మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:

గురు పరంపరకు ఆద్యుడు దక్షిణామూర్తియేనని అంటారు. ఆయన సాక్షాత్తూ పరమశివుని జ్ఞానగురువు అవతారం. సాధారణంగా గురువులు శిష్యుల సందేహాలను మాటల ద్వారానూ, బోధనల ద్వారానూ తీరుస్తారు కదా! కానీ, దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను తీరుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మొదల సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను పుట్టించాడు. తను నిర్వర్తించే సృష్టి కార్య బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారికి ఆ పని ఇష్టం లేకపోయింది.
‘మేం బ్రహ్మజ్ఞానులం కావాలని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు అప్పగించిన పని చేయలేం’ అని నిరాసక్తత వ్యక్తం చేస్తారు.
వీరు నలుగురూ తమకు బ్రహ్మజ్ఞానం బోధించే గురువు ఎవరా? అని అన్వేషణకు బయల్దేరారు. అలా వీరు గురువు కోసం వెతుకుతూ నారదుడిని కలుస్తారు.
ఆయన సలహాతో, అదేదో బ్రహ్మ గారినే అడుగుదామని ఆయన వద్దకు వెళ్తారు. కానీ ఆయన పక్కన సరస్వతీదేవి ఉండటం చూసి, ‘ఈయనే సంసారంలో ఉన్నాడు. ఇక మనకేం బ్రహ్మజ్ఞానం నేర్పుతాడు?’ అనుకుని విష్ణువు, శివుడి వద్దకు వెళ్తారు. వీరిద్దరూ కూడా భార్యలతో ఉండటంతో తమకు బ్రహ్మజ్ఞానం నేర్పాలని అడగరు.
వీరి అజ్ఞానాన్ని గమనించి శివుడు తనలో తానే కించిత్తు బాధపడతాడు. వీరు నలుగురికీ ఎలాగైనా బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని నిశ్చయించుకుని, వారు వెళ్లే దారిలో ఒక మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి అవతారంలో వెలిశాడు. సనక, సనంద, సనత్సుజాత, సనత్కుమారుడు అటుగా వెళ్తూ దక్షిణామూర్తిని దర్శించి, ఆయన తేజస్సుకు ఆకర్షితులవుతారు. ఆయన చుట్టూ కూర్చుని తమకు బ్రహ్మజ్ఞానం నేర్పాలని వేడుకుంటారు. ఆయన మౌనంగానే వారికి బ్రహ్మజ్ఞానం బోధించారు. దక్షిణామూర్తి అలా మౌనంగానే ఎందుకు బోధించారంటే.. బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందని వాడు కాబట్టి అలా బోధించారు.

భారతీయ సంప్రదాయం గురువు లేదా ఆధ్యాత్మిక గురువుకు ప్రత్యేక స్థానాన్ని, గౌరవాన్ని ఇస్తుంది. హిందూ విశ్వాస వ్యవస్థలో దక్షిణామూర్తిని అంతిమ గురువుగా పరిగణిస్తారు. ఆయన బొటన వేలు భగవంతుడిని, చూపుడు వేలు మనిషిని సూచిస్తుంది. బొటనవేలు, చూపుడు వేలు కలిసి వృత్తాకారంలో ఉంటాయి. బొటనవేలి సాహాయ్యము లేనిదే మిగిలిన వేళ్లు ఏ పని చేయడానికి సమర్థత కలిగి ఉండవు. మిగిలిన మూడు వేళ్లు మనిషి మూడు పుట్టుకలతో వచ్చే మలినాలను సూచిస్తాయని అంటారు. ఆ మూడు పుట్టుకల మలినాలు- గత జన్మల అహంకారం, భ్రమ, చెడుపనులు. అలాగే ఇవి సత్త్వరజస్తమో గుణాత్మకమైన సంసారానికి ప్రతీకగానూ చెబుతారు.
మన చూపుడు వేలు బొటనవేలుకు దూరంగా మిగిలిన మూడు వేళ్లతో కలిసి ఉంటుంది. అంటే, జీవుడు ఈశ్వరుడి నుంచి సకల శక్తులు పొందుతున్నప్పటికీ తాను ఆ ఈశ్వరుడికి దూరంగా సంసారంలో నిమగ్నుడై ఉంటాడని భావం. కానీ, సాధకుడు సంసారానికి దూరంగా జరిగి ఈశ్వరునిపై మనసు నిలిపి ఉంచాలి. చూపుడు వేలు బొటనవేలుతో కలవడం అంటే ఇదే. కాలక్రమంలో అటువంటి సాధకుడు పరిశుద్ధమైన అంత:కరణ కలిగి, ఈశ్వరుడికి, తనకు గల అభేదమును గుర్తిస్తాడు. ఈ రెండు వేళ్లు కలిసి ఒకే వృత్తంగా ఏర్పడటం అంటే అది జ్ఞానానికి, పూర్ణతకు చిహ్నం.
దక్షిణామూర్తి అనే పేరుకు ‘జ్ఞానం’ అనే అర్థం ఉంది. ఆయన పూర్తిగా జ్ఞానాన్ని పొందిన ధ్యాన దైవం. ఎవరైనా తమకు గురువు లేకుంటే వారు దక్షిణామూర్తిని తమ గురువుగా భావించి పూజించవచ్చు.

దక్షిణామూర్తి అంటే, దక్షిణముఖంగా ఉన్నవాడు అని అర్థం. సంస్క•త అర్థం ప్రకారం ‘దాక్షిణ్య’ అని భావం. దాక్షిణ్యం అంటే కరుణ లేదా దయ అని అర్థం. అంటే, ఈయన జ్ఞానాన్ని పొందాలని తపించే వారికి మౌనంగానే దాన్ని దయచేస్తారు. ఆయా దేవాలయాల్లో దక్షిణామూర్తి విగ్రహాన్ని దక్షిణాముఖంగా ప్రతిష్ఠిస్తారు. బహుశా హిందూ దైవాలలో దక్షిణ ముఖంగా కొలువుదీరేది ఈయన ఒక్కరే.
జ్ఞాన దక్షిణామూర్తిగా పిలిచే ఈయన నాలుగు చేతులతో కనిపిస్తారు. ఆయన ఒక మర్రిచెట్టు కింద దక్షిణం వైపు కూర్చున్నట్టుగా ఉంటారు. జింక చర్మం ఆయన సింహాసనం. చుట్టూ నలుగురు శిష్యులు ఆయన ఉపదేశాన్ని వింటున్నట్టుగా ఉంటారు. అజ్ఞాన స్వరూపమైన ఒక అసుర రూపం ఆయన పాదాల కింద అణగదొక్కి ఉంటుంది. ఆయన ఎడమ పాదం ఆయన ఒడిలో ముడుచుకుని ఉంటుంది. మరికొన్ని జంతువులు కూడా ఆయన చుట్టూ ఉండటాన్ని చూడవచ్చు.
మనకు వారంలో వచ్చే ఐదో రోజు గురువారం. దీనిని ‘గురువు వారం’గా భావిస్తారు. విద్యా ప్రయత్నాలను ప్రారంభించడానికి, ఇతరత్రా ఏదైనా నేర్చుకోవడానికి గురువారం శుభప్రదమని అంటారు. అనేక శైవ క్షేత్రాలలో గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొన్ని ఆలయ సంప్రదాయాలను బట్టి పౌర్ణమి రాత్రులను నిర్వహిస్తారు. ఇలాంటి పౌర్ణమిలలో గురుపూర్ణిమ విశేషమైనది. ఈ తిథి దక్షిణామూర్తి ఆరాధనలకు ప్రత్యేకమైనది.
దాదాపు అన్ని శివాలయాల్లో దక్షిణామూర్తి విగ్రహం ఉన్నా.. దక్షిణామూర్తి ప్రధాన దైవంగా ఉన్నవి కొన్ని ఆలయాలే ఉన్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ మహా కాళేశ్వరుడే దక్షిణామూర్తి. ఇది దక్షిణామూర్తి ఏకైక జ్యోతిర్లింగం.

దక్షిణామూర్తి అలంకారం.. స్వరూపం
దక్షిణామూర్తి అలంకారం, స్వరూపం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మిగతా దైవాలకు భిన్నంగా ఈయన అలంకారం ఉంటుంది.
దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే.. కుడిచెవికి మకర కుండటం, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి.
మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం.
తాటంకం అనేది స్త్రీల అలంకరణ వస్తువు.
ఈ రెండు శివ-శక్తికి సంకేతం.

సనక సనందాదులకు మొదట రెండుగా దర్శనమిచ్చిన ఈ రెండు శక్తులే ఏకాకృతిగా రూపుదాల్చాయి.
దక్షిణామూర్తిది అయ్య, అమ్మవార్ల రూపం.
దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటాయి. ఉత్తరం అనేది జ్ఞానదిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అవుతుంది. అంటే అది యమ (మృత్యు) దిశ.
ఎవరు దేవుడి వైపు చూస్తారో, వారు యముడి (మృత్యువు)ని చూడరు.
యముని చూపు మనపై పడకుండా దక్షిణామూర్తి చూపు ‘నిఘా’ వేస్తుంది.
అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు.
‘ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి’.
అంటే- యముడిని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి అని భావం.
ఈ లోకంలో శాశ్వతంగా దు:ఖాన్ని నివారించగలిగే శక్తి (దాక్షిణ్యం) ఒక్క భగవంతుడికే ఉంది. ఆ దాక్షిణ్యత ప్రకటిత రూపమే దక్షిణామూర్తి.
మనిషిలోని అన్ని దు:ఖాలకు కారణం అజ్ఞానం.
ఆ అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దు:ఖ విమోచనం కలుగుతుంది.
ఆ అజ్ఞానాన్ని (అవిద్య)ను తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి.
వశిష్ట మహర్షి దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకునే బ్రహ్మవిద్యను పొందగలిగాడు.
వశిష్టుడికి దక్షిణామూర్తి సాక్షాత్కరించిన క్షేత్రమే శ్రీకాళహస్తి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దక్షిణామూర్తి విగ్రహమే మొదట కనిపిస్తుంది.
దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి. ఆయన ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఆయన మనలో బుద్ధిని, శక్తిని వృద్ధి చేసి విద్యలను అనుగ్రహిస్తారు.
మౌనమే ఆయన సంభాషణం
భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించేది గురువు మాత్రమే. గురువు అనుగ్రహంతోనే మనం భగవంతుడిని దర్శించగలం. గురువు ద్వారా జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టిన వారే ఆత్మసాక్షాత్కారం సాధించగలరు. అయితే, గురువు లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించిన వాడు మాత్రం పరమేశ్వరుడు ఒక్కడే. అందుకే ఆయన ఆదియోగి అయ్యారు. అటువంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందాలని సప్తర్షులు (ఏడుగురు మహర్షులు) నిశ్చయించుకున్నారు. పట్టు వీడకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. ఆదియోగి (శివుడు) తమతో ఒక్క మాట మాట్లాడకపోయినా, ఏళ్ల తరబడి ఆయన కరుణ కోసం తపించిపోయారు. వారి పట్టుదలను పరీక్షించడానికి శివుడు దశాబ్దాల తరబడి వారికి ఎలాంటి జ్ఞానబోధ చేయలేదు. అయినా వారు పట్టుదల వీడలేదు. పరమేశ్వరుడి దివ్య సముఖంలో తపస్సు చేస్తూ ఉండిపోయారు. చివరకు ఒకరోజు జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారి ముఖాల్లో ప్రకాశించడాన్ని పరమశివుడు గమనించాడు. అటుపై దక్షిణ దిక్కుగా కూర్చుని వారికి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా, జ్ఞానానికి అధిపతి అయితే, ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు. కాగా, దక్షిణామూర్తి నుంచి జ్ఞానాన్ని పొందిన వారు ఏడుగురని కొందరు, నలుగురని మరికొందరు అంటారు.

16 ఏళ్ల బాలుడిగా..
సనక, సనందన, సనాతన, సనత్కుమారులకు దక్షిణామూర్తి వటవృక్షం కింద పదహారేళ్ల బాలుడిగా తేజోమూర్తి రూపులో దర్శనమిచ్చారు. ఆ బాలుడిని చూడగానే వారు ఈయనే తమ గురుమూర్తి అని భావించారు. ఆయన చుట్టూ చేరి ఏడాది పాటు వారు తమ సందేహాలను తీర్చుకున్నారు. ఒకరోజు మాత్రం వీరు సందేహాలు అడగగా, ఆ బాలుడు చిన్ముద్ర రూపం దాల్చి, వీరాసనంలో మౌనంగా కూర్చున్నారు. ఆ మౌనంలోనే శిష్యుల సందేహాలన్నీ పటాపంచలయ్యాయి.

అజ్ఞానం నశించి, పరమశాంతిని పొందారు.
నిజానికి ఇంతటి చిత్రమైన గురుశిష్య కలయిక మరెక్కడా కానరాదు.
ఎందుకంటే, గురువైన దక్షిణామూర్తి పదహారేళ్ల బాలుడు.
ఆయనను ఆశ్రయించిన శిష్యులైన మహర్షులు పరమ వృద్ధులు.
మౌనమే గురువు యొక్క వ్యాఖ్యానము.
దక్షిణామూర్తి యొక్క అమృత చూపులు ప్రసరించినంతనే శిష్యుల అజ్ఞానం నశించి, జ్ఞానం ఉదయించింది. దక్షిణామూర్తిది జ్ఞానావతారం. ఆయన మోక్షదాత. ఆయన ఆనంద స్వరూపుడు.
ఈ ప్రపంచంలో మారిపోతూ ఉండే వాటికి (స్థూల శరీరంతో సహా) ఆరు వికారాలు ఉన్నాయని అంటారు.
అవి- జాయతే (పుట్టుట), అస్తి (మనుగడ సాగించడం), వర్ధతే (పెరుగుట), విపరిణమతే (పరిపక్వమగుట), అపక్షీయతే (క్షీణించడం), నశ్యతి (నశించడం).
జనన మరణాలు ఈ ఆరు వికారాలకు ఉప లక్షణాలు. జ్ఞానాన్ని ప్రసాదించడం ద్వారా వీటిని నివారింపచేయగల సమర్థుడు దక్షిణామూర్తి.

పదహారు దక్షిణామూర్తులు
శైవ సంప్రదాయంలో ప్రధానంగా పదహారు దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి. మేధా దక్షిణామూర్తి, వీణా దక్షిణామూర్తి, యోగ దక్షిణామూర్తి అనే రూపాలు వీటిలో విశిష్టమైనవి. నివృత్తి రూప ధర్మాన్ని జ్ఞానోపదేశం ద్వారా కలిగించడం దక్షిణామూర్తి అవతార ప్రయోజనం.
సూతసంహితలో దక్షిణామూర్తి రూపం గురించి వర్ణన, విశేషాలు ఉన్నాయి. ఇది దక్షిణామూర్తికి సంబంధించిన ప్రామాణిక గ్రంథం. మనకున్న పద్దెనిమిది పురాణాల్లో అన్నిటికన్నా పెద్దది స్కాంద పురాణం. అందులో ఒక భాగమే సూత సంహిత.
ఆదిశంకరాచార్యులు పద్దెనిమిది సార్లు సూత సంహితను చదివి, సర్వ వేదాంత నిర్ణయాన్ని చేస్తూ బ్రహ్మసూత్రాలపై భాష్యాన్ని రచించారు.
ఈ సూత సంహితపై విద్యారణ్య స్వామి వ్యాఖ్య రాశారు. అటువంటి సూతసంహితలో దక్షిణామూర్తి రూపాన్ని ఈ విధంగా వర్ణించారు.
ప్రలంబితజటాబద్ధం చన్ద్రరేఖావతంసకమ్‍
నీలగ్రీవం శరచ్చన్ద్ర చన్ద్రికాబిర్విరాజితమ్‍
‘దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుడు తన వేలాడే జడలను ముడి వేసుకున్నాడు. తలపై చంద్రవంకను అలంకరించుకున్నాడు. నల్లని కంఠము గల ఆయన శరత్కాల చంద్రుని వెన్నెలతో ప్రకాశిస్తున్నాడు’ అని పై శ్లోకానికి భావం.
ఇంకా సూత సంహితలో దక్షిణామూర్తి గురించి అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
– ఆవుపాల వలే తెల్లని ఆకారం గల ఆయన ముఖము చంద్రుని బింబమును పోలి ఉంది. చక్కని చిరునవ్వుతో ఆయన ముఖము ప్రసన్నంగా ఉంది. ఆయన ధ్యాన మార్గంలో తన ఆత్మతత్త్వమునందు నిలిచి ఉన్నారు.
– గంగను దాల్చిన ఆ శివుడు శాంతుడై ఉన్నాడు. ఆయన భుజములు ధగధగలాడే భుజకీర్తులతో అలంకరింపబడి ఉన్నాయి. అన్ని గొప్ప లక్షణాలు గల ఆయన అన్ని రకాల ఆభరణాలను ధరించి ఉన్నారు.
– వీరాసనంలో కూర్చున్న ఆయనకు వేదములే యజ్ఞోపవీతములయ్యాయి. భస్మరేఖలు దాల్చి సుందరముగా ఉన్న ఆయన పాములనే ఆభరణాలుగా అలంకరించుకున్నారు.
– మంగళ స్వరూపుడైన ఆయన పులి చర్మాన్ని వస్త్రంగా ధరించారు. సకల ప్రాణుల యందు ఆత్మ విషయంలో గల అజ్ఞానమే రూపుదాల్చి అప•స్మారుడనే రాక్షసుని రూపంలో ఉంది.
– ఆయన తన కాలిని ఆ అపస్మారుని నడుముపై వేసి ఉంచారు. పాపాలను పోగొట్టే ఆ దక్షిణామూర్తి జ్ఞానముద్రను ధరించారు. శ్రేష్టమైన సకల జ్ఞానాలకు నెలవైన పుస్తకమును ఆయన ఒక చేతిలో పట్టుకుని ఉన్నారు.
– మహత్తత్త్వము మొదలుకుని పృథ్వి వరకు గల తత్త్వములన్నీ రూపుదాల్చి పూసలుగా ఉన్న జపమాలను, ఘటమును ఆయన చేతిలో పట్టుకున్నారు.
పరమానంద స్వరూపుడైన ఆయన శరీరంలో సగ భాగమునకు ఆయన యొక్క పరాశక్తి వ్యాపించి ఉంది.
– ధర్మం వృషభాకారం దాల్చి ఆయనకు వాహనమైంది.

మాయాశక్తియే వటవృక్ష రూపం దాల్చగా, ఆయన మంగళకరమైన ఆ వృక్షము మొదట్లో కూర్చున్నారు. వేదవేత్తలు, ధార్మికులు అయిన రుషులు ఆయన చుట్టూ కూర్చున్నారు.
– అవినాశిని అయిన ఆయన లోకపాలకులకు కూడా ప్రభువు. స్వయంగా గురువు. విద్యలన్నింటికీ ఆయనే ప్రభువు. ఆయనే గురువు. ఆయనకు పుట్టుక మొదలైన భావ వికారాలు లేవు. ఓంకారమే పద్మరూపం దాల్చగా ఆయన ఆ పద్మంలో ఆసీనుడయ్యారు.
– ఆయన స్వరూపమే ప్రాణుల ఆత్మ. ఆయన అటువంటి ఆత్మజ్ఞానమును అందచేసే ప్రాణులకు సర్వదా సంసారం నుంచి విముక్తిని కలిగిస్తారు. పరమదయానిధి అయిన ఆయన జీవుల దు:ఖాలను బాపుతారు. ఆయన సకల ప్రాణులకు హితము చేయుట యందు ప్రీతి కలిగి ఉంటారు.
– దక్షిణామూర్తి తనను ఉపాసించే వారి సకల అభీష్టాలను నెరవేరుస్తారు. ఆ దక్షిణామూర్తి జగత్తు యొక్క సృష్టిస్థితిలయలకు కారణం.

ఆయన రూపం.. అమూర్తం
నిజానికి దక్షిణామూర్తికి ఇతమిద్దమైన రూపమేమీ లేదని అంటారు. అంటే ఆయన ‘అమూర్తి’. కాబట్టి ఆయన ఏ రూపమైనా దాల్చగలరు. ‘దక్షిణ’ అంటే ‘సమర్థ’ అని అర్థం. జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయగల పరబ్రహ్మము ఆయన. కాబట్టే ఆయన దక్షిణామూర్తి అయ్యారు.
ఆయన దక్షిణాముఖంగా చూస్తున్నారు కాబట్టి దక్షిణామూర్తి. దక్షిణ దిక్కుకు అధిపతి మృత్యువు. ఉత్తరం ఈశ్వరుడికి సంకేతం. హిమాలయాలలో మొదలైన గంగ దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుంది. అలాగే జీవుని ఉనికి ఈశ్వరుడి నుంచే మొదలవుతుంది. అయితే కాలక్రమంలో జీవుడు ఈశ్వరుని నుంచి విడివడి సంసారాసక్తుడై మృత్యుదిశగా కొనసాగుతాడు.
కాశీలో గంగ ఉత్తరముఖంగా తిరుగుతుంది. అలాగే, సంసార నిమగ్నుడైన జీవుడు ఉత్తరం వైపు తిరగాలి. అంటే, ఈశ్వరాభిముఖుడు కావాలి. అలా ఉత్తరాభిముఖుడై ఈశ్వరుడిపై దృష్టి నిలిపిన జీవుడికి సంసార సాగరాన్ని దాటడానికి గురు రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఈశ్వరుడు సర్వదా దక్షిణాభిముఖుడై ఉంటాడు.
కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తూ దక్షిణామూర్తి రూపమే. కాశీలో ఉండే విశ్వేశ్వరుని ధ్వజస్తంభం దక్షిణ దిశగానే ఉంటుంది.
సంసారానికి పృష్టభాగం చూపి, ఈశ్వరుడిని దర్శించే జీవుడికి జ్ఞానం ఒసగి మోక్షం ప్రసాదించగల గురు రూపం దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి గురువర్యునికి నమస్కారం
ఆదిశంకరులు దక్షిణామూర్తి అష్టకాన్ని రచించారు. అందులోని ఒక శ్లోకం ఇది..
రాహుగ్రస్త దివాకరేందుసదృశో మాయా సమాచ్ఛాదనాత్‍
సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్‍ సుషుప్తః పుమాన్‍ ।
ప్రాగస్వాస్పమితి ప్రబోధనమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
రాహుగ్రస్త సూర్యచంద్రులు ఏ విధంగా మన దృష్టి పథంలో కనిపించరో అదేవిధంగా మాయ ఆవహించడం వలన సుషుప్తిలో కూడా (జాగ్రత్‍ స్వప్నాల వలే) వ్యక్తికి స్వకీయ ఉనికికి సంబంధించిన నిజమైన ఎరుక ఉండదు (ఈ అవస్థలో కూడా ఆత్మతత్త్వంగా తనను తాను గ్రహించడం లేదు. మాయచే ఆవహించి ఉంటాడు). స్వస్వరూప ఆత్మ చైతన్యం అనుభవరూపకంగా అవగతం అయినపుడే అజ్ఞానం తొలగిపోతుంది. అలాంటి స్థితి కోసం దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.

దక్షిణామూర్తికి నమస్కారం!
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి వాజ్మయంలో ఒక మణిపూస. శంకర భగవత్పాదులైన ఈయన కారణజన్ములు. దైవాంశసంభూతులు. చాలా చిన్న వయసులోనే దైవసన్నిదికి చేరినా, మహాజ్ఞానిగా, తత్త్వవేత్తగా, అసామాన్య ప్రతిభావంతులూనర యతీంద్రులుగా విశ్వఖ్యాతి గడించారు. మూడు దశాబ్దాల కాల పరిమితిలో దశోపనిషత్తులకు, ్ర•హ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాసి, ఆసేతు హిమాచలం వరకు భారతావనిలో పాదయాత్ర చేస్తూ అద్వైత మత స్థాపనకు ఎనలేని కృషి చేసి కృతార్థులైన విద్వాంసుడాయన. మహా మహా పండితులే కాదు.. సామాన్య జనం కూడా ఆయనకు మోకరిల్లి ఆయనకు ప్రణమిల్లారు. ఆయన రచించిన ‘వివేక చూడామణి’ వంటి ప్రకరణ గ్రంథాలు, ‘కనకధార’, ‘సౌందర్యలహరి’ వంటి ఎన్నో స్తోత్ర రత్నమాలలు జనరంజకాలయ్యాయి. ముముక్షువులు వారి గ్రంథాలను తత్త్వజ్ఞానార్జనకు, సంసార బంధ విముక్తికి అధ్యయనం చేసి తరిస్తూ, గృహస్తులు ఆయురారోగ్య సుఖసంపదలకు, విద్యాప్రాప్తికి పారాయణం చేసుకుంటూ ధన్యులవుతున్నారు. శంకరులు కూడా మన సనాతన గురుపరంపరకు ఆద్యులే. జగద్గురువుగా విఖ్యాతి చెందిన ఆయన చిరంజీవి. మానవాళి శ్రేయస్సుకు అంకితమైన మహా మనిషి.

దక్షిణామూర్తి విశ్వగురువు అయితే.. ఆయనను స్తోత్రించిన ఆదిశంకరులు మహా గురువు. ఈన, కేన, కఠ, ముండక, తైత్తిరీయ, ఐతరేయ, శ్వేతాశ్వతర, ఛాందోగ్య, బృహదారణ్యకోపనిషత్తులు శంకరుల వారి శాస్త్ర పరిజ్ఞానం, వ్యాకరణ పటుత్వం, తర్కబలం, మానసోల్లాసం కలిగించే రచనాశైలి.. అన్నీ దక్షిణామూర్తి స్తోత్రంగా వారి ఘంటము నుంచి వెలువడిన ఎనిమిది శ్లోకాల్లో స్పష్టంగా విదితమవుతుంది. దక్షిణామూర్తి అష్టకంగా కూడా ప్రాచుర్యమైన ఈ రచన అద్వైత మతస్తులకే కాక, సంస్క•త భాషా ప్రేమికులందరికీ శిరోధార్యం.
దక్షిణామూర్తి గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానందమూర్తినే స్మరించుకుంటూ చేసిన ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి- స్థితి – లయలకు కారణభూతుడైన పరమ గురువును తన కవితాధారతో స్తుతించడానికే భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది. శంకరాచార్యుల వారి తదనంతర కాలంలో సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి ‘మానసోల్లాస’మనే పేరుతో వార్తికమును, పది భాగాల్లో రమారమి 360 శ్లోకాలలో రాసి సులభతరం చేశారు. అంతేకాక, మరికొన్ని శ్లోకాలను కూడా దక్షిణామూర్తినే స్మరిస్తూ అతిరిక్తంగా రచించారు. తదుపరి కొన్ని వ్యాఖ్యాలు గద్యరూపంలో కూడా వచ్చాయి.
క్లిష్టమైన ఈశ్వరతత్వాన్ని, అద్వైత సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి శంకరులు, సురేశ్వరాచార్యులు వంటి వారు చేసిన కృషి శ్లాఘనీయం. వార్తికములు, వ్యాఖ్యానములు మూల గ్రంథంలో ఇనుమడించిన విషయాన్ని విపులంగా బోధపరుస్తూ, మరికొన్ని అంశాలను కూడా జతచేసి తద్భావాన్ని అందరికీ అందించడానికి రాసిన గ్రంథాలివి.
సురేశ్వరాచార్యుల వారి మానసోల్లాస రీతిలో గద్య కావ్యంగా వచ్చిన వ్యాఖ్యానమే ‘తత్తసుధ’. దీనిని స్వయంప్రకాశులనే యతీంద్రుల వారు పదిహేడవ శతాబ్దంలో రచించినట్టు పండితులు నిర్ధారించారు. మానసోల్లాస వార్తిక గ్రంథానికి కూడా మరో వ్యాఖ్యానాన్ని రామతీర్థుల వారు రచించినట్టు తెలుస్తోంది. వారే శంకరాచార్యుల వారి ఉపదేశ సాహస్రికి కూడా వ్యాఖ్యానం రాశారు.
దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరుల వారి మూల శ్లోకాలకు సురేశ్వరాచార్యుల వారి వార్తిక రూపంలో ఉన్న శ్లోకాలను అన్వయించుకుంటూ క్లుప్తంగా వాటి భావనను ఇలా విశదీకరించవచ్చు.

Review మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top