చెడు చేస్తే కీడు తప్పదు

అనగనగా ఒక రాజు. పరమ క్రూరుడు. అసలు అతనికి దయ అనేదే లేదు. జనులను ఎంతో బాధపెట్టేవాడు. అటువంటి రాజు ఒకనాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ సమావేశపరిచాడు. ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేశాడు.
‘నేను ఈ రోజు నుంచీ ఎవరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయతో ప్రవర్తిస్తాను’. ఈ విధంగా మాట ఇచ్చిన రాజు.. దానికి కట్టుబడి మంచిగా ఉండసాగాడు. కొంతకాలానికి అందరూ అతనిని దయగల మారాజు అని పిలుచుకోసాగారు. మంత్రుల్లో ఒకరికి.. రాజులో ఉన్నట్టుండి ఇంత మార్పు ఎలా సాధ్యమైంది? అనే కుతూహలం కలిగింది. ఒకనాడు రాజు వద్దకు వెళ్లి ఇదే విషయాన్ని ఆయనను అడిగాడు.
‘మీలో ఉన్నట్టుండి ఇంత మార్పు ఎలా వచ్చింది? కారణం చెబుతారా?’ అని ప్రశ్నించాడు.
రాజు సమాధానం ఇలా చెప్పాడు.
‘నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతూ ఉంటే ఒక వేటకుక్క నక్కను వెంటాడుతోంది. నక్క కష్టపడి తన గుహలోకి వెళ్లేలోపే వేటకుక్క దాని కాలును దొరకబుచ్చుకుంది. దాన్ని గట్టిగా కొరకడంతో నక్క కుంటిదైపోయింది. అదేరోజు కొద్దిసేపటి తరువాత నేను పక్కన ఉన్న ఊరికి వెళ్లాను. అక్కడ అదే వేటకుక్క ఉంది. ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదికి విసిరాడు. ఆ రాయి తగిలి వేటకుక్క కాలు దెబ్బతింది. అది కుంటుకుంటూ వెళ్లిపోయింది. అదే మనిషి కొంచెం దూరం వెళ్లాడో లేదో అతనిని ఆ దారిన వెళ్తున్న గుర్రం చాచిపెట్టి తన్నింది. అతను కిందపడ్డాడు. కాలు విరిగింది. ఆ గుర్రం అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లబోయింది. చూసుకోకుండా ఒక గుంతలో పడి కాలు విరగ్గొట్టుకుంది. వరుసగా జరిగిన ఈ సంఘటనలతో నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు కుక్క కరిస్తే, కుక్క కాలు మనిషి విసిరిన రాయి వల్ల విరిగింది. మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే, గుర్రం ఒక గుంతలో పడి కాలు విరగ్గొట్టుకుంది.
ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ రూపంలోనైనా మనకీ జరిగి తీరుతుందన్న సత్యం నాకు ఈ వరుస సంఘటనలతో తెలిసి వచ్చింది. అప్పుడు ఇంతకాలం నా వల్ల ఎందరు బాధపడ్డారో కదా అని గుర్తుకువచ్చి బాధపడ్డాను. అప్పటి నుంచి అందరితో దయతో ఉండాలనే నిర్ణయానికి వచ్చాను’ అని రాజు వివరించాడు.
ఇదంతా విన్న మంత్రి- ‘ఈ రాజుకు చాదస్తం ఎక్కువైనట్టుంది. రాజును ఇప్పుడే సింహాసనం నుంచి తప్పించి కిరీటం నేను దక్కించుకోవాలి’ అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి తన ముందున్న మెట్లు చూసుకోలేదు. మెట్ల మీద జారిపడి మెడవిరగ్గొట్టుకున్నాడు. రాజు కావడం కాదు కదా, కనీసం తన పనులు తాను చేసుకోలేక మరొకరిపై ఆధారపడే స్థితికి చేరుకున్నాడు.
ఒకరికి చెడు చేయాలని చూస్తే, చేస్తే ఏదో రూపంలో తిరిగి మనకీ అదే చెడు జరిగి తీరుతుంది. అదే ఈ చిన్న నీతి కథ సారాంశం.

Review చెడు చేస్తే కీడు తప్పదు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top