతా కంటకభూషణా ।
బర్ధస్ మూర్ధం ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ।।
ఆమె నగ్నంగా ఉంటుంది. గాడిదపై స్వారీ చేస్తుంది. పొడవైన నాలుక, తేజోవంతమైన శరీరం కలిగి ఉంటుంది. కాళ్లకు మెరుపులాంటి ఆభరణాలు ధరించి ఉంటుంది. నల్లని వర్ణంలో ఉంటుంది. జుట్టు విరబోసుకుని ఉంటుంది. పెద్ద కళ్లు, చెవులు కలిగి భయంకరమైన రూపంలో దర్శనమిస్తుంది.
దుర్గాదేవి అత్యంత ఉగ్రమైన, భయంకరమైన రూపాల్లో ఒకటైన కాలరాత్రి అమ్మవారి ఏడవ రూపం. దుష్టశక్తులను నాశనం చేసి భక్తులకు అదృష్టాన్ని ప్రసాదిస్తుందని ప్రతీతి. ఆమె స్వరూపం చీకటి రాత్రిలా ఉంటుంది కానీ ఆమె తనను పూజించిన భక్తులకు తేజస్సును ప్రసాదిస్తుంది. శుభాలను అనుగ్రహిస్తుంది. ‘కాల’ అంటే సమయం లేదా చీకటి అని అర్థం. నల్లని వర్ణంలో ఉంటుంది కాబట్టి, రాత్రి చీకటికి ప్రతిరూపం కాబట్టి ఈ పేరు వచ్చింది. ఆమె మృత్యువుకే భయకారిణి. ప్రళయ కాలంలో యముడిని కూడా నశింప చేయగల శక్తి గలది. ఆ మూలశక్తే కాలరాత్రి అని పిలువబడుతోంది. చూడ్డానికి ఈ అమ్మవారి రూపురేఖలు భయం కలిగించినా, భక్తులకు అదృష్టాన్ని సానుకూల ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్మకం. కాలరాత్రి దేవిని ఉపాసించిన వారు ఆత్మశక్తిని గ్రహించి నిర్భీతితో శివశక్తియుతులు కాగలరని స్వయంగా పరమశివుడే చెప్పాడు.
మహాగౌరి
శ్వేతే వృశేషమారూఢా శ్వేతాంబర్ధర శుచి: ।
మహాగౌరీ శుభం దధ్యన్మహాదేవ్ ప్రమోదదా ।।
తెల్లని వృషభంపై సవారీ చేస్తూ, స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించి, ఆనందాన్ని ప్రసాదించే మహాగౌరీదేవి నా వెన్నంటి ఉండు గాక!’.
నవదుర్గా రూపాలు, నామాల్లో ఎనిమిదవది మహాగౌరీ దేవి. పుట్టుకతోనే నల్లని వర్ణం కలిగిన మహేశ్వరిని ఒకసారి భర్త పరమశివుడు హాస్యానికి ‘కాళీ’ అని సంబోధించాడట. కాళీ అంటే నలుపు అని అర్థం. దీంతో కోపగించిన శివానీ, బ్రహ్మను గురించి తపస్సు చేసి తన నల్లని దేహకోశాన్ని వదిలి పరమేశ్వరుడికి ధీటుగా తెల్లని ఛాయతో ‘మహాగౌరి’ అయింది. ఈమెను ఆరాధించిన వారికి అజ్ఞానాంధకారం పటాపంచలు అవుతుందనీ, స్త్రీలు దీర్ఘ సుమంగళులుగా కలకాలం జీవిస్తారనీ, అష్టైశ్వర్యాలూ పొందుతారని ప్రతీతి. గౌరీ ఉపాసన చేత మంత్రఫలం చాలా త్వరగా దక్కుతుందట. ఈమెది చాలా ప్రకాశవంతమైన, స్వచ్ఛమైన రూపం.
సిద్ధిధాత్రి:
సిద్ధ గంధర్వ యక్ష్ద్యైరసురైరమరైరపి ।
సేవ్యామానా సదాభూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ।।
సిద్ధులు, గంధర్వులు, యక్షులు, దేవతలు, రాక్షసులు మొదలైన వారిచే పూజింపబడే, చేతులలో శంఖం, చక్రం, గద, పద్మాన్ని ధరించిన, సకల సిద్ధులను, విజయాన్ని ప్రసాదించే సిద్ధిదాత్రి దేవికి నమస్కారం’ అని పై శ్లోకానికి అర్థం.
నవదుర్గా రూపాలు, నామాల్లో తొమ్మిదవది, చివరిది సిద్ధిదాత్రి. భక్తులు కోరుకునే సిద్ధిని, పరిపూర్ణతను, ఫలితాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారు సిద్ధిదాత్రి అయ్యారు. శివుడు విశ్వపాలకుడు. లోకపాలనకు అవసరమైన సిద్ధులను.. అంటే శక్తులను పొందడానికి సిద్ధిదాత్రీదేవినే పూజించాడని అంటారు. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశిత్వ.. ఇవి అష్టసిద్ధులు. వాటితో పాటు మోక్షసిద్ధినీ ప్రసాదించేదీ, లౌకిక, అలౌకిక సర్వార్ధ సిద్ధులకూ అధిష్ఠాత్రి ఈ సిద్ధిదాత్రి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని, విజయం లభిస్తుందని నమ్మకం.
పేరు, రూపం వేరైనా..
పేర్లు వేరు. రూపాలు వేరు. కానీ, అవన్నీ ‘దుర్గ’ అంశలే. ‘దుర్గ’ శత్రునాశకమైన శక్తివాచకం. కనుకనే దేవికి పర్యాయపదమైన ‘దుర్గా’ శబ్దం ఉచ్ఛరించినా, స్మరించినా పాపాలన్నీ నశిస్తాయని సాక్షాత్తూ పరమశివుడే చెప్పాడు. పూర్వం రురుడు అనే రాక్షసుడి కొడుకైన దుర్గముడు తనకు పురుషుల వల్ల మరణం లేకుండా ఉండాలని బ్రహ్మ నుంచి వరం పొందాడు. బ్రహ్మ సరేనన్నాడు. ఆ వరగర్వంతో దుర్గముడు లోకాలను పీడించాడు. వాడిని వధించడానికి దుర్గ.. మహిషాసుర మర్దినిగా అవతరించింది. మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు వెయ్యి చేతులతో ప్రభవించింది. ఆ చేతులతో దిక్కులన్నీ మూసివేసింది. కిరీటంతో ఆకాశాన్ని గీరుతూ, పదఘట్టనలతో భూమిని క్రుంగదీస్తూ మహోగ్రరూపిణి అయింది. దేవతలు ఆ దేవి రూపాన్ని చూడ్డానికి భయపడ్డారు.
‘అమ్మా! ఈ రూపం మహిషాసురుడు వంటి రాక్షసుల వధకే కానీ, మాకు భరించశక్యం కాదు. ఈ దివ్యాప్త్రాలు, ఖడ్గాది ప్రహరణాయుధాలు నీ చేతిలో ఉండగా, నీ ముఖాన క్రోథ జ్వాలలు ప్రజ్వరిల్లుతుంటే మూల ప్రకృతివి, లోకాలను ఏలే తల్లివి అయిన నిన్ను మేం ఎలా సమీపించగలం? నీవు ఆర్తిని పోగొట్టే భవసాగర నౌకవు తల్లీ’ అని వేడుకోగా, దసరా పుణ్య దినాన కరుణారస సంపూర్ణ అయిన ఆ దేవి జగదధిష్టాత్రి అయిన రాజరాజేశ్వరిగా, సింహాసనైశ్వర్యగా అవతరించింది.
అమ్మ అపు‘రూపం’
తీరొక్క అలంకారం
సమస్త జగత్తునూ పాలించే శక్తిస్వరూపిణిని దసరా సందర్భంగా పలు రూపాల్లో కొలుస్తుంటాం. దసరా సందర్భంగా అమ్మవారిని అలంకరించే ఆయా రూపాల్లోని ప్రత్యేకతలేమిటంటే..
బాలాత్రిపురసుందరి: అమ్మవారిని ఈ రూపంలో తొమ్మిదేళ్ల బాలికగా భావించి ఉపాసిస్తారు. జ్ఞానానికి, శక్తికి ఈ రూపం చిహ్నం. శత్రువులను నిర్మూలించి, ఆరోగ్యాన్నీ, ధనాన్నీ ప్రసాదించే రూపమిది. భండాసురుడనే రాక్షసుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఈ బాలిక రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహాత్మ్యంలో ఉంది.
గాయత్రీదేవి: గయలు అంటే ప్రాణాలు. త్రాయతే అంటే రక్షించేదని అర్థం. అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్నీ, మానసిక ప్రశాంతతనూ, మహదానందాన్నీ ప్రసాదిస్తుందీ రూపం.
అన్నపూర్ణాదేవి: అన్న అంటే ఆహారం లేదా ధాన్యం అనీ, పూర్ణ అంటే పూర్తి, సంపూర్ణమనీ అర్థం. సాక్షాత్తూ పరమశివుడికే ఆహారాన్నీ, జ్ఞానభిక్షనూ ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికీ, జ్ఞానానికీ లోటుండదు.
కాత్యాయినీదేవి: పరమశివుడి సతీమణి పార్వతీదేవికి గల మరో పేరిది. మహిషాసురుడి సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం చేసింది కాత్యాయిని దేవేనని స్కంద పురాణంలో ఉంది.
మహాలక్ష్మి: సంపదకూ, ఐశ్వర్యానికీ అధి దేవత. అష్టలక్ష్ములుగా ఎనిమిది రూపాల్లో కరుణిస్తూ ఐశ్వర్యాన్నీ, ఆనందాన్నీ, విజయాలను అందించే వరప్రదాయిని.
లలితా త్రిపురసుందరీదేవి: శ్రీచక్రానికి అధిదేవత. ముల్లోకాలనూ పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనను కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది.
మహాచండీదేవి: దుర్గాదేవికి మరో శక్తిమంతమైన రూపం. భక్తులకు విజయాన్నీ, కీర్తినీ ప్రసాదించేందుకు అవతరించింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల కలయిక ఈ రూపం. అడ్డంకులను తొలగించి, అనుగ్రహాన్ని అందిస్తుంది.
మహా సరస్వతి: చదువుల తల్లి. జ్ఞానం, విద్య, కళలకు అధిదేవత. శరన్నవరాత్రుల సందర్భంలో మూలా నక్షత్రాన అమ్మను సరస్వతిగా అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల్లో ఇదో ముఖ్య అలంకారం.
దుర్గాదేవి: సింహవాహినిగా అవతరించి, లోకమాతగా పూజలందుకునే రూపం.
మహిషాసురమర్దిని: దుష్టశిక్షణ, శిష్టరక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలా చేస్తుంది. మహిషుడిని సంహరించిన పరమ పావని. ఈ రూపాన్ని సేవిస్తే ఆపదలూ, భయాలూ తొలగిపోతాయి.
రాజరాజేశ్వరి: కరుణామయి. అన్ని లోకాలనూ పాలిస్తూ సృష్టి-స్థితి-లయలను నియంత్రించే సర్వశక్తిమంతురాలు. విజయదశమి పర్వదినాన అమ్మవారిని ఈ రూపంలోనే అలంకరించి పూజిస్తారు.
ముల్లోకాలనూ పాలించే జగన్మాతను దేవీ శరన్నవరాత్రుల వేళ ఎంతో శ్రద్ధాభక్తులతో పూజిస్తాం. ఆయా పూజలు ఎంత నిష్టగా చేసినా.. కొన్ని సందేహాలు సహజంగానే వస్తుంటాయి. మరి దసరా వేళ అమ్మవారిని ఎలా పూజించాలి? భక్తుల్లో ఉన్న సాధారణ సందేహాలేమిటి? వాటిలో నిజమెంత? తెలుసుకుందాం..
ఏ రూపం ప్రామాణికమైనది?
విజయవాడ కనకదుర్గ అమ్మవారి క్షేత్రంలో మూలవిరాట్టును గాయత్రి, బాలత్రిపురసుందరి, అన్నపూర్ణ.. తదితర రూపాల్లో అలంకరిస్తారు. శ్రీశైల భ్రమరాంబిక, వరంగల్ భద్రకాళి, శృంగేరి శారదాపీఠంలో నవదుర్గల అలంకారంలో దేవీ భాగవతాన్ని అనుసరిస్తారు. ఇంకా స్థానిక ఐతిహ్యాలూ, పురాణ కథలను అనుసరించి కూడా ఆయా అలంకారాలు ఉంటాయి. ఎవరు ఏ పద్ధతిలో అమ్మవారిని అలంకరించినా అంతిమంగా కొలిచేది అమ్మనేననే విషయం మరిచిపోకూడదు. కాబట్టి రూపం కాదు.. ఆ రూపంలో దాగి ఉన్న దేవి ముఖ్యమని గమనించాలి.
నవరాత్రి పూజ అంటే..
మనకు ఏడాదిలో ఐదు నవరాత్రులు వస్తాయి. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవ రాత్రులు, పుష్య మాసంలో శాకంబరీ నవరాత్రులు, మాఘ మాసంలో గోప్య లేదా గర్భ నవరాత్రులు. వీటిలో దేవీ నవరాత్రులు చాలా ప్రశస్తమైనవి. ఇవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ కొనసాగినా.. హస్తా నక్షత్రం రోజున ఆరంభించి శ్రవణా నక్షత్రం నాటికి పరిసమాప్తం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కుదిరితే పది రోజుల పాటూ అమ్మవారికి పూజలు చేయొచ్చు. కుదరకుంటే చివరి ఐదూ లేదా మూడు రోజులు అమ్మవారిని ఆరాధించవచ్చు.
ఉపవాసం చేయాలా? నియమాలు పాటించాలా?
నవరాత్రి పూజను ఎవరికి వారు తమ ఇంటి ఆచారం ప్రకారం ఆచరించాలి. కలశం, అర్చామూర్తి, చిత్రపటం, శ్రీచక్రం.. ఇలా ఏ రూపాన్ని అయినా పూజించవచ్చు. జగన్మాతను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. ఇలా మూడు పూటలా పూజిస్తే మంచిది. కుదిరితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ అనంతరం భోజనం చేయవచ్చు. తొమ్మిది రోజులూ సాత్విక భోజనాన్ని స్వీకరిస్తూ, వస్త్రం పరుచుకుని పడుకోవాలి. పాదరక్షలు వేసుకోకూడదు. వీలైనంతగా మౌనాన్ని పాటిస్తూ ‘శ్రీమాత్రే నమ:’ అంటూ నిరంతరం అమ్మ నామజపంలో గడపాలి.
అమ్మవారికి శరన్నవరాత్రుల తొమ్మిది రోజులూ రోజుకో ప్రసాదం చేయాలనీ, దేవికి రోజుకో రంగు చీరను అలంకరించాలనీ అంటారు. ఇందులో ఎంత నిజముంది?
నిజానికి ఇది అపోహ మాత్రమే. దేవీ భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాల గురించి మాత్రమే చెప్పారు. అవి కూడా నవదుర్గల అలంకారాలతో ముడిపడినవే. అక్కడా కట్టుపొంగలి, పులిహోర, గుడాన్నం వంటివి మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు నైవేద్యాన్ని నివేదించవచ్చు. అమ్మ చూసేది నిశ్చయమైన భక్తినీ, నిర్మలమైన మనసును మాత్రమే..
కుంకుమ పూజ:
కుంకుమ రజో గుణానికి ప్రతీక. ఉంగరం వేలు కూడా రజో గుణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ వేలితో కుంకుమ తీసుకుని అమ్మ ఆర్చా మూర్తినీ లేదా శ్రీచక్రాన్ని పూజిస్తే లౌకికమైన సంకల్పాలనూ దేవి నెరవేరుస్తుందన్నది నమ్మకం.
లలితా సహస్ర నామం పఠించవచ్చా?
ఉపదేశం లేకుండా లలితా సహస్ర నామాన్ని పఠించకూడదనేది నియమం. కాబట్టి నవరాత్రి ఉత్సవాల్లో అందరితో కలిసి లలితా సహస్రాన్ని పారాయణం చేయొచ్చు. తండ్రి గురువుతో సమానం కాబట్టి, ఆయనకు మనసులోనే నమస్కరించి సహస్రనామ పారాయణం చేయవచ్చు.
నవరాత్రుల మధ్యలో నెలసరి వస్తే..
అలాంటి పరిస్థితి వస్తే పూజను మానాల్సిన పనిలేదు. ఇతర కుటుంబసభ్యులు పూజను కొనసాగించవచ్చు. వాళ్లు ఆ ఇంటి ఇల్లాలి తరహాలోనే పూజా పద్ధతులు అనుసరించకపోయినా బాధపడనక్కర్లేదు. పూజను కొనసాగిస్తే చాలు. జగన్మాత అయినా అమ్మే కాబట్టి పూజ సరిగా జరగలేదని భయపడాల్సిన పనిలేదు.
అలాంటి వారిని సువాసినులుగా పూజించవచ్చా?
వివాహమైనా భర్తకు దూరంగా ఉన్న మహిళలను పూజకు ఆహ్వానించవచ్చా? అనేది మరో సందేహం. నవరాత్రులు మహిళా సాధికారతకూ, శక్తికీ ప్రతీక. స్త్రీ అంటేనే శక్తి స్వరూపం. లలితా నామాల్లో ఒకచోట ‘శివదూత్యై నమ’ అని ఉంటుంది. అంటే అమ్మవారు మహిషాసురుడిని సంహరించేందుకు తన భర్త అయిన పరమేశ్వరుడినే దూతగా పంపి.. ఆ రాక్షసుడిని యుద్ధానికి ఆహ్వానిస్తుంది. కాబట్టి సాటి మహిళను శక్తిస్వరూపంగా భావించి నవరాత్రి పూజలకు ఆహ్వానించవచ్చు. దసరా ఉత్సవాలనే కాదు.. మన పండుగలు, పర్వాలన్నీ ఆత్మవిశ్వాసాన్నీ, మనోబలాన్నీ, లోకకల్యాణాన్నీ కాంక్షించేవే. కాబట్టి అమ్మను ఆరాధించే విషయంలో చిత్తశుద్ధి ముఖ్యం. ఎలాంటి అపోహలకూ, భేషజాలకూ తావివ్వకూడదు.
ఆది పరాశక్తి, అపరాజితాదేవి అయిన దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో కొలిచే దసరా పండుగలో అడుగడుగునా మహిళా శక్తి ప్రతిబింబిస్తుంది. దసరా సమయంలో మన దేశంలో కనిపించే విభిన్న సంప్రదాయాలు, వేడుకలు నారీ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంటాయి.
ఆడపిల్లను అరిష్టంగా, భారంగా భావించే తల్లిదండ్రులు నేటికీ చాలామంది ఉన్నారు. అలాంటి వారికి దసరా సందర్భంగా నిర్వహించే ‘కన్యా పూజ/కుమారి పూజ’ కనువిప్పు కలిగిస్తుంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చాలాచోట్ల నిర్వహించే ఈ పూజలో బాలికలనే అమ్మవారిగా ఎంచి కొలవడం ఆనవాయితీ. శరన్నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రెండు రోజులు.. అంటే అష్టమి, నవమి రోజుల్లో ఈ కన్యా పూజ చేస్తారు. రజస్వల కాని 3 – 12 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలను ఎంచుకుని, వారికి చక్కగా స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి ఆభరణాలతో అమ్మవారిగా అలంకరిస్తారు. కొన్నిచోట్ల తొమ్మిది మంది అమ్మాయిలను ఎంచుకుని నవదుర్గలుగా పూజించడం ఆనవాయితీ. కొన్నిచోట్ల బాలికకు పూజలు చేశాక, డోలీలో ఊరేగిస్తూ ఆమె కాళ్లు కడగడం సంప్రదాయం. చివరిగా బాలిక రూపంలో కొలువుదీరిన అమ్మవారికి ప్రీతిపాత్రమైన వంటకాల్ని సమర్పించి, సాక్షాత్తూ ఆ దుర్గామాతనే ప్రసన్నం చేసుకున్నట్టు అనుభూతి చెందుతారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బాలా త్రిపురసుందరీ దేవి అవతారం రోజున బాలికలను అమ్మవారిగా భావించి, వారికి వాయనం ఇవ్వడం చూస్తుంటాం. ఇలా చిన్నతనం నుంచే ఆడపిల్లల్ని గౌరవిస్తూ, వారికి ప్రాధాన్యమిస్తూ పెంచడం వల్ల వారు శక్తిమంతంగా, స్వతంత్రంగా ఎదుగుతారని, ఫలితంగా సమాజాన్ని చైతన్యపరుస్తారనేది దసరా వేడుకలోని ఈ కన్యాపూజ సందర్భంగా స్ఫురిస్తుంది.
భార్య క్షేమాన్ని కాంక్షించి భర్త చేసే పూజ, వ్రతం ఉందో లేదో కానీ భర్త క్షేమం, కుటుంబవృద్ధి కోసం ఆడవారు జరుపుకునే వేడుకలు చాలానే ఉన్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే ‘సింధూర్ ఖేలా’ కూడా అలాంటి వేడుకే. తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మవారికి నిమజ్జనం చేసే రోజున నిర్వహించుకునే ఈ ఉత్సవశోభ పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోనూ అరుదుగా కనిపించే ఈ ఆటను అతివలు ఎంతో సరదాగా ఆడుతుంటారు. పెళ్లయిన మహిళలు తెలుపు, ఎరుపు రంగులు కలగలసిన చీరలు ధరించి, ఒక్కచోట చేరి ఒకరికొకరు పాపిట్ల కుంకుమతో బొట్టు పెడతారు. మరికొందరు బుగ్గలకూ కుంకుమ పులుముకుంటూ ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందిస్తారు. తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆజన్మాంతం తాము ముత్తయిదువగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటారు. అలాగే పిల్లలు క్షేమంగా, కుటుంబం ఎలాంటి లోటూ లేకుండా సుఖసంపదలతో తులతూగాలని ప్రార్థిస్తారు. మొత్తంగా ఈ వేడుక మహిళలు తమ కుటుంబ సంక్షేమానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని తెలుపుతుంది. మహిళలను మరింత ప్రోత్సహిస్తే చుట్టూ ఉన్న సమాజం, దేశం.. రెండూ అభివృద్ధి చెందుతాయని చెప్పకనే చెబుతుందీ వేడుక.
ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాబల్యం గల బస్తర్ ప్రాంతంలో 75 రోజుల పాటు నిర్వహించే దసరా పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఉత్సవం సందర్భంగా వందల ఏళ్ల నాటి సంప్రదాయాలను నిక్కచ్చిగా పాటిస్తారు. అందుకే ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తుతారు. 75 రోజుల ఈ వేడుకలో 14కిపైగా ప్రత్యేకమైన, ఆసక్తికరమైన ఆచారాలు నిర్వహిస్తారు. వీటిలో అత్యంత ఆకర్షణీయమైనది- ‘ఫూల్ రథ పరిక్రమ’. ఇది నవరాత్రి మూడో రోజు నుంచి ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. దీని వెనుక పెద్ద చరిత్ర ఉంది.
బస్తర్ యువరాణి చమేలి బాబి ధైర్యసాహసాలకు ప్రతీక. చిత్రకూట్ రాజు హరిశ్చంద్ర నాలుగో సంతానమే చమేలి బాబి. ఆమె చాలా అందగత్తె. విద్య, కత్తిసాములో దిట్ట. ఆమె తన తండ్రి హరిశ్చంద్రతో పాటు యుద్ధభూమిలో తెగువ, ధైర్యం ప్రదర్శించి మన్ననలు పొందింది. ఈమె గురించి వరంగల్ రాజు అన్నమదేవ్ తెలుసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. అందుకు అంగీకరించకుంటే హరిశ్చంద్ర రాజ్యంపై దాడి చేస్తానని బెదిరించాడు. చమేలి మాత్రం అన్నమదేవ్తో పెళ్లికి నిరాకరించింది. దీంతో అన్నమదేవ్ దాడికి దిగాడు. ఈ యుద్ధంలో హరిశ్చంద్ర ప్రాణాలు విడిచాడు. తండ్రి మరణవార్త విన్న యువరాణి చమేలి తన రాజ భవనంలో ఏర్పాటు చేసిన కట్టెల చితిలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంది. ఆమె ధైర్యసాహసాలకు, తెగువకు ప్రతీకగా అప్పటి నుంచి బస్తర్‌లో 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతాయి.
ఏటా బస్తర్‌లో దసరా సందర్భంగా చమేలి బాబి పేరుపై జ్యోతి కలశాన్ని ఏర్పాటు చేస్తారు. దానికి పువ్వులను సమర్పిస్తారు. ఎరంద్వాల్ గ్రామానికి చెందిన పైగాడ్ కుటుంబం ఈ సంప్రదాయాన్ని చాలా ఏళ్లుగా పాటిస్తోంది. ఈ పువ్వులను నవరాత్రుల తొమ్మిదో రోజు ఇంద్రావతి నదిలో కలుపుతారు. అవి నదిలో ప్రవహించి చిత్రకూట్ చేరుకుంటాయని నమ్ముతారు. ఈ పువ్వులు సమాధి దగ్గరకు వెళ్లినపుడు చమేలి బాబి వాటిని స్వీకరిస్తుందని స్థానికులు చెబుతారు. ఇదే సందర్భంగా ‘ఫూల్ రథ పరిక్రమ’ యాత్ర నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం 600 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. నేటికీ ముండా కులానికి చెందిన ప్రజలు తలపాగాలు ధరిస్తారు. తరువాత ఎర్రని వస్త్రం పట్టుకుని రథం కింద నిలుచుంటారు. రథం నుంచి పూలగుత్తిని విసిరినప్పుడు దానిని పట్టుకుని కలశంలో వేస్తారు. చివరగా వాటన్నిటినీ ఇంద్రావతి నదిలోకి వదులుతారు. రథయాత్ర ఆరు రోజుల పాటు కొనసాగుతుంది.
అమ్మవారు శక్తి స్వరూపిణి. సృజనకు ఆమె ప్రతిరూపం. ఆ ప్రతిరూపానికి ప్రతీకలు మన మహిళలు. దసరా ఉత్సవాల్లో నిర్వహించే బొమ్మల కొలువు, బతుకమ్మ సంబరాల్లో పూల పేర్పు మహిళల్లోని సృజనాత్మక శక్తిని మేల్కొలుపుతుంది. తెలంగాణ సంస్క•తీ సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాల్లో తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చడం ద్వారా మహిళలు తమలోని సృజనాత్మక శక్తిని చాటుకుంటారు. ఇంకా బతుకమ్మ ఉయ్యాల పాటల్లోనూ స్త్రీత్వం, మహిళా శక్తి ప్రతిబింబిస్తాయి. వివిధ రకాల బొమ్మలతో, విభిన్న థీమ్స్‌తో తీర్చిదిద్దే బొమ్మల కొలువుల్లో అతివల్లో అంతర్లీనమైన సృజనాత్మకతను వెలికితీస్తుంది. ఈ శక్తి వారికి స్వతహాగా అమ్మవారి నుంచి వచ్చిందే!.
దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తాం. ధైర్యాన్నిచ్చే దుర్గామాతగా, సంపదనిచ్చే లక్ష్మీదేవిగా, జ్ఞానాన్ని అందించే సరస్వతిగా, ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవిగా.. ఇలా అమ్మకు లెక్కలేనన్ని రూపాలు. అయితే జ్ఞానం, సంపద, అన్నపానీయాలు, ధైర్యం.. మనం మనుగడ సాధించాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. అందుకే వీటికి ప్రతిరూపాలైన అమ్మవారిని పూజించడం, మహిళలను గౌరవించడం ప్రాచీన కాలం నుంచే ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ఏ కాలంలోనైనా సరే.. స్త్రీలకు గౌరవం దక్కేలా చూడటం ప్రతి ఒక్కరి ధర్మం అని దసరా పండుగ చాటుతుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ శక్తియుక్తులతో, ధైర్యసాహసాలతో మహిళలు ఈ లోకాన్ని రక్షిస్తారనేది ఈ పండుగలోని పరమార్థం. మహిళా శక్తిని గుర్తించి, గౌరవించి, ప్రోత్సహిస్తే వారు ఈ సమాజానికి అండగా నిలిచి, ఎలాంటి పరిస్థితుల నుంచైనా గట్టెక్కించగలరనడానికి దసరా పర్వం ఒక ఉదాహరణ. మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు చాటిన సత్యమిదే.
దేవతామూర్తులు విగ్రహాల రూపంలో ఆలయాల్లో దర్శనమిస్తుంటారు. కానీ, జ్వాలాముఖి ఆలయంలో జగన్మాత జ్యోతి రూపంలో కొలువుదీరి పూజలందుకుంటోంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న కాళీధర్ శిఖరంపై ఉంది. ఎలాంటి నూనే లేకుండానే ఈ ఆలయంలోని జ్యోతి తొమ్మిది చోట్ల సహజంగా వెలుగుతూ కనిపిస్తుంది. 51 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ గుడిలో దక్షయజ్ఞ సమయంలో సతీదేవి నాలుక పడిందని ప్రతీతి. ఈ ఆలయాన్ని రాజా భూమిచంద్ నిర్మించాడట. ఈ ఆలయంలో జ్వాలలు ఎలా వస్తున్నాయనేది తెలుసుకునేందుకు ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ, కనిపెట్టలేకపోయారు. తన పాలన సమయంలో ఈ జ్వాలలు పట్టణాన్ని కాల్చేస్తాయనే భయంతో అక్బర్ చక్రవర్తి వాటిని ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట. దీంతో అమ్మవారి మహిమను గుర్తించి ఆలయానికి బంగారు గొడుగును కానుకగా అర్పించాడని చెబుతారు. ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అఖండ జ్యోతిని దర్శించేందుకు దేశం నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తారు.






























































































Review ‘దుర్లభా.. దుర్గమా.. దుర్గా..’.