గురువుబాటలో నడిస్తేనే గురి

జీవితంలో ఏ విషయం గురించైనా అతిగా తాపత్రయపడితే మిగిలేవి ఆవేదన, ఆందోళనలే. ఈ లోకంలో అందరికీ వారి వారి స్థాయిని బట్టి జీవించడానికి భగవంతుడు అవకాశాలను ఇచ్చాడు. అవసరాలకు సరిపడా డబ్బున్నా ఇంకా లేనిపోని కీర్తి ప్రతిష్టలు, హోదా, గుర్తింపు కోసమంటూ మనిషి తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఈ కోరికలను తీర్చుకునే క్రమంలో జీవితాలు అశాంతిమయం అవుతున్నాయి.

‘ప్రాపంచిక గౌరవాలను అందుకోవాలనే తాపత్రయాలను వీడండి. కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడకండి. దైవం దర్బారులో చోటు సంపాదించేందుకు పాటు పడండి’ అని షిర్డీ సాయిబాబా ఉద్బోధించారు.
కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతుల గురించి ఆరాటపడటం అర్థం లేని పని. మనం చేసే మంచి పనుల ద్వారా భగవంతుని హృదయంలో చోటు సంపాదించాలని ఆత్రుత పడటంలో అర్థం ఉంది. నిజానికి ఈ కోరిక సర్వోత్క•ష్టమైనది. అటువంటుది వదులుకుని నలుగురి మెప్పు కోసం బతికే బతుకు మన చేతుల్లో ఉండదు.

బావిలో ఊట మాదిరిగా ఒక కోరిక తీరిన తరువాత మరో కోరిక పుడుతూనే ఉంటుంది. వాటికి ఆదీ అంతమూ ఉండదు. చివరికి జీవిత కాలం అంతా వ్యర్థ కోరికల్ని నెరవేర్చుకుంటూ పోవడంతోనే గడిచిపోతుంది.
మానవజన్మ పరమార్థం దైవ సాక్షాత్కారాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కోసమేనని బాబా ఉద్బోధించారు. అందుకోసమే ఈ శరీరాన్ని వినియోగించాలి. కానీ, ప్రస్తుతం ఈ పరమార్థానికి అర్థం మారిపోయింది. ‘అర్థం’ (ధనం) అందరి ధ్యేయమైంది. దానిని ఆర్జించడంలోనే జీవితాలు మొదలై ముగిసిపోతున్నాయి.

‘నా ఖజానా నిండుగా ఉంది. ఎవరికి కావాల్సిన ధనాన్ని వారు బండ్లకొద్దీ తీసుకుపోండి’ అని సమర్థ సద్గురు బాబా ఆహ్వానిస్తున్నారు. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే బాబా తీసుకు వెళ్లమంటున్న ధనం ఆధ్యాత్మిక జ్ఞాన సంపద. ఈ రోజుల్లో ఎవరికీ దీనితో పనిలేకుండాపోయింది. తెల్లారింది మొదలు చీకటి పడే వరకు అందరివీ ఉరుకులు పరుగులే. మనిషి తాను బతకడం కోసమే పోగేస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ, నిజానికి మనిషి మూటగట్టుకుంటున్నది ధనంతో పాటు ఆందోళనలు, ఆవేదనలే.
మనుషుల మనస్తత్వాలు ఇలా ఉన్నాయనే కాబోలు సద్గురువైన బాబా ఇలా ఉద్బోధిస్తున్నారు-
‘నేనేం చెబుతున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. మీరు సంపాదించుకున్నది మీతోనే అంతమైపోతుంది. సుపుత్రుడైన వాడు నా మాట విని నేనిచ్చే ధనా (ఆధ్యాత్మిక, జ్ఞాన సంపదలు)న్ని తీసి జాగ్రత్త పెట్టుకుంటాడు. అటువంటి వారే భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు’.

ఐశ్వర్యమేదే వచ్చి ఒళ్లో పడుతుందని ఆరాటపడటం, అతిగా సంపాదించాలని ఆత్రుత పడటం కన్నా ఉన్న దానిని అనుభవించడం నేర్చుకుంటేనే జీవితంలో ఆనందం, తృప్తి లభిస్తాయి.

Review గురువుబాటలో నడిస్తేనే గురి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top