ఆధ్యాత్మిక జీవన

పరమార్థం ఎలా బోధపడుతుంది?
ఒక్కోసారి అనుభవమే దానిని బోధిస్తుంది. కొన్నిసార్లు లోతుగా తత్త్వ విచారణ సాగించడానికి గురువులే బోధించాల్సి ఉంటుంది. ఇంకొన్నిసార్లు చాలా సాధారణ వ్యక్తులే మనకు స్ఫూర్తిగా నిలిచి పరమార్థం బోధిస్తారు.
మనల్ని చుట్టుముట్టే ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలెన్నెన్నో. వాటి వెనుక ఉన్న పరమార్థం తెలుసుకుంటేనే జీవనం అర్థవంతమవుతుంది. లేదంటే వ్యర్థంగా మిగులుతుంది. ఇనుము కాలినప్పుడే వంగుతుంది. ఏ రకమైన ఆకృతి కావాలంటే అలా మారుతుంది. మనిషి కూడా సంసారమనే సాగరంలో పడి అలసి విసిగిపోయిన పరిస్థితుల్లోనే ఇహలోక విషయాలపై విరక్తి చెందుతాడు. విముక్తి కోసం దేవుడిని వేడుకుంటాడు. అంతవరకు ఎవరెన్ని చెప్పినా పెడచెవిన పెడతాడు. వైరాగ్యంలో ఉన్నప్పుడే ఆధ్యాత్మిక సాధన వైపు దృష్టి మరలుతుంది. ఏమాత్రం చేయూత దొరికినా తన మనో దౌర్భల్యం నుంచి బయటపడతాడు. మనకు ఆ సమయంలో ఆధ్యాత్మిక బాటలో నడవడానికి సోపానాలై ఉపయోగపడేవి తత్త్వోపదేశాలే. వాటిని చదవడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. వాటిని చదివి, చదివిన దానిని అర్థం చేసుకుని ఆచరిస్తేనే అర్థం.. పరమార్థం..
ఆధ్యాత్మికంలో మనలో కలిగే ఊహలను అలాగే వదిలేయకూడదు. ఏదైనా సందేహం కలిగినా, అనుమానం వచ్చినా వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక లక్ష్యం మనకు బోధపడాలంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి. అంతరంగంలోకి లోతుగా వెళ్లి ఆత్మశోధన చేసుకోవాలి. అప్పుడే ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గిపోతుంది. ‘నేను’, ‘నా’ అనే భావాలు సమసిపోయినపుడు చైతన్యం వికసిస్తుంది. అదే పరమార్థాన్ని బోధిస్తుంది.
ఇదే పరమార్థం. ఇదే జ్ఞానం అనే నిర్వచనాలు ఎక్కడా లభించవు. ఇవి అభ్యసన, అధ్యయనం, నిరంతర ఆధ్యాత్మిక సాధన, అనుభవం, గురు బోధనల ద్వారా మాత్రమే లభిస్తాయి. మన పురాణేతిహాసాల్లోని పరిహాసాలు కూడా ఎంతో ప్రబోధాత్మకంగా, భావగర్భితంగా ఉంటాయి. అవి ఒకవైపు నవ్వు పుట్టిస్తూనే మరోవైపు మనసును తేలికపరిచి నెమ్మదిగా సత్యం వైపు మళ్లిస్తాయి. మనసును సమస్థితిలో, ఆనందస్థితిలో ఉంచుతాయి. పరిహాసాల్లోని పరమార్థాన్ని వ్యాసుడు, వాల్మీకి, షిర్డీ సాయినాథుడు వంటి వారు ఎంతో చాకచక్యంగా, చమత్కారంగా బోధించారు.
వనవాసానికి బయల్దేరే ముందు రాముడు వృద్ధులకు, పేదలకు పలు దానాలు చేశాడు. ఆ సమయంలో త్రిజటుడు అనే ముసలి బ్రాహ్మణుడు రాముడిని యాచిస్తాడు. అప్పుడు రాముడు పరిహాసానికి ఇలా అంటాడు-
‘త్రిజటుడా! నీ చేతిలోని కర్రను నువ్వు ఎంత దూరం విసురుతావో అంతవరకు గల ప్రదేశంలో ఉన్న ఆవులన్నీ నీకు ఇస్తాను’. త్రిజటుడు తన సమస్తశక్తిని కూడదీసుకుని తన చేతిలోని కర్రను బలంగా తిప్పి విసురుతాడు. ఆ కర్ర సరయు నది ఒడ్డు దాటి ఆవుల మందలో పడింది. రాముడు త్రిజటుడిని కౌగిలించుకుంటాడు.
‘త్రిజటా! నాపై కోపగించుకోకు. నిన్ను ఇలా కర్ర విసరమనడం పరిహాసానికే సుమా!’ అంటూ మధ్య ప్రదేశంలో ఉన్న గో సమూహాన్ని అంతటినీ అతనికి ఇచ్చివేశాడు.
నిజానికి అది రాముడు ఉన్నవన్నీ వదులుకుని వనవాసానికి వెళ్లిపోతున్న సమయం. అటువంటి వేళలోనూ ఎంతో గంభీరమూర్తి అయిన రాముడు తాను కష్టాల్లో ఉన్నప్పటికీ మనసును ఉల్లాసంగా ఉంచుకోవడానికి ఇలా హాస్యరసాన్ని పండించాడు. ఆ ఆనందాన్ని మనకూ పంచాడు. మనసును కష్టాల్లోనూ, నష్టాల్లోనూ కూడా సదా ఆనందంగా ఉంచుకోవాలి. అప్పుడే మనసులోకి సద్బుద్ధులు ప్రవేశిస్తాయి.
ఇక, పై లీలలో మరో గొప్ప నీతి కూడా ఇమిడి ఉంది. అదేమిటంటే..
‘‘లోకులు ధనాశ చేత తమలో లేని శక్తిని కూడా తెచ్చుకుని బయటపెడతారు’’
అదే శక్తిని.. మనలోని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలికి తీయడానికి ఉపయోగిస్తే జీవనం అర్థవం

Review ఆధ్యాత్మిక జీవన.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top