ఆషాఢ మాసం నుంచి వర్ష రుతువు ప్రారంభమవుతుంది.
సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒకచోట ఎక్కువ కాలం గడపరు.
కానీ, వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బంది కలగడమే కాక, వ్యాధులు సోకడానికి అవకాశం ఎక్కువ. అందుకే సాధారణంగా సన్యాసాశ్రమం స్వీకరించిన వారు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్యం పాటిస్తారు.
అంటే, తాత్కాలికంగా ఎక్కడో ఒకచోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయడానికి వస్తారు.
ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు గురుపూజ చేసేవారు.
ఆ ఆచారం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురుపౌర్ణమి అయ్యింది.
తస్మై శ్రీ గురువే నమః
హలం పట్టుకున్నా.. కలం పట్టుకున్నా నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలిసి వస్తాయి. ఆ నేర్పించే వాడే గురువు.
లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే.
గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకత్
‘గు’ అంటే చీకటి.
‘రు’ అంటే దానిని హరించే వాడు.
అంటే అజ్ఞానమనే అంధకారాన్ని హరించే వాడే గురువు.
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః
‘అజ్ఞానమనే చీకటి చేత అంధులైన వారికి జ్ఞానమనే అంజనాన్ని పూజి, కన్నులు తెరిపించిన గురువులకు నమస్కారం’ అని పై శ్లోకానికి భావం.
సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు.
గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు.
ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువును స్మరించుకుని, గౌరవించుకునే దినమే గురుపౌర్ణమి.
ఈ రోజున గురువులను పూజించాలి. ఆరాధించాలి. వారి ఆశీర్వాదం పొందాలి.
వినమ్రత అనే గురుదక్షిణను సమర్పించాలి.
మన జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఈనాడు గురువులను యథాశక్తి కొలుస్తారు.
(జూలై 13, బుధవారం ఆషాఢ శుద్ధ పూర్ణిమ.. గురుపూర్ణిమ సందర్భంగా విశేష కథనాలు లోపలి పేజీల్లో..)
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు
Review గురువే దైవమని...