ఆది దైవం జగన్మాత

ఆది దైవం జగన్మాత

అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ. శరత్కాలం నిర్మలత్వానికీ, శరశ్చంద్రుడు ప్రశాంతతకు ప్రతీకలు. అలాగే నిర్మలమైన ప్రేమ, కరుణను కురిపించే చల్లని మనసు మాతృమూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి, నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. ‘నవ’ సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. తొమ్మిది సంఖ్యకు ప్రతిరూపమైన ‘శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి’- ఈ నవదుర్గలను అర్చించి జీవితంలో పరిపూర్ణత్వాన్ని సాధించుకోవాలనేది నవరాత్రి ఉత్సవాల్లోని అంతరార్థం. దుర్లభమైన మానవజన్మను సార్థకం చేసుకోవాలంటే అశాశ్వతమైన ఈ దేహంలో అంతర్గతంగా ఉన్న శాశ్వతమైన ఆత్మశక్తిని గ్రహించాలి. జనన మరణాతీత స్థితిని చేరుకోవాలి. అప్పుడే మానవజన్మకు పరిపూర్ణత్వం సిద్ధించినట్టు. అయితే, ఈ పరిపూర్ణతను సాధించడానికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు అవసరం. సర్వజీవుల్లో శక్తిగా నెలకొని ఉన్న ఆ సర్వేశ్వరుడిని ఆరాధిస్తే మానవజన్మ పరిపూర్ణత్వానికి కావలసిన సర్వ శక్తులూ సమకూరుతాయి. అమ్మ ప్రేమామృతధారలతో అమరత్వం సిద్ధిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది. మోక్షప్రాప్తికి ఈ దేహాన్నే ఒక సాధనంగా చేసుకోవాలి. నవదుర్గల కృప మనకు దక్కాలంటే మనకు జన్మనిచ్చిన తల్లిని పూజించాలి. తల్లి ఆశీర్వాదమనే తాళపు చెవి లేనిదే ఈ జగన్మాత కూడా మోక్ష ద్వారాలను తెరవదు. కాబట్టి మానవజన్మ పరిపూర్ణతకు మాతృమూర్తి దీవెనలు అత్యంత ముఖ్యం. మనకీ మానవ దేహాన్ని ప్రసాదించిన మాతృమూర్తియే ఇలలో వెలసిన ఆ జగన్మాతకు ప్రతిరూపం.
ఈ సృష్టికి ముందే జగన్మాత సర్వానికీ తల్లి. తొలి దైవం. సృష్టి కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా పురుషరూపం దాల్చేది ఆమే. పరిభ్రమించే శతకోటి సూర్యగోళాల ప్రస్థానానికి పరమావధి ఆమె. వేద స్వరూపిణిగా వెలిగే ఆమెను వేదవేత్తలైనా పూర్తిగా గ్రహించలేరు. వేదాలన్నీ ఆమె నుంచే ప్రాదుర్భవించాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇతర దేవతలు, రుషులు, ఎవరూ ఆమె సముజ్జ్వలమైన మహిమను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆమె ఒకేసారి మూడు భూమికల్లో భాసిస్తుందంటారు. సకల లోకాలకు అతీతంగా నిలబడి ఈ సృష్టిని పరాత్పరుని అవ్యక్త మహస్సుతో అనుసంధానించేది ఆమేనని విశ్వసిస్తారు. విశ్వజనీనమైన నిఖిల మహా శక్తిగా ఆమె సర్వ జీవరాశిని సృష్టించి, లక్షలాది ప్రాకృతిక పక్రియలను నడుపుతుందని అంటారు. సృష్టి రూపంగా ఆ శక్తుల్ని తనలో రాశీభూతం చేసి, మానవ వ్యక్తిత్వానికి, దైవత్వానికి నడుమ సంధానకర్తగా పనిచేసే ఆమె సర్వోన్నత దైవం.

Review ఆది దైవం జగన్మాత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top