చిత్రకారుడు రోదిస్తూ బొమ్మలు గీయడు.
శిల్పి దుఃఖిస్తూ శిల్పాన్ని చెక్కడు.
నృత్యకారుడు విలపిస్తూ నాట్యం చేయడు.
గాయకుడు బాధపడుతూ గీతాన్ని ఆలపించడు.
సంగీతకారుడు కుమిలిపోతూ సంగీతాన్ని వినిపించడు.
కవి బరువెక్కిన గుండెలతో కాదు.. తేలికైన హృదయంతోనే తన రచనలకు రూపునిస్తాడు.
ఇంకా ఎందరో.. తమ కళలు, వృత్తి పనుల్లో నిమగ్నమైన వారు ఆనందంతోనే ఆయా పనులను ఆవిష్కరిస్తారు.
ఎందుకంటే ఏదైనా పనిలో ఉన్నవారు ఆ పనిలో నిమగ్నమవుతారు. అది బ్రహ్మానంద క్షేత్రం. అందులో ఉండేది కేవలం ఆనందమే.
ఆ ఆనందంలో మనిషి సృజనాత్మకంగా ఉంటాడు. ఆ సృజనాత్మకత నుంచే మరిన్ని నూతన ఆవిష్కరణలను కనిపెట్టే శక్తి పుడుతుంది.
అంటే, దీనిని బట్టి అర్థమయ్యేదేమిటంటే.. మనిషి ఆనందంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు.
దుఃఖంలో మునిగితేలితే మరింత అథ పాతాళానికి, చీకట్లోకి జారిపోతాడు.
దుఃఖం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిది.
అందులోని ఒక భాగం మనిషిని ప్రక్షాళన చేసి పునీతుడిగా మారుస్తుంది. అది అతని సహజ శ్రేయస్సుకు దోహద పడుతుంది. మరో భాగం అతని వ్యక్తిగత జీవన వినాశనానికి దారి తీస్తుంది. దుఃఖంలో కూరుకుపోయిన వ్యక్తి భవిష్యత్తును చూడలేడు. వర్తమానంలో బతకలేడు.
కాబట్టి మనిషి దుఃఖం, విచారం వంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
జీవితం అంటేనే కష్టసుఖాల, ఆనంద విషాదాల కలయిక. వీటిలో దేని నుంచీ ఏ మనిషీ తప్పించుకునిపోలేడు. ఏదీ ఏ మనిషినీ వదిలిపెట్టదు. ఎప్పుడు ఏది కలిగితే (ఆనందం- విషాదం, కష్టం- నష్టం) దానిని అనుభవించి తీరాల్సిందే.
జీవితంలో దుఃఖం కలిగించే సందర్భాలు, సంఘటనలు అనేకం ఉంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలే కానీ, వాటి దుష్ప్రభావానికి బలి కాకూడదు. వాటికి లొంగిపోయి కుంగిపోకూడదు.
మనిషి నిరంతరం దుఃఖం, విచారం వంటి వాటిల్లోనే మునిగి తేలితే అది క్రమంగా బలహీనుడిని చేస్తుంది. ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఉంది. ఫలితంగా అతనితో పాటు అతని కుటుంబానికి, సమాజానికి కూడా ఆ మనిషి భారంగా మిగిలిపోతాడు.
బాధ అయినా, దుఃఖమైనా కేవలం ఒక స్థితి మాత్రమే.. కొన్నాళ్లకు అవి సమసిపోతాయనే ఎరుక కలిగి.. నిరంతరం ఆనందంగా ఉండగలిగితే ఈ జీవితం ఫలప్రదమవుతుంది.
అందుకే సంతోషమే.. మనిషికి పరిపూర్ణ బలం. పరిపూర్ణ విజయం.
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review ఆనందో బ్రహ్మ.