టిక్..టిక్.. టిక్..

హైదరాబాద్ ఐకాన్‍ చార్మినార్‍లో బిగించిన పురాతన గడియారం నూట ఇరవై ఎనిమిది (128) సంవత్సరాలుగా అలుపు లేకుండా తిరుగుతూనే ఉంది. 1989 నుంచి ఇప్పటి వరకు ఇది ఒక్క సెకను కూడా ఆగలేదు. అప్పట్లో ఈ గడియారాన్ని అరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్‍ నగరంలో ఇంకా చారిత్రక నిర్మాణాలకు చాలా గడియారాలు ఉన్నా.. ఒక్క చార్మినార్‍ గడియారం మాత్రమే నిరంతరాయంగా పనిచేస్తోంది. బ్రిటిష్‍ పాలకులు తమ పాలన హయాంలో ప్రజల సౌకర్యార్థం ఎత్తయిన ప్రాంతాల్లో గడియారాలను అమర్చేవారు. గడియారం అంతగా ప్రాచుర్యంలో లేని ఆ సమయంలో ఈ క్లాక్‍ టవర్లు ఎంతో ఉపయోగపడేవి. గంట గంటకూ ఈ గడియారాలు చేసే శబ్దాల ఆధారంగా ప్రజలు తమ దినచర్యను ప్రారంభించి ముగించే వారు. చార్మినార్‍ను 1591లో నిర్మించారు. 1889లో ఆరో నిజాం మీర్‍ మహబూబ్‍ ఆలీఖాన్‍ పాలనా కాలలో చార్మినార్‍ మొదటి అంతస్తు మధ్యలో నాలుగువైపులా గడియారాలు అమర్చారు. ఆ రోజుల్లో పాత నగరం ప్రజలు ఈ గడియారం సమయాన్ని బట్టే తమ దినచర్యను ప్రారంభించే వారు. చార్మినార్‍లో అమర్చిన మూడు గడియారాలు ఒకేవిధంగా ఉంటే, ఉత్తర దిక్కును ఉండే గడియారం భిన్నంగా ఉంటుంది. ప్రతి గంటకు ఉత్తర దిక్కులో ఉన్న గడియారం గంటలు కొడుతుంది. మిగతా గడియారాల కంటే ధర ఎక్కువ. చార్మినార్‍ గడియారం గొప్పతనం ఏమిటంటే, ఏ రోజు దానిని ప్రతిష్టించారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆగకుండా పని చేస్తోంది. సికందర్‍ఖాన్‍ అనే వ్యక్తి ప్రస్తుతం చార్మినార్‍ గడియారాల నిర్వహణను చూస్తున్నారు. ఆయన 1962 నుంచి ఈ పనిలో ఉన్నారు. రోజుకు ఒకసారి గడియారానికి ‘కీ’ ఇస్తారు. చార్మినార్‍ గడియారం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ గడియారం నిర్వహణ బాధ్యతలను సికిందర్‍ఖాన్‍ తాతగారికి నిజాం పాలకులు అప్పగించారు. అప్పటి నుంచీ వారసత్వంగా వస్తూ, ప్రస్తుతం మూడో తరానికి చెందిన సికిందర్‍ఖాన్‍ ఆ బాధ్యతలు చూస్తున్నారు. చార్మినార్‍ గడియారం బరువు ఇరవై ఐదు (25) కేజీలు ఉంటుంది. ఇంగ్లండ్‍లో తయారు చేసిన మెకానికల్‍ గడియారం ఇది. చార్మినార్‍లో ఏర్పాటు చేసిన నాలుగు గడియారాలలో ఉత్తర దిక్కున ఏర్పాటైన గడియారం ధర రూ.60,000. మిగతా మూడు గడియారాలను రూ.30,000 చొప్పున కొనుగోలు చేశారు. విచిత్రం ఏమిటంటే, హైదరాబాద్‍ నగరంలో బ్రిటిషర్ల కాలంలో దాదాపు పది ప్రాంతాల్లో క్లాక్‍టవర్లలో భారీ గడియారాలను బిగించారు. మిగతా అన్నిచోట్లా ఇవి దెబ్బతినగా, ఒక్క చార్మినార్‍ గడియారాలు మాత్రమే మొరాయించకుండా నాటి నుంచి నేటి వరకు ‘టిక్‍.. టిక్‍..టిక్‍’మంటూ కాలాన్ని లెక్కిస్తున్నాయి. చార్మినార్‍ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులు ఈ గడియారాల పనితీరును కూడా చూసి ముగ్ధులవుతుంటారు.

Review టిక్..టిక్.. టిక్...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top